టాలీవుడ్ లో 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. వీళ్ల నుంచి సినిమా వచ్చిందంటే హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ వచ్చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల జోరు కూడా అలాగే ఉంది. ఒకటి రెండు కాదు.. ఒకేసారి అరడజన్ సినిమాలు నిర్మిస్తున్నారు వీళ్లు.
దిల్ రాజు మాత్రమే ఇంత బిజీగా ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈయనకు పోటీగా మైత్రి పోటెత్తుతుంది. తాజాగా వీళ్ళ ఖాతాలోకి బాలయ్య కూడా వచ్చి చేరాడని తెలుస్తుంది. బోయపాటి శీనుతో ఈయన చేయబోయే సినిమాను మైత్రి నిర్మించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే వీళ్లు చేసిన సింహా.. లెజెండ్ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మూడో సినిమాకు కూడా సిద్ధమయ్యారు ఈ జోడీ.
జనవరి నుంచి చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ ను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంటున్నారు. దీనికోసం అటు బాలయ్యకు.. ఇటు బోయపాటికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్.. నాగచైతన్య సవ్యసాచి.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ.. సంతోష్ శ్రీనివాస్ తెరీ రీమేక్.. విఐ ఆనంద్ డిస్కోరాజా సినిమాలను నిర్మించనున్నారు. ఇలా వచ్చే రెండేళ్లు ఈ నిర్మాణ సంస్థే టాలీవుడ్ లో రచ్చ చేయబోతుంది.