థియేట‌ర్స్ ఖాళీ.. కిరాక్ పార్టీ రావాల్సిందే..!

Kirrak Party
కొన్ని రోజులుగా థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. వారం రోజుల త‌ర్వాత డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల‌తో నిర్మాత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో మ‌ళ్లీ వీటిని తెరిచారు. కానీ థియేట‌ర్స్ ఓపెన్ అయినా కూడా అందులో ప్ర‌ద‌ర్శించ‌డానికి సినిమాలు లేని ప‌రిస్థితి. దాంతో పాత సినిమాల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తీసుకొచ్చి వేస్తున్నారు. త‌మిళ‌నాట అయితే మ‌రో ఆప్ష‌న్ లేక క‌బాలి.. విజ‌య్ మెర్స‌ల్, తెరీతో పాటు అజిత్ వేదాళం సినిమాల‌ను మ‌ళ్లీ రీ రిలీజ్ చేసారు. ఇక తెలుగులోనూ ఇదే ప‌రిస్థితి. కాక‌పోతే ఇక్క‌డ పాత సినిమాలను విడుద‌ల చేయ‌లేదు కానీ ఎప్పుడో విడుద‌ల చేయాల్సిన సినిమాల‌ను ఇప్పుడు తీసుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ వాడుకుందాం అని ఎప్పుడో నాలుగేళ్ల కింద సినిమా ఏం మంత్రం చేసావేను ఇప్పుడు మార్చ్ 9న విడుద‌ల చేసారు. ఇక సుదీప్ కోటికొక్క‌డు ఏడాది త‌ర్వాత విడుద‌లైంది.
ఇవి వ‌చ్చినా కూడా థియేట‌ర్స్ లో జ‌నం క‌నిపించ‌ట్లేదు. 2018 ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా క‌లిసిరాలేదు. జై సింహా.. భాగ‌మ‌తి.. ఛ‌లో.. తొలిప్రేమ ఓకే అనిపించినా మిగిలిన సినిమాల‌న్నీ బాల్చీ తన్నేసాయి. పైగా కొన్ని రోజులుగా థియేట‌ర్స్ మూత ప‌డ‌టంతో ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. చిన్న సినిమాలు వ‌స్తున్నాయి కానీ వాటిని చూడ్డానికి ప్రేక్ష‌కులు మాత్రం థియేట‌ర్స్ కు రావ‌డం లేదు. గ‌డిచిన ఒక్క నెల‌లోనే దాదాపు 30 సినిమాలు విడుద‌ల‌య్యాయంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే. కానీ అందులో ఏది విజ‌యం సాధించిందంటే చెప్ప‌డం కూడా అసాధ్యం. ఎందుకంటే ఒక్క‌టి కూడా ఆడ‌లేదు.
సినిమా బాగుంద‌నే టాక్ వ‌చ్చినా.. థియేట‌ర్స్ ఖాళీ అయిపోవ‌డానికి కార‌ణం మాత్రం ఒక్క‌టే.. అన్ సీజ‌న్. గ‌త‌వారం ఒక్క సినిమా కూడా విడుద‌ల కాలేదు. ఇక ఇప్పుడు పిల్ల‌ల‌కు ఎగ్జామ్స్ కాబ‌ట్టి పెద్ద హీరోలు ఎవ‌రూ రావ‌డం లేదు. మార్చ్ 16న కిరాక్ పార్టీ వ‌చ్చే వ‌ర‌కు థియేట‌ర్స్ ఇలాగే ఖాళీగా ఉండ‌క త‌ప్ప‌దు. ఇక అప్ప‌ట్నుంచీ వారానికో పెద్ద సినిమా రానుంది. మార్చ్ 23న ఎమ్మెల్యే.. 30న రంగ‌స్థ‌లం.. ఎప్రిల్ 5న ఛ‌ల్ మోహ‌న్ రంగా.. 12న కృష్ణార్జున యుద్ధం.. 20న భ‌ర‌త్ అనే నేను.. 27న కాలా.. మే 4న నా పేరు సూర్య నా యిల్లు ఇండియా.. ఇలా సాగనుంది సినిమాల జాత‌ర‌. అంటే మ‌రో వారం రోజులు థియేట‌ర్స్ ఇలాగే ఖాళీగా ఉండ‌క త‌ప్ప‌దు. ఆ త‌ర్వాతే మ‌ళ్లీ థియేట‌ర్స్ క‌ళ‌క‌ళ‌లాడిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు ఈగ‌లు తోలుకోవాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here