ఇంత‌కీ బిగ్ బాస్ 2 ఎవ‌రంటారు..? 

Nithiin Replaces NTR In Dil Raju Film,nithin,ntr,dil raju,
బిగ్ బాస్.. తెలుగు రియాలిటీ షోస్ లో ఓ సంచ‌ల‌నం. అస‌లు తెలుగులో ఇంత‌గా ఈ షో చూస్తార‌ని స్టార్ మా కూడా అనుకుని ఉండ‌రు. తెలుగులో రియాలిటీ షో చూస్తార‌ని.. అది ఇంత విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అయితే ముందు ఎవ‌రికీ లేదు. కానీ ఎన్టీఆర్ మాయ చేసాడు. ఆయ‌న క్రేజ్ బిగ్ బాస్ ని ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. అస‌లు బిగ్ బాస్ మొద‌లైన‌పుడు ఎన్టీఆర్ కూడా ఊహించాడో లేదో తొలి సీజ‌న్ ఇంత‌ హిట్ అవుతుంద‌ని. ఓ ఇంట్లో ఉండి వాళ్లు చేసే ప‌నుల్ని ప‌ని మానేసుకుని మ‌నోళ్ళు ఎంక‌రేజ్ చేస్తారా అనుకున్నారంతా. కానీ మీ ఇంటితో పాటు ఈ ఇంటిపై ఓ క‌న్నేసి ఉంచండి అని ఎన్టీఆర్ చెప్పిన మాట‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు సీరియ‌స్ గానే తీసుకున్నారు. అందుకే ఆ ఇళ్లు అంత‌గా హిట్ అయింది. బిగ్ బాస్ ఇంత‌గా విజ‌యం సాధించ‌డానికి ముఖ్య‌ కార‌ణం ఎన్టీఆర్ అని ప్ర‌త్యేకంగా చెప్క‌న‌క్క‌ర్లేదు.
తొలి సీజ‌న్ అయిపోయిన త‌ర్వాత కూడా ఎవ‌రికీ రెండో సీజ‌న్ ఎవ‌రు చేస్తారు అనే అనుమానం రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కాబ‌ట్టి. కానీ ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి సినిమాల‌తో ఎన్టీఆర్ బిజీగా ఉండ‌టంతో ఇప్పుడు బిగ్ బాస్ 2 నుంచి ఎన్టీఆర్ త‌ప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి రెండో సీజ‌న్ పై ప‌డింది. ఆ సీజ‌న్ కు హోస్ట్ ఎవ‌రు..? ఎన్టీఆర్ ప‌క్క‌కు వెళ్లిపోవ‌డంతో ఆ స్థాయిలో షోను హోస్ట్ చేసే హీరో ఎవ‌రు అని వెతుకుతున్నారు ఇప్పుడు స్టార్ మా యాజ‌మాన్యం. ఎన్టీఆర్ కాకుండా మ‌రో హోస్ట్ వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా..? ఇప్పుడు ఇలా ప్రేక్ష‌కుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
బిగ్ బాస్ రెండో సీజ‌న్ కోసం నాని పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఏడాదికి నాలుగు సినిమాలు చేసే నాని.. అది వదిలేసి బిగ్ బాస్ వైపు వ‌స్తాడా అనేది అనుమాన‌మే. ఇక అఖిల్ పేరు వినిపించినా.. అత‌డు హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అనేది పెద్ద ప్ర‌శ్న‌. అత‌డి కంటే తండ్రి నాగార్జున‌ను న‌మ్ముకుంటే ఇంకా మంచిదేమో..? పైగా మా టీవీతో ఆయ‌న‌కున్న అనుబంధం అలాంటిది.. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు రెండు సీజ‌న్ల పాటు స‌క్సెస్ ఫుల్ గా న‌డిపించాడు నాగ్. ఇలా చాలా వ‌ర‌కు నాగార్జున బెటర్ ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నాడు. కానీ జ‌నం ఎన్టీఆర్ కు అలవాటు ప‌డిన త‌ర్వాత అత‌న్ని మ‌రిపించే స్థాయిలో మ‌రో హోస్ట్ ను తీసుకురావాలంటే మాత్రం క‌ష్ట‌మే. అలా చేస్తే చిరంజీవి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులా అయితే అస‌లుకే మోసం వ‌స్తుంది..! చూడాలిక‌.. ఏం చేస్తారో.. బిగ్ బాస్ 2 ఎవ‌రు అవుతారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here