ఫిబ్రవరి 9.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఆ రోజు ముగ్గురు హీరోలు వస్తున్నారు. ఒకేరోజు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పోనీ అవేమైనా చిన్న సినిమాలా అంటే అదీ కాదు. అన్నీ పెద్ద సినిమాలే.. పైగా అంచనాలు భారీగా ఉన్నవే. అలాంటివి మూడు ఒకేరోజు వస్తే కచ్చితంగా కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది. అయినా గానీ ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ఫిబ్రవరి 9న అందరికంటే ముందు తన సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఈయన నటిస్తున్న తొలిప్రేమ విడుదల కానుంది. వెంకీ అట్లూరి తెరకెక్కి స్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇదే రోజు బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న సాక్ష్యం విడుదల కానుంది. శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. పంచభూతాలే సాక్ష్యంగా ఓ కుర్రాడి కథ ఏమైంది అనేది ఈ సాక్ష్యం. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు బాగా పెంచేసింది. ఇక ఫిబ్రవరి 9నే తాను ఉన్నానంటూ వస్తున్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ చేసుకోడానికి వస్తున్నాడు ఈ కుర్ర హీరో. శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కన్నడ బ్లాక్ బస్టర్ కిరాక్ పార్టీకి రీమేక్. ఇప్పుడు నిఖిల్ సినిమాలకు 20 కోట్ల మార్కెట్ వచ్చింది. అంటే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నట్లే. భారీ వీకెండ్ ఉండటంతో కుర్రాళ్లంతా ఇదే తేదీ కావాలని పట్టు బడుతున్నారు. మరి ఈ సమరంలో ఎవరు గెలుస్తారో చూడాలి..! మొత్తానికి ఒకే రోజు ముగ్గురు క్రేజీ హీరోలు రావడం ఆ మధ్య ఆగస్ట్ 11కి జరిగింది. అందులో నేనేరాజు నేనేమంత్రి మాత్రమే విజయం సాధించింది. మరి ఇప్పుడు ఎలాంటి సమరం జరగనుందో.