ఇంటిలిజెన్స్ చూపిస్తాడా..? 

 
మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి వ‌ర‌స విజ‌యాలు అందుకుని అనుకున్న దానికంటే చాలా వేగంగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు సాయిధ‌రం తేజ్. ముందు ఈ కుర్రాన్ని చూసి ఇమిటేష‌న్ రాజా అనుకున్నారు. కానీ దానికి త‌న టాలెంట్ కూడా తోడు చేసి క్రేజీ హీరో అయ్యాడు సాయి. కానీ అంత‌లోనే వ‌ర‌స ఫ్లాపులు సాయి కెరీర్ ను ఎటూ కాకుండా చేసాయి. ఒక‌టి రెండు కాదు.. గ‌త రెండేళ్లుగా వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపులిచ్చాడు మెగా మేన‌ల్లుడు. సుప్రీమ్ త‌ర్వాత ఈయ‌న‌కు హిట్ లేదు. తిక్క‌.. న‌క్ష‌త్రం.. విన్న‌ర్.. జ‌వాన్.. ఇలా సాగుతుంది సాయిధ‌రంతేజ్ ఫ్లాపుల ప్ర‌యాణం. ఈ త‌రుణంలో వినాయ‌క్ ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తున్నాడు. ఖైదీ నెం.150 లాంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత ఏరికోరి మ‌రి సాయితో సినిమా చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అదే ఇంటిలిజెంట్. మ‌రికొద్ది గంట‌ల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని కేవ‌లం 45 రోజుల్లోనే పూర్తి చేసాడు వినాయ‌క్. ఆయ‌న కెరీర్ లో అత్యంత వేగంగా అయిపోయిన సినిమా ఇదే. ఆకుల శివ క‌థ అందించాడు.
ఇంటిలిజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే 600 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి యుఎస్ లో ప్ర‌త్యేకంగా ప్రీమియ‌ర్స్ ఏం పెట్ట‌లేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. వినాయ‌క్ సినిమాల‌కు అక్క‌డ పెద్ద‌గా గిరాకీ ఉండ‌దు. ఖైదీ నెం.150 వ‌సూళ్ల‌న్నీ చిరు ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఇక సాయిధ‌రంతేజ్ కు కూడా యుఎస్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. దాంతో రెగ్యుల‌ర్ షోస్ తోనే క‌థ ముందుకు న‌డిపిస్తున్నారు యుఎస్ బ‌య్య‌ర్లు. ఇంటిలిజెంట్ ట్రైల‌ర్ చూస్తుంటే ఈ పాటికే ఇది ప‌క్కా వినాయ‌క్ మార్క్ మూవీ అని అర్థ‌మైపోతుంది. కృష్ణ సినిమా త‌ర‌హాలో ఇది కూడా పూర్తిస్థాయి కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించాడు వినాయ‌క్. కామెడీ.. డాన్సులు.. యాక్ష‌న్.. మాస్ అంశాలు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్.. ఇలా అన్నీ స‌మ‌పాళ్ల‌లో నింపి ఓ వంట‌కం సిద్ధం చేసాడు వినాయ‌క్. ముఖ్యంగా రీమిక్స్ పాట సినిమాకు బాగా హెల్ప్ కానుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఇంటిలిజెంట్ అయినా సాయిని ఫ్లాపుల నుంచి బ‌య‌ట ప‌డేస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here