CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ : విశ్వరూపం 2
నటీనటులు : కమల్ హాసన్, ఆండ్రియా, పూజకుమార్, శేఖర్ కపూర్ తదితరులు
సంగీతం : జిబ్రన్
సినిమాటోగ్రఫీ : స్యామ్ దత్
నిర్మాతలు : ఆస్కార్ రవిచంద్రన్, కమల్ హాసన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కమల్ హాసన్
ఐదేళ్ల కింద వివాదాల సుడిగుండంలో చిక్కుకుని కమల్ ను ముప్పుతిప్పలు పెట్టిన సినిమా విశ్వరూపం. 2013లోనే రావాల్సిన ఈ చిత్ర సీక్వెల్ ఐదేళ్లు ఆగి.. 2018లో ఇప్పుడు విడుదలైంది. మరి ఇప్పటికైనా కమల్ కష్టాలు తీరాయా..?
కథ:
వజీమ్ కాష్మీరీ(కమల్ హాసన్) ఇండియన్ రా ఏజెంట్. ఓ మిషన్ లో భాగంగా పాక్ వెళ్లి అక్కడ ఆల్ ఖైదాతో కలిసిపోతాడు. తీవ్రవాదిగా మారి అక్కడి సమాచారాలు ఇక్కడ ఇండియన్ ఆర్మీకి ఇస్తుంటాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అతన్ని చంపేయాలని చూస్తారు ఆల్ ఖైదా. కానీ తనే ఆర్మీ సాయంతో అందర్నీ చంపేస్తాడు. కానీ అప్పటికీ టెర్రరిస్ట్ మెయిన్ లీడర్ ఒమర్(రాహుల్ బోస్) మాత్రం బతికే ఉంటాడు.
లండన్ లోనే ఉండి వజీమ్ ను టార్గెట్ చేస్తాడు. ప్రతీసారి అతన్ని.. టీంను చంపాలని చూస్తుంటాడు. మరోవైపు వజీమ్ దేశం కోసం పోరాడుతుంటాడు. ఈ మిషన్ లో అతడికి తోడుగా ఉంటారు అతడి భార్య నిరుపమ(పూజకుమార్).. ట్రైనీ(ఆండ్రియా). అదే సమయంలో ఒమర్ కూడా తన పాత స్నేహితుడు వజీమ్ ను టార్గెట్ చేస్తాడు. అతడితో పాటు లండన్ లో చాలా స్థానాల్లో బాంబులు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది.. ఎలా హీరో కాపాడాడు అనేది అసలు కథ..
కథనం:
డిగ్రీ పూర్తి చేయడానికి మూడేళ్లు.. బిటెక్ చేయడానికి నాలుగేళ్లు పడుతుంది.. కానీ విశ్వరూపం 2 పూర్తి చేయడానికి కమల్ ఏకంగా ఐదేళ్లు పట్టింది. అక్కడ మూడు నాలుగేళ్లు పూర్తి చేస్తే కనీసం డిగ్రీ అయినా వస్తుంది. ఇక్కడ ఐదేళ్లు పూర్తిచేసిన తర్వాత కూడా నిరాశ.. నిస్పృహలు తప్ప ఏం రాలేదు. అయినా ఇప్పుడు కమల్ నుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశే. కానీ విశ్వరూపం సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కదా.. రెండో భాగం కూడా అలాగే ఉంటుందేమో ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేది. కానీ పార్ట్ 2 విషయంలో మాత్రం అంత దృష్టి పెట్టలేకపోయాడు.
ఏదో తొలిభాగంలో మిగిలిపోయిన ఎడిటెడ్ స్క్రాప్ ను అంతా ఇక్కడ చుట్టేసాడేమో అనిపించింది. తీవ్రవాదం గురించి ఎంతో నిశితంగా పరిశీలించి విశ్వరూపంలో చూపించాడు కమల్.. కానీ ఇప్పుడు మాత్రం నిశితంగా పక్కనబెడితే.. ఎప్పుడు చుట్టేద్దామా అన్నట్లనిపించింది. అసలే వివాదాలు.. ఆపై రాజకీయాలు.. మధ్యలో మత గొడవలు.. ఇవన్నీ చూసిన తర్వాత ముందు సినిమా విడుదల చేస్తే చాలు అనుకున్నాడో ఏమో కానీ..
విశ్వరూపం 2లో ఆసక్తికరమైన అంశాలు కానీ.. కథనం కానీ కనిపించలేదు. అక్కడక్కడా యాక్షన్ సీక్వెన్స్ లు ఒకట్రెండు ఓకే అనిపించినా.. అవి ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు.. కథపై కూడా క్లారిటీ లేదు. తొలిభాగం చూసిన తర్వాత ఇది చూస్తే అంతగా ఎక్కదు.. చూడని వాళ్లకు అస్సలే అర్థం కాదు. నటుడిగా కమల్ గురించి చెప్పేంత అర్హత నాకు లేదు.. ఆయన అద్భుతం.. ఆండ్రియా.. శేఖర్ కపూర్.. పూజాకుమార్ పాత్రల వరకు బాగున్నారు.. కానీ కథే లేదు. ఓవరాల్ గా కమల్ ఐదేళ్ల విరామం.. కష్టం అంతా బూడిదలో పోసిన కన్నీరే..!
నటీనటులు:
కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఆయన గురించి చెబితే ఆకాశానికి నిచ్చెన వేసినట్లే. ఈ సారి కూడా కమల్ అద్భుతమే. ఈ వయసులోనూ అరాచకాలు చేసాడు కమల్ హాసన్. మరో సీక్రేట్ ఏజెంట్ గా ఆండ్రియా పర్లేదు.. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అప్పుడప్పుడూ అందాలు కూడా ఆరబోసింది. కమల్ భార్యగా పూజకుమార్ ఓకే. ఈ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. శేఖర్ కపూర్ తో పాటు మిగిలిన వాళ్ళంతా ఉన్నాం అని గుర్తు చేసారంతే. తొలిభాగంతో పోలిస్తే ఈసారి విలన్ అక్షయ్ ఖన్నా పాత్రకు స్కోప్ లేదు.
టెక్నికల్ టీం:
విశ్వరూపం 2 టెక్నికల్ టీంలో కెమెరామెన్ స్యామ్ దత్ పనితీరు ఎక్కువగా స్క్రీన్ పై కనిపించింది. విజువల్స్ బాగున్నాయి. అయితే మరీ పాత సినిమా కావడంతో ఆ ఫీల్ అనిపించలేదు. జిబ్రన్ కు పెద్దగా పని లేకుండా పోయింది. కథ కుదరకపోవడంతో ఆర్ఆర్ కు కూడా స్కోప్ లేకుండా పోయింది. పాటలు కూడా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ చాలా వీక్. సినిమా సాగుతున్న తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కమల్ దర్శకుడు.. రచయితగా తొలిభాగం విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ ఈ సారి మాత్రం పూర్తిగా వెనకబడిపోయాడు.
చివరగా:
విశ్వరూపం 2.. కథ కంచికి.. కమల్ ఇంటికి..!