ఇండ‌స్ట్రీలో కొత్త‌ర‌క్తం.. కుమ్మేయండంతే..!


ఇండ‌స్ట్రీలో కొత్త ర‌క్తం ఏరులై పారుతుంది. 2018లో ఏం జ‌రుగుతుందో ఏమో కానీ కొత్త ద‌ర్శ‌కులంతా స‌త్తా చూపిస్తున్నారు. వ‌ర‌స‌గా వాళ్ల సినిమాలే బాక్సాఫీస్ ద‌గ్గర కుమ్మేస్తున్నాయి. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఛ‌లోను ఇచ్చింది కూడా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములే. ఈ సినిమా త‌ర్వాత తొలిప్రేమ కూడా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి నుంచి వ‌చ్చిందే. ఈ రెండు సినిమాల‌తో పాటు అ..తో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న వైపు తిప్పుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇక మార్చ్ 23న కూడా రెండు సినిమాలు రానున్నాయి. ఈ రెండు సినిమాలు తెర‌కెక్కించింది కూడా కొత్త ద‌ర్శ‌కులే కావ‌డం విశేషం. ఎమ్మెల్యేతో ఉపేంద్ర మాధ‌వ్ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంటే.. నీదినాది ఒకేక‌థ అంటూ అంద‌రి క‌థ చూపించ డానికి వ‌స్తున్నాడు వేణు ఉడుగుల‌. ఈ రెండు సినిమాల‌పై ఇండ‌స్ట్రీలో మంచి ఆస‌క్తి ఉంది. అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇవి కానీ హిట్ట‌యితే కొత్త ద‌ర్శ‌కుల‌కు ఈ ఏడాది బాగా క‌లిసొచ్చిన‌ట్లే. వెంకీ అట్లూరి.. వెంకీ కుడుముల మాదిరే త‌మ‌కీ 2018 క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నారు ఈ ద‌ర్శ‌కులు. వీళ్లే కాదు.. త్వ‌ర‌లోనే నా పేరు సూర్య‌తో త‌న ద‌ర్శ‌క‌త్వ క‌ల‌ను నెర‌వేర్చుకోనున్నాడు వ‌క్కంతం వంశీ. మే 4న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి ఇలా కొత్త ద‌ర్శ‌కుల రాక ఇండ‌స్ట్రీకి మంచిదే. ఎందుకంటే వాళ్ల రాక‌తో అయినా కొత్త క‌థ‌ల‌న్నీ వ‌స్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here