నటీనటులు: బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, ప్రకాశ్ రాజ్, నటాషా దోషీ తదితరులు
నిర్మాత: సి కళ్యాణ్
సంగీతం: చిరంతన్ భట్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కేయస్ రవికుమార్
సంక్రాంతి హీరో అంటే తెలుగు ఇండస్ట్రీకి బాలయ్య బాగా గుర్తొస్తాడు. ఈయన సినిమాలు చాలా వరకు సంక్రాంతికి వచ్చి సంచలనాలు సృష్టించాయి. గతేడాది శాతకర్ణితో సహా. ఇప్పుడు మరోసారి వచ్చాడు ఈ హీరో. మరి ఈ సారి కూడా హిట్ కొడుతున్నాడా.. జై సింహా ఎలా ఉంది..?
కథ:
నరసింహా(బాలయ్య) ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్లి నిలదీస్తుంటాడు.. కుదిర్తే తాట తీస్తుంటాడు. అతడికి ఓ గాళ్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె గౌరి(నయనతార). గొడవలకు వెళ్తోన్న కారణంగా గౌరిని ఇచ్చి చేయడానికి ఆమె తండ్రి (ప్రకాశ్ రాజ్)నో చెప్తాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల గౌరీకి దూరంగా వెళ్లిపోతాడు నరసింహా. కొడుకుతో కలిసి తమిళనాడులోని కుంభకోణం వెళ్లిపోతాడు. అక్కడ ఆలయ ధర్మకర్త మురళీకృష్ణ(మురళీమోహన్) ఇంట్లోనే ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ధర్మకర్త కూతురు (నటాషా) ఓ యాక్సిడెంట్ చేసి కుంభకోణంలోని దాదా కనియప్పన్(కాలకేయ ప్రభాకర్) తమ్మున్ని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ నేరం తనమీద వేసుకుంటాడు నరసింహా. ఆ తర్వాత అతడు చనిపోతాడు. దాంతో నరసింహాపై పగ పెంచుకుంటాడు కనియప్పన్. అదే టైమ్ లో తన కొడుకు చావుకు కారణమైన నరసింహాను చంపాలని పగతో రగిలిపోతుంటాడు మరో విలన్(అశుతోష్ రాణా). వీళ్ళందరి మధ్యలోకి గౌరి(నయనతార) వస్తుంది. అసలు గౌరీకి నరసింహాకు సంబంధం ఏంటి.. ఎందుకు అందరికి నరసింహా టార్గెట్ అవుతాడు అనేది కథ.
కథనం:
మాస్.. ఈ పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది.. మనం చూస్తున్నది రొటీన్ సినిమా అని తెలుసు.. తెలిసిన కథ అని తెలుసు.. నెక్ట్స్ జరగబోయే సీన్ ఏంటో కూడా ముందే అర్థమైపోతుంది. కానీ మాస్ పవర్ లోనే ఏదో ఉంది.. దాని ముందు అన్నీ తేలిపోతాయి ఒక్కోసారి. జై సింహా విషయంలో ఇదే జరిగింది. బాలయ్య ఇమేజ్ ఈ సినిమాకు శ్రీరామరక్ష. మరోసారి తన మాస్ స్టామినా ఏంటో చూపించాడు ఈ చిత్రంతో. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తోన్న రొటీన్ రివేంజ్ డ్రామానే మరోసారి నమ్ముకున్నాడు బాలయ్య. కాకపోతే దానికే రేసీ స్క్రీన్ ప్లే జోడించి పరుగులు పెట్టించాడు కేఎస్ రవికుమార్. ఓ వైపు ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని.. సెకండాఫ్ ను ఫ్యామిలీస్ కు రాసిచ్చేసాడు. ఫ్యాన్స్ కు ఏదైతే నచ్చుతుందో దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు. ఇక బాలయ్య ఈ ఏజ్ లోనూ డాన్సులు కుమ్మేసాడు. ఒక్క జజ్జనక పాట చాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడానికి. ఫస్టాఫ్ లో బాలయ్య ఎలివేషన్ సీన్స్ బాగా పేలాయి.. ముఖ్యంగా బ్రాహ్మణుల సీన్.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి.
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయింది. ఎమోషన్ కోసం కథకు బ్రేకులు పడక తప్పలేదు.. బాలయ్య, నయన లవ్ ట్రాక్ ఫన్నీగా ఉంది..
అయితే కథలో ప్రతీసారి స్పీడ్ బ్రేకర్ మాత్రం కచ్చితంగా బ్రహ్మానందం కామెడీనే. కథలో కావాలని ఇరికించినట్లే అనిపించాయి ఈ సీన్స్ అన్నీ.
బాలయ్య ఇలాంటి మాస్ కారెక్టర్స్ ఇదివరకే చేసాడు. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు నుంచి చేస్తున్నది ఇలాంటి అజ్ఞాతవాసి పాత్రలే. మరోసారి ఇదే ఫ్లాష్ బ్యాక్ ఉన్న స్టోరీని తీసుకున్నాడు కేఎస్ రవికుమార్. దానికి కూడా తన రేసీ స్క్రీన్ ప్లే జోడించాడు. అయితే నయనతార, బాలయ్య మధ్య లవ్ సీన్స్ మాత్రం ఆకట్టుకోలేదు. అందుకే ఫన్నీగా సీన్స్ రాసుకున్నాడు. విలన్ కొడుక్కి ఎంపి కాకుండా హీరో అడ్డుపడటం.. ఆ తర్వాత అతడు ఉరేసుకోవడం.. దాంతో హీరోపై విలన్ పగ పెంచుకోవడం.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన సీన్లే.. కానీ వాటిని కూడా మాస్ కు రీచ్ అయ్యేలా తెరకెక్కించాడు కేయస్ రవికుమార్. క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగానే పండించాడు. అయితే మరీ త్యాగాలు చేయడం మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తుంది.
నటీనటులు:
బాలయ్య మరోసారి బాగా చేసాడు. ఈయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సమరసింహారెడ్డి నుంచి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు బాలయ్య. మరోసారి అదే అజ్ఞాతవాసిగా నటించాడు. నయనతార ఉన్నంతలో బాగానే చేసింది. హరిప్రియ ఓకే. నటాషా దోషీ పాత్ర కేవలం అందాలకే పరిమితమైంది. ప్రకాశ్ రాజ్ మరోసారి తనకు అలవాటైన తండ్రి పాత్రలో మెప్పించాడు. విలన్ గా అశుతోష్ రాణా ఓకే.. కాలకేయ ప్రభాకర్ కూడా బాగానే చేసాడు. బ్రహ్మానందం పెద్దగా ఆకట్టుకోలేదు.
టెక్నికల్ టీం:
సంగీతం ఈ చిత్రానికి మైనస్ గా మారింది. శాతకర్ణికి బాగానే మ్యూజిక్ ఇచ్చిన ఈయన జై సింహాకు మాత్రం ఊహించినంత ఇవ్వలేదు. అయితే జజ్జనక పాట మాత్రం ఫ్యాన్స్ కు పిచ్చెక్కించడం ఖాయం. సినిమాటోగ్రఫీ పర్లేదు. 90ల్లో సినిమా చూసినట్లుగా అనిపించింది. ఇక ఎడిటింగ్ వీక్. కథ విషయంలో కేఎస్ రవికుమార్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. కథనం వేగంగా ఉండటం ఈ చిత్రానికి బలం. తెలిసిన కథనే రేసీ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించాడు రవికుమార్. ఓవరాల్ గా మాస్ కు ఈ చిత్రం పండగ.
చివరగా:
జై సింహా.. రొటీన్ రూట్ లో గర్జించిన సింహం..
Post Views: 57