ఈ మార్పు దేనికోసం మ‌హేశ్ గారు..? 

Mahesh25
మ‌న హీరోల్లో మార్పు వ‌స్తే ముందు సంతోషించేది నిర్మాత‌లే. ఎందుకంటే ద‌ర్శ‌కుడి మోజులో ప‌డి క‌థ ముందు వెన‌క చూడకుండా ఫైనల్ చేసి సినిమా చేసి నిర్మాత‌లను నిలువునా ముంచేస్తున్నారు. వాళ్లు చేసే త‌ప్పుల‌కు పాపం హీరోల‌ను న‌మ్మి నిర్మాత‌లు మునిగిపోతున్నారు. గ‌త కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఎంత‌గా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ అదే స‌మ‌యంలో ఫ్లాప్ అయిన సినిమాల‌కు కూడా అంతే స్థాయిలో దిగజారిపోతున్నాయి క‌లెక్ష‌న్లు. దాంతో మ‌న హీరోల్లో మార్పు మొద‌లైంది. దీనికి మ‌హేశ్ బాబు శ్రీ‌కారం చుడుతున్నాడు. క‌థ కంటే ద‌ర్శ‌కుల‌కు.. కాంబినేష‌న్ ల‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడ‌ని మ‌హేశ్ పై చాలా రోజులుగా విమ‌ర్శ‌లున్నాయి. ముఖ్యంగా ఓ సారి హిట్టిస్తే రెండోసారి కనీసం క‌థ కూడా అడ‌గ‌డ‌నే వార్త‌లు కూడా ఉన్నాయి.
దీనికి సాక్ష్యాలు కూడా లేక‌పోలేదు. శీనువైట్ల‌తో దూకుడు త‌ర్వాత ఆగ‌డు వ‌చ్చింది.. శ్రీ‌కాంత్ అడ్డాల‌తో సీత‌మ్మ వాకిట్లో త‌ర్వాత బ్ర‌హ్మోత్స‌వం వ‌చ్చింది. వీటి క‌థ‌ల విష‌యంలో మ‌హేశ్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే వార్త‌లున్నాయి. స్పైడ‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. మురుగ‌దాస్ అనే బ్రాండ్ న‌మ్మి గుడ్డిగా అడుగేసాడు మ‌హేశ్. దానికి ఫ‌లితం అనుభ‌వించాడు. దాంతో ఇప్పుడు క‌థల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు కొర‌టాల శివ‌తో భ‌ర‌త్ అనే నేను చేస్తున్నాడు. త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌బోతున్నాడు. ఇదే టైమ్ లో బోయ‌పాటి శీనుతో మ‌హేశ్ ఓ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
దానిపై బోయ‌పాటి కూడా క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు. అయితే ఈయ‌న చెప్పిన క‌థ మ‌హేశ్ కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే ఓపెన్ గానే ఈ క‌థ గురించి బోయ‌పాటికి చెప్పేసాడు మ‌హేశ్. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి క‌థ‌ను సైతం మ‌రోసారి కూర్చోమ‌ని ఆదేశించాడు మ‌హేశ్. సినిమా ప‌ట్టాలెక్క‌డానికి మ‌రో రెండు నెల‌లు టైమ్ ఉంది కాబ‌ట్టి ఆ లోపు క‌థ విష‌యంలో మ‌రిన్ని మెరుగులు దిద్దాల‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. వంశీ పైడిప‌ల్లి కూడా ఇప్పుడు ఇదే ప‌నిపై ఉన్నాడు. ఈ చిత్రం ఎప్రిల్లో మొద‌లు కానుంది. అప్ప‌టి వ‌ర‌కు క‌థ‌పై కూర్చోనున్నాడు వంశీ. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు, అశ్వినీద‌త్ నిర్మించ‌నున్నారు. మ‌రి చూడాలిక‌.. మ‌హేశ్ లో వ‌చ్చిన ఈ మార్పు ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here