ఆకాశ్ మామూలుగా లేడుగా..!


వార‌సులు చాలా మందున్నారు ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో. ఇప్పుడు వాళ్లంద‌రిలోనూ తాను ఒక‌డిగా వ‌స్తున్నాడు ఆకాశ్ పూరీ. తండ్రి స్టార్ డైరెక్ట‌ర్ అయినా కూడా స‌రైన పునాది ప‌డితే కానీ ఇండ‌స్ట్రీలో తాను నిల‌బ‌డ‌న‌ని ఆకాశ్ కు కూడా తెలుసు. అందుకే త‌న మాట‌ల‌తో అంద‌ర్నీ మాయ చేస్తున్నాడు ఈ కుర్రాడు. మొన్న ట్రైల‌ర్ లాంచ్ లోనే చాలా మాట్లాడిన ఆకాశ్.. ఇప్పుడు పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో ఇంకా చాలా బాగా మాట్లాడాడు. తన తండ్రి ఈ చిత్రంతో బ్యాక్ టూ ఫామ్ అవుతాడ‌ని.. ఇంక జీవితంలో ఎప్పుడూ బ్యాక్ అవ్వ‌డ‌ని మాట‌ల చాతుర్యం చూపించాడు ఆకాశ్. ఈయ‌న మాట‌లు వింటుంటే హీరోతో పాటు ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడేమో అనిపిస్తుంది.
ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు హీరోల కొడుకులే హీరోల‌య్యారు.. నిల‌బ‌డ్డారు. కానీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల కొడుకులు చాలా త‌క్కువ మంది స‌క్సెస్ అయ్యారు. వెంక‌టేశ్.. జ‌గ‌ప‌తిబాబు.. అల్ల‌రి న‌రేష్ త‌ర్వాత అలా స్టార్ అయిన వాళ్లు లేరు. ఇప్పుడు తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడు ఆకాశ్ పూరీ. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వైపు వెళ్తాడేమో అనుకుంటే.. కాద‌ని హీరోగా వ‌చ్చేస్తున్నాడు. 20 ఏళ్లు కూడా లేని ఈ కుర్రాడు మెహ‌బూబా సినిమాతో హీరో అయ్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌త్యేకంగా త‌న కొడుకు కోసం ఇండో పాకిస్థాన్ క‌థ రాసుకుని మ‌రీ తీసాడు మెహ‌బూబా. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. పూరీ పాత క‌థ‌ల మాదిరి లేదు ఇది.
క‌చ్చితంగా త‌న‌యుడి కోసం బాగా ఆలోచించి మ‌రీ రాసుకున్న‌ట్లున్నాడు అందుకే మెహ‌బూబా బాగా కొత్త‌గా క‌నిపిస్తుంది. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుద‌ల చేస్తున్నాడు. ఇది ఇంకాస్త అంచ‌నాలు పెంచేస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఆంధ్రాపోరీలో చిన్న పిల్లాడిలా క‌నిపించిన ఆకాశ్.. ఇప్పుడు మాత్రం హీరోగా మారిపోయాడు. ఈ కుర్రాన్ని చూస్తుంటే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో హీరో దొరికిన‌ట్లే అనిపిస్తుంది. మెహబూబా కానీ హిట్టైందంటే క‌చ్చితంగా ఆకాశ్ కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం ఖాయం. ఎలాగూ తండ్రి పూరీ అండదండ‌లు ఉండనే ఉన్నాయి. తొలి సినిమా హిట్టైతే అదే ఊపులో త‌న‌యున్ని నిల‌బెట్ట‌డానికి మ‌రో రెండు మూడు సినిమాలైనా చేస్తాడు పూరీ.. అప్ప‌ట్లో ఇవివి స‌త్య‌నారాయ‌ణ త‌న కొడుకు అల్ల‌రి న‌రేష్ కోసం చేసిన‌ట్లు..! మ‌రి చూడాలిక‌.. తండ్రి న‌మ్మ‌కాన్ని ఆకాశ్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here