ఇండ‌స్ట్రీలో నెక్ట్స్ దాస‌రి ఎవ‌రు..?


దాస‌రి నారాయ‌ణ‌రావు ఇప్పుడు కానీ ఉండుంటే ఇన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చేవా..? ఇండ‌స్ట్రీలో ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా ఎవ‌రూ మాట్లాడ‌కుండా ఉండేవాళ్లా..? శ్రీ‌రెడ్డి సమ‌స్యే ఇంత దూరం వ‌చ్చేదా..? అస‌లు ఆమె నోరు తెర‌వ‌డానికైనా ధైర్యం చేసేదా..? ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఇండ‌స్ట్రీలో తాను ఉన్నానంటూ ముందుండి న‌డిపించిన నాయ‌కుడు దాస‌రి నారాయ‌ణరావు. ఇండ‌స్ట్రీకి పెద్దదిక్కు ఆయ‌న‌. స్టార్ హీరోలు ఎంత‌మంది ఉన్నా కూడా దాస‌రి చెబితే అంతే. ఆయ‌న‌కు అంత గౌర‌వం ఉండేది. గ‌తేడాది వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా కూడా నేనున్నానంటూ అంద రికీ అండ‌గా నిలిచిన దాస‌రి ఇప్పుడు లేరు. ఆయ‌న దూర‌మై చూస్తుండ‌గానే దాదాపు ఏడాది కావొస్తుంది. దాంతో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో త‌ర్వాతి దాస‌రి ఎవ‌రు అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. కానీ దీనికి స‌మాధానం మాత్రం దొర‌క‌డం లేదు.
సురేష్ బాబు ఆ స్థానం కోసం పోటీ ప‌డ్డార‌నే ప్ర‌చారం జ‌రిగినా.. ఆయ‌న వైపు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు పెద్ద‌గా మొగ్గు చూప‌లేదు. అల్లు అర‌వింద్ ఉన్నా త‌న విష‌యాల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటారు ప‌క్క విష‌యాల‌పై ఆయ‌న పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌రు. దాంతో దాస‌రి వద‌లివెళ్లిన పెద్ద‌మ‌నిషి కుర్చీ అలాగే ఉండిపోయింది. దాస‌రి త‌ర్వాత ఆ స్థానం కోసం పోటీ ప‌డుతున్న వ్య‌క్తుల్లో చిరంజీవి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా మెగాస్టార్ ఇంటి త‌లుపు త‌డుతున్నారు. అలాగే చాలా మంది చిరుతో మున‌ప‌టి వైరం మ‌రిచిపోయి మ‌రీ ఆయ‌న‌తో క‌లుపుగోలుగా ఉంటున్నారు. రాజ‌శేఖ‌ర్ దంప‌తులే దీనికి నిద‌ర్శ‌నం. అంతేకాదు.. చిరంజీవి ఇక‌పై సినిమాల‌కే పూర్తి స‌మ‌యం కేటాయించ‌బోతున్నారు. అంటే ముందులా ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయాలు కూడా లేవు. దాంతో అంద‌రి స‌మస్య‌లు తీర్చే పెద్దదిక్కుగా మార‌డానికి కావాల్సినంత టైమ్ కూడా ఉంది.
అయితే దాస‌రి ప్లేస్ లోకి చిరు వ‌స్తార‌ని భావిస్తున్నా.. చిన్న సినిమాల‌కు ఆయ‌న ఇచ్చే భ‌రోసా ఎలా ఉంటుంద‌నేది మాత్రం ఆస‌క్తిగా మారింది. ఇక ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఇష్యూలో ఇంత జ‌రుగుతున్నా కూడా చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడ‌టం లేదు. స్వ‌యంగా రామ్ చ‌ర‌ణ్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఇష్యూ పెద్ద‌ది చేయ‌డం ఇష్టం లేని మెగాస్టార్ కామ్ గానే ఉన్నారు. కానీ దాస‌రి ఉంటే ప‌రిస్థితులు ఇలా ఉండేవి కావంటున్నారు కొంద‌రు. ఆయ‌న విష‌యాన్ని తెలుసుకుని.. మొగ్గ‌లోనే తుంచేసేవార‌ని.. దాస‌రి స్థానంలోకి రావ‌డం అంటే అంత ఈజీ కాద‌ని.. ఇప్ప‌టికే చిరంజీవికి ఈ విష‌యం కూడా అర్థ‌మైపోయుంటుంద‌ని అంటున్నారు. ఇక మోహ‌న్ బాబు లాంటి వాళ్ల‌కు కూడా దాస‌రి స్థానంలో కూర్చునే అర్హ‌త ఉంది. ఎందుకంటే ఆయ‌న కూడా చాలా ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు. పైగా దాస‌రికి పెద్ద‌కొడుకు లాంటి వాడు. కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీతో అంటీముట్ట‌న‌ట్లుగానే ఉంటున్నారు మోహ‌న్ బాబు. మొత్తానికి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ర‌చ్చ చూసి ప్ర‌తీఒక్క‌రు ఆ పెద్దాయ‌న్ని గుర్తు చేసుకుంటున్నారు
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here