కీర్తిసురేష్ కు వేయండ్రా వీర‌తాడు..


వీర‌తాడు అంటే మాట‌ల్లో చెప్ప‌లేనంత గొప్ప‌ప‌ని చేసిన‌పుడు వాడే మాట‌. ఇప్పుడు కీర్తిసురేష్ కు ఇది వాడేయొచ్చు అంటే ఆమె ప‌డిన క‌ష్టం ఎంత ఉంటుందో ఊహించుకోండి. తాజాగా మ‌హాన‌టి సినిమా కోసం ఆమె డ‌బ్బింగ్ చెబుతున్న వీడియో విడుద‌లైంది. అందులో ఆమె ప‌డిన క‌ష్టం చూసి అయ్యో అనుకుంటున్నారంతా. తెలుగు రాక‌పోయినా డైలాగులు స్ప‌ష్టంగా ప‌ల‌క‌డం కోసం ఒక‌టి రెండు కాదు ఏకంగా 11 రోజులు క‌ష్ట‌ప‌డింది కీర్తి.
అంత‌గా క‌ష్ట‌ప‌డింది కాబ‌ట్టే ఈ రోజు ఇంత కీర్తి వ‌చ్చింది. మ‌హాన‌టి ఇంత పెద్ద విజ‌యం సాధించిందంటే కీర్తి స్వ‌రం కూడా కీల‌క‌మే. ఎమోష‌న‌ల్ సీన్స్ లో కీర్తిసురేష్ వాయిస్ లో ఆ ఆర్ద్ర‌త సినిమా స్థాయిని పెంచేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో జెమినీ గ‌ణేష‌న్ తో వ‌ర్షం ప‌డుతున్న‌పుడు రోడ్డు మీద ఆమె బిగ్గ‌ర‌గా అరుస్తూ చెప్పే డైలాగులు అయితే మ‌రో స్థాయిలో ఉంటాయి.
ఇవ‌న్నీ చెప్ప‌డానికి ఆమె ప‌డిన క‌ష్టానికి సంబంధించిన వీడియో ఇప్పుడు విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత ఈమె తెలుగ‌మ్మాయి కాదంటే న‌మ్మ‌డం క‌ష్టం. అంత స్ప‌ష్టంగా తెలుగులో మాట్లాడి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే కీర్తి క‌ష్టానికి వేయండ్రా వీర‌తాడు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here