CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: రంగస్థలం
నటీనటులు: రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు..
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
కథ, కథనం, దర్శకుడు: సుకుమార్
రంగస్థలం.. ఈ సినిమా కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సుకుమార్ తెరకెక్కించిన విధానం. ఇప్పటి కథ కాదు.. 80ల్లో సాగే కథ కావడంతో ఆసక్తి పెరిగిపోయింది అందరిలోనూ. మరి ఇప్పుడు సినిమా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లుగానే రంగస్థలం ఉందా..? ఈ సినిమాతో రామ్ చరణ్ మాయ చేసాడా..?
కథ:
సిట్టిబాబు(రామ్ చరణ్) రంగస్థలం ఊరు మనిషి. ఆయనకు కాస్త చెవుడు. గట్టిగా మాట్లాడితే కానీ ఏదీ వినబడదు. ఆ ఊళ్లో అందరి పొలాలకు నీళ్లు పెడుతుంటాడు సిట్టిబాబు. రంగస్థలం ఊరు ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). ఆయనకు ఆ ఊళ్లో తిరుగుండదు.
ఆ ఊరుకు 30 ఏళ్లుగా ఆయనే ప్రెసిడెంట్. ఆయన ఏం చెప్తే అదే వేదం.. ఎదురు తిరిగితే ఉండదు ప్రాణం. అలాంటి ప్రెసిడెంట్ కు సిట్టిబాబు అన్న కుమార్ బాబు(ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. దుబాయ్ నుంచి వచ్చి ఊళ్లో జరుగుతున్న అన్యాయాలను చూసి అడుగుతాడు.
అతడికి పోటీగా ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తాడు. ఆ తర్వాత రంగస్థలంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. సిట్టిబాబు జీవితం మారిపోతుంది. అసలు ఏం జరుగుతుంది..? ఈ రామలక్ష్మి(సమంత) ఎవరు..? రంగమ్మత్త(అనసూయ)తో సిట్టిబాబుతో సంబంధం ఏంటి..? ఇదంతా మిగిలిన కథ..
Rangasthalam Full Movie Review And Rating
కథనం:
రామ్ చరణ్ సెవుల్లోకి మంచి కథ వెళ్లడమే ఆలస్యం కానీ.. ఒక్కసారి వెళ్లిందంటే అది అక్కడే ఉంటుంది. ఇది సినిమాలో చెప్పిన డైలాగే. దాన్నే కాస్త మార్చుకున్నాం అంతే. నిజంగానే రామ్ చరణ్ కు ఇన్నాళ్లూ మంచి కథలు రాలేదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత.
ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసినవన్నీ రొటీన్ కథలే. అందులో నటించడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది…? కెరీర్ మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి కథ వినడానికి.. ఈ సిట్టిబాబుకు ఏకంగా పదేళ్లు పట్టేసింది. ఇన్నాళ్లూ రామ్ చరణ్ లో హీరోనే చూసారు దర్శకులంతా. అందుకే కమర్షియల్ గా స్టార్ అయినా..
నటుడిగా విమర్శలే వచ్చాయి చరణ్ కు. ఎందుకో తెలియదు కానీ సుకుమార్ ఒక్కడే చరణ్ లోని నటున్ని చూసాడు. ఆయన రాసుకున్న రంగస్థలానికి నాయకున్ని ఈ సిట్టిబాబులో ఎంచుకున్నాడు. కథ పరంగా చూస్తే రంగస్థలం తెలిసిన కథే.. కానీ సుకుమార్ తెరకెక్కించిన విధానం కొత్తది.
ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ లో కాస్త స్లో అయినట్లు అనిపించినా.. ఎమోషన్స్ తో కనెక్ట్ అయిపోతాం.. ఇక క్లైమాక్స్ అద్భుతం.. సినిమాకు ప్రాణం. దర్శకుడు పెట్టిన నమ్మకం నిలబెట్టడానికి ప్రాణం పెట్టేసాడు రామ్ చరణ్. సిట్టిబాబు పాత్రను ఆయన ఓన్ చేసుకున్న విధానం అద్భుతం. ఇన్నాళ్లూ చరణ్ నటనపై విమర్శలు చేసిన వాళ్లకు.. రంగస్థలం గట్టి సమాధానమే విలేజ్ డ్రామా అంటే చాలాసార్లు చూసాం..
కానీ ఇలాంటి సినిమా చూడలేదు. చరణ్ లాంటి స్టార్ నుంచి రంగస్థలం లాంటి సినిమా ఊహించడం నిజంగా ఆశ్చర్యమే. ఇక ఇన్నాళ్లూ కన్ఫ్యూజ్ చేసిన సుకుమార్ కూడా ఈ సారి ఎమోషన్స్ తో గుండె తడిపేసాడు. కొన్ని సీన్లు అయితే నిజంగానే మనసును గట్టిగా సూటిగా తగిలేస్తాయి. హీరోకు ఉన్న లోపాన్ని కామెడీగా చూపిస్తూనే.. కొన్ని సీన్స్ లో అదే లోపంతో గుండెను పిండేసాడు. ఓవరాల్ గా ఈ రంగస్థలం ప్రేక్షకుల్ని అలరించే ఓ మంచి చిత్రం.
నటీనటులు:
రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదు.. జీవించాడు. ఇన్నాళ్లూ తన నటన తనకే మొనాటినీ వచ్చేసిందేమో మరి.. అందుకే పూర్తిగా మారి పోయాడు రామ్ చరణ్. తనను తాను మార్చుకోవాలని అనుకున్నాడు కాబట్టే ధృవ వచ్చింది.. ఇప్పుడు రంగస్థలం వచ్చింది.
పదేళ్ల కెరీర్ లో ఏం సాధించాడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ తికమక పడేవాడు చరణ్. కానీ ఇప్పుడు చెప్పొచ్చు రంగస్థలం లాంటి సినిమా చేసానని. రామలక్ష్మిగా సమంత ఒదిగిపోయింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది.
ఆది పినిశెట్టికి మంచి పాత్ర పడింది. చరణ్ తర్వాత బాగా ఎలివేట్ అయిన కారెక్టర్ ఇదే. అనసూయ ఊహించని ప్యాకేజ్ ఈ చిత్రంలో. రంగమ్మత్త అంటే అదేదో వ్యాంప్ కారెక్టర్ అనుకున్న వాళ్లకు షాక్ ఇచ్చాడు సుకుమార్. చాలా కీలక పాత్ర ఇచ్చాడు. అనసూయ కూడా ఈ పాత్రకు న్యాయం చేసింది. ప్రకాశ్ రాజ్.. జగపతిబాబు బాగా చేసారు.
టెక్నికల్ టీం:
దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టాడు అంటే కూడా తక్కువే అవుతుంది. అంతగా ఆర్ఆర్ తో సినిమా స్థాయిని పెంచేసాడు డిఎస్పీ. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే కేవలం దేవీ ఆర్ఆర్ వల్లే మరో రేంజ్ కు వెళ్లిపోయాయి. పాటలు బాగున్నాయి. జిగేల్ రాణి సాంగ్ థియేటర్స్ లో అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయం. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి చెప్పడానికేం లేదు. ఎక్స్ ట్రీమ్ గా ఉన్నాయి విజువల్స్ అన్నీ.
నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. చంద్రబోస్ లిరిక్స్ చాలా బాగున్నాయి. దర్శకుడిగా సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథను ఎంచుకున్నపుడే ఆయన సగం విజయం సాధించాడు. అయితే కథపై దృష్టి పెట్టి కాస్త నెమ్మదిగా సాగే కథనాన్ని పక్కన బెట్టేసాడు సుకుమార్.
చివరగా:
సుకుమారుడి అద్భుతమైన రంగస్థలం.. సిట్టిబాబు నట విశ్వరూపం..