CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: ఇంటిలిజెంట్
నటీనటులు: సాయిధరంతేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, రాహుల్ దేవ్ తదితరులు
సంగీతం: ఎస్ఎస్ థమన్
కథ: ఆకుల శివ
కథనం, దర్శకుడు: వివి వినాయక్
ఒకట్రెండు కాదు నాలుగు ఫ్లాపుల తర్వాత ఇంటిలిజెంట్ సినిమాతో వచ్చాడు సాయిధరంతేజ్. ఈ సినిమా ఎలాగైనా తన కెరీర్ కు బూస్టప్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయి. మరి వినాయక్ ఈ హీరో ఆశల్ని నిలబెట్టాడా..?
కథ:
తేజ(సాయిధరంతేజ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పక్కవాళ్లకు సాయం చేయడం ఈయనకు అలవాటు. అలా ఎన్నో వందల మందిని ఆదుకుంటాడు. తన గాడ్ ఫాదర్ (నాజర్) నుంచి ఈ అలవాటు నేర్చుకుంటాడు తేజ. ఆ గాడ్ ఫాదరే తేజకు బాస్ కూడా. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో తేజ బాస్ ను కొందరు మాఫియా బెదిరిస్తారు. ఆఫీస్ తమ పేర రాయాలంటూ వార్నింగ్ ఇస్తారు. దానికి ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపేస్తారు. కంపెనీ తమ పేరు మీద రాయించుకుంటారు. తన బాస్ ఎలా చనిపోయాడు.. ఎందుకు చనిపోయాడు.. తేజ ధర్మాభాయ్ గా ఎందుకు మారాడు..? అనేది మిగిలిన కథ..
కథనం:
బ్రాండ్ చూసి కొన్ని వస్తువులు గుడ్డిగా కొనేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఆ బ్రాండ్ కూడా మోసం చేస్తుంటుంది.. ఇప్పుడు ఇంటిలిజెంట్ కూడా అంతే.
వినాయక్ ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడు.. అనుకుని వెళ్తే అదే బ్రాండ్ తో తల బొప్పి కట్టించాడు ఈ దర్శకుడు. అర్థం పర్థం లేని సీన్స్ మధ్య.. అసందర్భంగా వచ్చే పాటల మధ్య.. థియేటర్స్ లోకి ఎందుకొచ్చామో తెలియని అయోమయం సినిమా మొదలైన కాసేపటికే వచ్చేస్తుంది. అసలు ఇది వినాయక్ చేసిన సినిమానే అని చాలాసార్లు అనుమానం వచ్చేలా ఉంది ఈ చిత్రం. టైటిల్ ఇంటిలిజెంట్ అని పెట్టుకున్నా.. కథలో, కథనంలో మాత్రం ఎక్కడా ఇంటిలిజెన్స్ అయితే కనిపంచలేదు. అదే పాత కథ.. దానికి మరింత పాత కథనంతో చాలా చోట్ల విసుగు తెప్పించాడు వినాయక్.
గతంలో కథ రొటీన్ గా ఉన్నా కామెడీతో కవర్ చేసే టాలెంట్ వినాయక్ సొంతం. కానీ ఇంటిలిజెంట్ లో అది ఏ కోశానా కనిపించలేదు.. మొత్తం అవసరం లేని హంగామా తప్ప. ఛమక్ ఛమక్ రీమిక్స్ సాంగ్ కూడా నిరాశ పరుస్తుంది. ఆ పాటకు ముందు వినాయక్ ఎంచుకున్న సిచ్యువేషన్ ఫ్యాన్స్ కు కోపం కూడా తెప్పిస్తుంది. చిరంజీవి పాటను ఇలానా వాడేది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయిధరంతేజ్ మరోసారి కథపై కాన్సట్రేట్ చేయకుండా దర్శకుడు బ్రాండ్ కు పడిపోయాడు.. కెరీర్ ను హై పిచ్ లో మొదలుపెట్టి.. పాతాళానికి పడిపోతున్నాడు మెగా మేనల్లుడు.. హీరో ఇంట్రడక్షన్ నుంచి రొటీన్ మూసలోనే సాగిపోయింది కథ. ఫస్ట్ సీన్ లోనే ఫైట్.. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్.. ఆమెతో కాసేపు ప్రేమ సీన్స్.. ఇలా మూసలో వెళ్లిపోయాడు వినాయక్. మధ్యలో చిరు సీన్స్ కూడా కొన్ని వాడేసాడు. ముఖ్యంగా ఘరానా మొగుడులో బాస్, ఎంప్లాయ్ మధ్య సీన్స్ గుర్తు చేసాడు వినాయక్. నాయక్ ను తలపించే సీన్స్ అన్నీ రిపీట్ అవుతుంటాయి. అక్కడ నాయక్ భాయ్ పేరు చెప్పి భయపెట్టినట్లు ఇక్కడ ధర్మాభాయ్ పేరు చెప్తారంతే. చివరివరకు కూడా ఆసక్తి లేని కథనంతో విసుగు పుట్టించాడు వినాయక్.
నటీనటులు:
సాయిధరంతేజ్ మరోసారి ఈజ్ ఉన్న పాత్రలో నటించాడు. తన నటనకు పేరు పెట్టలేం కానీ ఇలాంటి పాత్రల్లోనే ఫిక్స్ అయిపోతే మాత్రం సాయికి కష్టాలు తప్పవు. లావణ్య త్రిపాఠి పర్ ఫెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ పాత్రలో నటించింది. అంటే పాటలకు తప్ప కథకు పనికిరాని పాత్ర అన్నమాట. సాయిధరంతేజ్ గాడ్ ఫాదర్ గా నాజర్ బాగా నటించాడు. రాహుల్ దేవ్, కాశీ విశ్వనాథ్ వీళ్లంతా పాత్రలకు తగ్గట్లు బాగానే చేసారు.
టెక్నికల్ టీం:
థమన్ మ్యూజిక్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఒక్క పాట కూడా ఆకట్టుకోలేదు. ఛమక్ ఛమక్ పాటను మాత్రం పెద్దగా మార్చకుండా అలాగే పెట్టేసాడు థమన్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోలేదు. ఇక పాటల్లో లిరిక్స్ వినిపించడమే కష్టమైపోయింది. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఛమక్ ఛమక్ పాట విజువల్ గా బాగా తీసాడు. ఇక శేఖర్, జానీ మాస్టర్స్ కొరియోగ్రఫీ బాగుంది. సాయితో డాన్సులు ఫుల్ గా వేయించారు. కథ రచయితగా ఆకుల శివ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటికే వాడేసిన కథను మళ్లీ ఇచ్చాడు. దర్శకుడిగా వినాయక్ ఇంతగా ఎప్పుడూ నిరాశ పరచలేదు. అఖిల్ తర్వాత అంత నిరాశపరిచిన సినిమా ఇదే.
చివరగా:
లాజిక్ లేని ఇంటిలిజెంట్..