మోహన్ బాబు కు మరో అరుదైన గౌరవం

ప్రముఖ నటుడు, విద్యావేత్త అయిన Dr.మోహన్ బాబు కు  ఏం.జి.ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. అక్టోబర్ 4 న డాక్టరేట్ ప్రధానోత్సవం చెన్నై లో జరగనుంది. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి.

మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ తో గౌరవించింది .

నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది  బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన ‘ఏషియన్ లైట్’ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. అదే కార్యక్రమంలో ఆయనకు ‘ప్రనామ్’ అనే అవార్డు తో సత్కరించి, ఆయన చిత్రాల లోని ఉత్తమ డైలాగులను ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

మోహన్ బాబు 500 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన సొంత బ్యానర్ అయిన ‘శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన నటించి నిర్మిస్తున్న ‘గాయత్రి’ అనే చిత్రం షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. మోహన్ బాబు రాజ్య సభ ఎం.పి. గా కూడా పని చేసారు. ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో  కె.జి. నుండి పి.జి. దాక 20,000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

విద్యానికేతన్ భారత దేశంలోనే ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్దగా పేరుగాంచింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తుంది. అంతేకాకుండా 25% విద్యార్థులకు వారి ఆర్ధిక స్థోమత ప్రాతిపదికన కుల మతాలకు అతీతంగా ఉచిత విద్యను అందిస్తుంది విద్యానికేతన్.