ఆగ‌స్ట్ లో నితిన్ పెళ్లి.. 

అవును.. నితిన్ పెళ్లి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స‌యింది. తాజాగా నితిన్ పెళ్లి ఫోటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. మార్చ్ 4న అంద‌రి స‌మ‌క్షంలో నితిన్ పెళ్లి ముహూర్తం పెట్టారు. అయితే ఇదంతా నిజం పెళ్లి కోసం కాదులెండీ. రీల్ లైఫ్ పెళ్లి కోస‌మే. ఈయ‌న ప్ర‌స్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమాకు క‌మిట‌య్యాడు. రాశీఖ‌న్నాతో క‌లిసి ఇందులో రొమాన్స్ చేయ‌బోతున్నాడు ఈ కుర్ర హీరో. దిల్ రాజు దీనికి నిర్మాత‌. శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. శ్రీ‌నివాస క‌ళ్యాణం రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ 16 నుంచి మొద‌లు కానుంది. జులై చివ‌రివ‌ర‌కు షూటింగ్ పూర్తిచేసి.. ఆగ‌స్ట్ లో సినిమా విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్. దీనికి త‌గ్గ‌ట్లుగానే స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి చేసాడు సతీష్. శ్రీ గా రాశీ.. నివాస్ గా నితిన్ న‌టిస్తున్నారు. ఈ శ్రీ‌నివాస్ ల క‌ళ్యాణ‌మే శ్రీ‌నివాస క‌ళ్యాణం. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత స‌తీష్ చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.
మ‌రోవైపు నితిన్ కూడా ఇప్పుడు దూకుడు పెంచేసాడు. వ‌ర‌స‌గా సినిమాలు కమిట‌వుతున్నాడు. ముఖ్యంగా దిల్ రాజుతోనే ఎక్కువ‌గా క‌నెక్ట్ అయిపోయాడు ఈ కుర్ర హీరో. తొలి సినిమా హీరోతో సినిమా మ‌ళ్లీ చేయ‌రా అని దిల్ రాజును కొన్నేళ్లుగా చాలా మంది ప్ర‌శ్న‌లు అడుగుతూనే ఉన్నారు. అస‌లు నితిన్ తో ఇన్నేళ్ల నుంచి సినిమా ఎందుకు చేయ‌లేద‌ని వాళ్ళు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ దీనికి మౌనంగానే ఉన్న రాజుగారు.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల‌తో అంద‌రి నోళ్లు మూయిస్తున్నారు. నితిన్ ని ఈయ‌న ద‌త్త‌త తీసేసుకుంటున్నాడు. గాడి త‌ప్పిన ఈ కుర్ర హీరో కెరీర్ ను మ‌ళ్లీ గాడిన పెట్టే వ‌ర‌కు విశ్ర‌మించేలా క‌నిపించ‌ట్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో ప్ర‌యోగాలు చేసాడు నితిన్. అప్పుడు కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ అంటూ ఓ సారి.. హార్ట్ ఎటాక్ అని మ‌రోసారి.. ఈ మ‌ధ్యే లై అని ఇంకోసారి.. ఇలా తోచిన ప్ర‌తీసారి ఏదో క‌థ చేస్తూ గాడి త‌ప్పుతున్నాడు ఈ హీరో. అ..ఆ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌నోడు చేసిన లై అడ్డంగా ప‌డుకుంది. సినిమా ఎంత డిజాస్ట‌ర్ అంటే అమ్మిన రేట్ల‌లో క‌నీసం స‌గం కూడా రాలేదు.
ఈ చిత్రంతో నితిన్ మార్కెట్ మ‌రింత‌గా డౌన్ అయింది. ఉన్న‌ఫ‌లంగా హిట్ కొడితే కానీ నితిన్ మార్కెట్ మ‌ళ్లీ పెర‌గ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇదే ప‌నిమీద ఉన్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమా చేస్తున్నాడు. ఇది ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. దీన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ నిర్మిస్తుండ‌టం విశేషం. దీనికి క‌థ కూడా త్రివిక్ర‌మే ఇచ్చాడు. దీంతోపాటు మరో రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు నితిన్. ఈ రెండూ దిల్ రాజు బ్యాన‌ర్ లోనే. ఇందులో శ్రీ‌నివాస క‌ళ్యాణం ఇప్ప‌టికే మొద‌లైంది. ఇక మ‌రోటి హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు. ఇందులో మ‌రో హీరోగా శ‌ర్వా న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కానీ హిట్టైతే నితిన్ కు పోయిన అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చి మ‌రీ డోర్ కొట్టిన‌ట్లే. మొత్తానికి దిల్ రాజుగారి అండతో బాగానే ముందుకెళ్తున్నాడు నితిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here