2 వెంకీస్.. ప‌ర్ ఫెక్ట్ మూవీస్.. 


ఇండ‌స్ట్రీలో హీరోలుగా నిల‌బ‌డాలంటే బ్యాగ్రౌండ్ కావాలేమో..? కానీ ద‌ర్శ‌కులుగా మారాలంటే మాత్రం నో ఆప్ష‌న్. టాలెంట్ ఉండాల్సిందే. బుర్రొక్క‌టి ఉంటే ఇక్క‌డ ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు. వాళ్లే పిలిచి మ‌రి అవ‌కాశాలు ఇస్తుంటారు. ఇక కొత్త ద‌ర్శ‌కుల‌కు అయితే ఇక్క‌డ త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఫిబ్ర‌వ‌రిలో ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కులు త‌మ స‌త్తా చూపించారు. స్టార్ డైరెక్ట‌ర్లు కూడా చేతులెత్తేసిన వేళ వాళ్లే 2018లో ఇండ‌స్ట్రీని కాపాడారు. రెండు పెద్ద విజ‌యాలు అందించారు. ఆ ద‌ర్శ‌కులే వెంకీ కుడుముల‌.. వెంకీఅట్లూరి. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక‌రేమో ఛ‌లో అంటూ కామెడీతో కొట్టారు.. మ‌రొక‌రు తొలిప్రేమ అంటూ ప్రేమ‌తో ప‌డేసారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రిపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.
ముందు ఛ‌లో సినిమాను తీసుకుందాం.. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈయ‌న త్రివిక్ర‌మ్ శిష్యుడు.. ఇదే ముద్ర‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి తొలి సినిమాతోనే గురువుకు త‌గ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. తెలుగు, త‌మిళ బార్డ‌ర్స్ లో ఉండే క‌థ తీసుకుని.. దానికే కావాల్సినంత కామెడీ యాడ్ చేసి చ‌లోతో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఛ‌లో దూకుడు చూస్తుంటే ఈజీగా 14 కోట్ల షేర్ వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. అంతా చేస్తే ఈ సినిమాను అమ్మింది 6 కోట్ల‌కే. ఓవ‌ర్సీస్ లో అయితే ఇప్ప‌టికే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇప్పుడు వెంకీ కుడుముల రెండో సినిమా నితిన్ తో కమిట్ అయ్యాడ‌ని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేష‌న్స్ లో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది.
ఇక తొలిప్రేమతో వెంకీ అట్లూరి కూడా హిట్ ఇచ్చాడు. ప‌వ‌న్ టైటిల్ పెట్టుకుని వ‌చ్చిన ఈ సినిమాకు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌ని చేసాడు వెంకీ అట్లూరి. ఈ సినిమా స‌క్సెస్ తో మ‌నోడికి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. మైత్రి మూవీ మేక‌ర్స్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వెంకీ అట్లూరి. ఇందులో హీరోగా అఖిల్ న‌టించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ చెప్ప‌డం.. అఖిల్ ఓకే చెప్ప‌డం కూడా పూర్తైపోయాయి. మే నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది. ఈ పాటికే మైత్రితో వెంకీ డీల్ కూడా పూర్త‌యింది. మొత్తానికి అటు వెంకీ కుడుముల‌.. ఇటు వెంకీ అట్లూరి.. త‌మ త‌మ రెండో సినిమాలు స్టార్ బ్యాన‌ర్స్ లో క‌మిట్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here