ఏంటి శ్రీదేవి మరణించి అప్పుడే సంవత్సరం అయిందా అనుకుంటున్నారా.. కాలం చాలా వేగంగా వెళ్లిపోతుంది.. నిజంగానే అతిలోక సుందరి ఈ ప్రపంచాన్ని వదిలి ఏడాది కావస్తోంది. 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో ఒక పెళ్లి వేడుకకు వెళ్ళిన శ్రీదేవి అనుకోని పరిస్థితుల్లో మరణించింది. ముందు ఆమె మరణం అనుమానాస్పదంగా మారినా కూడా తర్వాత సాధారణ మరణంగానే తేల్చేశారు పోలీసులు. ఈమె చనిపోయిన విషయాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ నమ్మని అభిమానులున్నారు. వాళ్లు అలా ఉండగానే ఈమె ప్రథమ వర్ధంతి వచ్చేసింది.
ఫిబ్రవరి 24న ఈమె ప్రథమ వర్ధంతిని ఆమెకు ఎంతో ఇష్టమైన చెన్నైలోని సొంత ఇంట్లో జరపనున్నారు. శ్రీదేవి ఉన్నన్నాళ్ళు చెన్నైపై ప్రత్యేక అభిమానం చూపించింది. దానికి తోడు సొంత రాష్ట్రం కావడంతో ఆ మాత్రం ప్రేమ ఉండటం సహజం. అక్కడే ఆమెకు సొంత ఇంటితోపాటు పాటు పొలాలు కూడా ఉన్నాయి. తీరిక దొరికినప్పుడల్లా చెన్నైకి వచ్చేది శ్రీదేవి. అందుకే ఆమెకు ఇష్టమైన చెన్నైలోని ఆమె ఇంట్లోనే ప్రథమ వర్ధంతి జరపాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. దీనికి కపూర్ కుటుంబం మొత్తం హాజరు కానుందని తెలుస్తోంది.