ఈ ఫేక్ రికార్డుల గోల ఏల‌..?


ఇప్పుడు ఇండ‌స్ట్రీ టైమ్ బాగుంది సినిమాలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. జ‌న్యూన్ గానే సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ద‌ర్శ‌క నిర్మాత‌లు చూపిస్తున్న అత్యుత్సాహం మంచి సినిమాల‌ను కిల్ చేస్తున్నాయి. వాటిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. అది కూడా ఎక్కువ‌గా మ‌హేశ్ సినిమాల‌కే జ‌రుగుతుండ‌టం అభిమానుల‌ను కంగారు పెట్టించే విష‌యం. దూకుడు నుంచి ఇది మొద‌లైంది.
భ‌ర‌త్ అనే నేను కూడా ఇప్పుడు బాగా ఆడుతుంది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌చ్చాయంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ మూడు రోజుల్లో కూడా ఈ మార్క్ అందుకోలేదు చిత్రం. తీరా చూస్తే 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ అందుకుంది భ‌ర‌త్ అనే నేను. కానీ ఆ తొందర తాల‌లేక ఎలాగైనా వ‌చ్చే వ‌సూళ్లే క‌దా అని రెండు రోజుల్లోనే త‌మ సినిమా సెంచ‌రీ కొట్టేసింద‌ని పోస్ట‌ర్లు విడుద‌ల చేసారు. దాంతో సినిమా నిజంగానే బాగా ఆడుతున్నా కూడా రికార్డుల కోసం పాకులాట ఇక్క‌డ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.
ఎలాగూ మ‌హేశ్ కు ఉన్న ఇమేజ్ తో ఈ చిత్రం కొన్ని రికార్డులు సృష్టిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్లు చేస్తోన్న ప్ర‌చారం సినిమా స్థాయిని త‌గ్గిస్తుంది. మొన్న‌టికి మొన్న రంగ‌స్థ‌లం విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. 175 కోట్లు అది వ‌సూలు కాక‌ముందే పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అక్క‌డితో ఆగ‌కుండా బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టిఎఫ్ఐ అన్నారు. బాహుబ‌లి అక్క‌డెవ‌రికి అంద‌ని ఎత్తులో ఉంది. ఒక‌వేళ నిజంగానే అలా వేసుకోవాల‌ని అనుకున్న‌పుడు నాన్ బాహుబ‌లి అంటూ పోస్ట‌ర్ లో మెన్ష‌న్ చేయాలి. ఎక్క‌డో చిన్న‌గా ఎవ‌రికి క‌నిపించ‌ని విధంగా వేసి..
బిగ్గెస్ట్ హిట్ అని పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం మాత్రం కాస్త అత్యుత్సాహమే. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను విష‌యంలోనూ రికార్డుల గోల ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ ప్ర‌చారం వ‌ల్ల సినిమాలు జ‌న్యూన్ గానే ఆడుతున్నా కూడా ఫేక్ రికార్డులు అంటూ ర‌చ్చ జ‌రుగుతుంది. మ‌రి ఇప్ప‌టికైనా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ రికార్డుల‌పై మోజు త‌గ్గించుకుంటారో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here