నటీనటులు: రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపిక పదుకొనే..
నిర్మాత : ఎస్.ఎల్.బి.ఫిలిమ్స్, వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్
సంగీతం : సంజయ్ లీలా బన్సాలి, సంచిత్ బల్హార
సినిమాటోగ్రఫర్ : సుదీప్ ఛటర్జీ
ఎడిటర్ : రాజేష్ జి. పాండే
కథనం, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
కొన్నిరోజులుగా వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన చిత్రం పద్మావతి. బాలీవుడ్ లో ఈ చిత్రం తప్ప మరో చర్చ కూడా లేదు. 40 రోజుల కిందే రావాల్సిన సినిమా ఇప్పుడొచ్చింది. మరి నిజంగానే ఈ చిత్రం వివాదాలకు తెరతీస్తుందా.. లేదంటే గర్వపడేలా ఉందా..?
కథ:
మేవాడ్ రాజపుత్ మహారాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్) సింహళ దేశానికి ముత్యాల కోసం వేటకు వస్తాడు. అదే సమయంలో వేట సాగిస్తున్న రాణి పద్మావతి(దీపిక పదుకొనే) వేసిన బాణం రాజుగారిని గాయపరుస్తుంది. ఆ గాయం తగ్గే క్రమంలోనే వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. చిత్తోడ్ కు పద్మావతిని తీసుకొస్తాడు రతన్ సింగ్. వారి జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో రాజగువరువు చేసిన కుతంత్రాల వల్ల చిత్తోడ్ పై ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జి(రణ్ వీర్ సింగ్) దృష్టిని చిత్తోడ్ రాజ్యం వైపు మళ్లిస్తాడు. యుద్ధానికి వచ్చి సంధికని నమ్మించి రతన్ సింగ్ ను ఢిల్లీకి తీసుకెళ్లి బంధిస్తాడు. ఆ తర్వాత పద్మావతి ఏం చేసింది.. ఎలా ఖిల్జీ నుంచి తన రాజ్యాన్ని.. మానాన్ని కాపాడుకుంది అనేది మిగిలిన కథ..
కథనం:
సెన్సార్ తూట్లు.. విడుదలకు పాట్లు.. ప్రభుత్వాల బెదిరింపులు.. కర్ణిసేన వార్నింగులు.. ఇన్ని గాయాలను దాటుకుని రానే వచ్చింది రాణి పద్మావతి. చరిత్ర ఏం చెప్పిందో.. చరిత్రలో ఏముందో చాలా మందికి తెలియదు. కానీ అదేంటో భన్సాలీకి బాగా తెలుసు. లేదంటే ఇంత సాహసం చేయడు. ఈయన చూపించిన పద్మావతి చేతులెత్తి దండం పెట్టేలా ఉంది. శత్రువు కన్ను కాదు కదా.. కనీసం నీడను కూడా తాకనివ్వని వీరనారి పద్మావతి. ఈ చిత్రం చూసిన తర్వాత కర్ణిసేన.. రాజపుత్ వంశస్థులు.. గర్వంతో ఉప్పొంగిపోతారే కానీ ఎక్కడా తల దించుకునేలా అయితే లేదు. రాజ్ పుత్ ల సాహసం.. ధైర్యం.. వాళ్ల తెగింపు ఎలా ఉంటాయో చూపించిన భన్సాలీ.. రాజపుత్రికల ఆత్మగౌరవం ఎంత స్థాయిలో ఉంటుందో కూడా చక్కగా ఆవిష్కరించాడు. ఫస్టాఫ్ అంతా కథలోకి తీసుకెళ్లడానికి నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ మొదలైన తర్వాత క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ అద్భుతమే. భన్సాలీ ఊహలకు దీపిక.. షాహిద్.. రణ్ వీర్ ప్రాణం పోసారు. అయితే ఈ చిత్రంలో ప్రేక్షకుడు కాస్త నిరుత్సాహపడే విషయం మాత్రం యుద్ధ సన్నివేశాలే. ఏదో ఉంటాయని అనుకున్న వాళ్లకు ఎమోషన్ తోనే కథ నడిపించాడు కానీ యుద్ధాలు పెద్దగా పట్టించు కోలేదు దర్శకుడు.
తన మార్క్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు సంజయ్ లీలా భన్సాలీ. పైగా అతడి విజువల్ గ్రాండియర్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోవడం ఖాయం. ఫస్టాఫ్ అంతా పద్మావతి ప్రేమ.. పెళ్లి.. అల్లాఉద్దీన్ రాజ్యకాంక్షను చూపించిన భన్సాలీ.. సెకండాఫ్ ను పూర్తిగా ఎమోషనల్ గా నడిపించాడు. కథ ఎక్కడా తప్పుదోవ పట్టుకుండా.. ముఖ్యంగా పద్మావతి, ఖిల్జీ మధ్య సీన్స్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు. జీవితంలో ఒక్కసారి కూడా ఖిల్జీ తాను కలలు కన్న పద్మావతిని చూడడు. ఆ స్క్రీన్ ప్లే మాత్రం భన్సాలీ చాలా అద్భుతంగా రాసుకున్నాడు. రతన్ సింగ్ ను విడిపించే క్రమంలో పద్మావతి తెలివితేటలు.. ఆ తర్వాత ఖిల్జీ దండయాత్ర సమయంలో తమను తాము అర్పించుకునే సన్నివేశాలు ఇవన్నీ రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కించాడు భన్సాలీ. మొత్తంగా పద్మావతి భన్సాలీ నుంచి వచ్చిన మరో క్లాసిక్ అనడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులు:
పద్మావతిగా దీపిక పదుకొనే తప్ప మరొకరు చేయలేరు. ఈ చిత్రం చూసిన తర్వాత అదే మాట అంటారు ఎవరైనా..! రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ తర్వాత మరోసారి తనలోని నటిని నిద్ర లేపింది దీపిక. ఈ పాత్ర కోసమే పుట్టిందేమో అనేంతగా ఒదిగిపోయింది. ఇక అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రకు ప్రాణం పోసాడు రణ్ వీర్ సింగ్. ఈయన విలనీ చూసి నిజంగానే కొన్ని చోట్ల భయం పడుతుంది.. ఇంకొన్ని చోట్ల మనకే చంపాలనేంత కసి వస్తుంది. పద్మావతి కోసం పిచ్చోడైపోయే పాత్రలో జీవించాడు రణ్ వీర్. ఇక ఈ రెండు పాత్రలకు సపోర్టింగ్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ బాగా చేసాడు. ఖిల్జీ భార్యగా అదితిరావ్ హైద్రీ బాగా చేసింది. మిగిలిన పాత్రలన్నీ వీళ్లను కనెక్ట్ చేసుకుంటూ కథలో కలిసిపోయాయి.
టెక్నికల్ టీం:
దర్శకుడే సంగీత దర్శకుడు అయితే ఎంత లాభం ఉంటుందో భన్సాలీ సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. తన ప్రతీ సినిమాను మ్యూజికల్ వండర్ అయ్యేలా చూసుకుంటాడు భన్సాలీ. ఇది కూడా అంతే. పద్మావతికి అద్భుతమైన ట్యూన్స్ తో పాటు ఒళ్లు గగ్గురపొడిచేలా ఆర్ఆర్ ఇచ్చాడు భన్సాలీ. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతమే. విజువల్ ఎఫెక్ట్స్ చూసి వారేవ్వా అనుకోవాల్సిందే. ముఖ్యంగా ఆ కట్టడాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో..? ఆ నాటి వైభవాన్ని గుర్తు చేసేలా రాజ్యాన్ని పునఃసృష్టించాడు భన్సాలీ. ఇక దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు ఈ దర్శకుడు. తాను చేస్తున్నది ఓ సాహసం అని తెలిసినా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా చేసాడు భన్సాలీ.
చివరగా:
పద్మావతి.. చరిత్ర నేర్పిన పాఠం..
Post Views: 57