CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ : చిలసౌ
నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, రోహిణి, జయప్రకాశ్, వెన్నెల కిషోర్..
సంగీతం : ప్రశాంత్ విహారి
విడుదల : అన్నపూర్ణ స్టూడియోస్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
భారీ సినిమాలే కాదు.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు కూడా గోల్డెన్ టైమ్ నడుస్తుంది. ముఖ్యంగా చిన్న కథలను కూడా చెప్పే విధంగా చెప్తే ఇట్టే కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సుశాంత్ కూడా ఇదే చేసాడు. తొలి హిట్ కోసం ఇలాంటి క్యూట్ ప్రేమకథను నమ్ముకున్నాడు. మరి చిలసౌ అంటూ ఈయన ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందాడు..?
కథ:
అర్జున్(సుశాంత్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మంచి జీతం.. ఇళ్లు.. కార్ అన్నీ ఉంటాయి. కానీ పెళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంట్లో వాళ్ళు ఎలాగైనా అర్జున్ కు పెళ్లి చేయాలని చూస్తుంటారు. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా నో చెప్తుంటాడు అర్జున్. ఇలాంటి సమయంలో అర్జున్ వాళ్ళ అమ్మ అంజలి(రుహానీ శర్మ)తో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది. చూసిన వెంటనే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పేస్తాడు అర్జున్. దానివల్ల అంజలి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ముందు కాదన్న అర్జున్ తర్వాత మళ్లీ అంజలి వెనక ఎందుకు పడతాడు.. అనేది అసలు కథ..
కథనం:
ఆ.. ఏంట్రా పెళ్లి ఎప్పుడు..? ఏజ్ అయిపోతుంది.. పెళ్లి చేసుకోరా.. ఏరా నువ్వింక పెళ్లి చేసుకోవా.. త్వరగా చేసుకోరా..! పెళ్లి కాని అబ్బాయిలకు రోజుకు రొటీన్ గా వందసార్లు తగిలే ప్రశ్నలివి. అలాంటి వాళ్లకు ఈ చిలసౌ ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వాళ్ల కథ.. వాళ్లకు రోజూ ఎదురయ్యే కథ. ముందు 15 నిమిషాలు పూర్తిగా పెళ్లి కాన్సెప్ట్ చుట్టూనే నవ్వించాడు రాహుల్. అయితే ఆ తర్వాతే తెలిసింది అసలు కథ అది కాదని.. మరో కథ ఉందని.. పెళ్లి అంటే పారిపోయే హీరో.. ఒకరిపై ఆధారపడి బతక్కూడదనుకునే అమ్మాయి.. ఈ ఇద్దరి మధ్య సాగే సింపుల్ అండ్ బ్యూటీఫుల్ కథ చిలసౌ.
తాను చెప్పాలనుకున్న కథను స్లో పాయిజన్ లా చెప్పాడు రాహుల్ రవీంద్రన్. పాయిజన్ ఏదైనా పాయిజనే కదా.. అందుకే కాస్త నెమ్మదిగా సాగుతుంది.. బుర్రకు ఎక్కుతుంది ఈ కథ. చిన్న కథను స్క్రీన్ ప్లేతో చాలా తెలివిగా చెప్పాడు రాహుల్.. తొలి సినిమాతోనే తనలోని దర్శకుడితో పాటు రచయితకు కూడా బాగానే పని పెట్టాడు. ముఖ్యంగా తొలి పదిహేను సినిమాల సినిమాను చాలా హిలేరియస్ గా మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత పెళ్లిచూపులు.. వెంటనే హీరోయిన్ సమస్యలతో కథ ఎమోషనల్ టర్న్ తిరుగుతుంది.
అది కాస్త సీరియల్ లా అనిపించినా.. ఫ్లాష్ బ్యాక్ తర్వాత మళ్లీ కథ గాడిన పడుతుంది. తెలిసిన కథ కావడం.. ఊహకు తగ్గట్లుగా సాగడం చిలసౌకు ప్రధాన మైనస్. కానీ మ్యాగ్జిమమ్ బోర్ కొట్టకుండా కథ నడిపించడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ స్లోగా మొదలైనా.. క్లైమాక్స్ కు వచ్చేసరికి కథ మళ్లీ గాడిన పడింది. సుశాంత్ తొలిసారి తన కెరీర్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపించింది. కొత్తమ్మాయి రుహాని శర్మ చాలా బాగా నటించింది.. చిన్మయి డబ్బింగ్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా చిలసౌ.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ బట్ కండీషన్స్ అప్లై.
నటీనటులు:
కెరీర్ లో తొలిసారి తనకు సూట్ అయ్యే పాత్ర చేసాడు సుశాంత్. సింపుల్ కథలో చక్కగా ఒదిగిపోయాడు. పక్కింటి అబ్బాయిలా అనిపించాడు. ఇక హీరోయిన్ రుహానీ కూడా చాలా బాగా నటించింది. ఈ చిత్రానికి ఆమె ప్లస్ గా నిలిచింది. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. హీరో ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. తను ఉన్న ప్రతీ సీన్ నవ్వు తెప్పించాడు వెన్నెల. హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి బాగుంది. జయప్రకాశ్.. సంజయ్ స్వరూప్.. అంతా తమ తమ పాత్రల్లో బాగానే నటించారు.
టెక్నికల్ టీం:
మ్యూజిక్ పరంగా చిలసౌ మంచి సినిమా. ప్రశాంత్ విహారీ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాటల కన్నా ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. చాలా సీన్స్ తన మ్యూజిక్ తో నిలబెట్టాడు ప్రశాంత్. ఎడిటింగ్ ఓకే. అక్కడక్కడా కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. నాగార్జున ఎంట్రీకి ముందే ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో తీసారు. నాగ్ ఎంట్రీ తర్వాత మరింత మారిపోయింది చిలసౌ. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా కంటే కూడా రైటర్ గా అదరగొట్టాడు రాహుల్ రవీంద్రన్.
చివరగా:
చిలసౌ.. పెళ్లి చేసుకోరా నాయనా..!