దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణిస్తాడా..?


ఇక్క‌డ దేవుడు అంటే నిజంగా దేవుడే కానీ పూజారి అంటే మాత్రం క‌రుణాక‌ర‌ణ్ అని అర్థం. ఆ భ‌క్తుడు మాత్రం సాయిధ‌రంతేజ్. పాపం.. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. ఎక్క‌డికో వెళ్లిపోతున్నాడ‌ని క‌ల‌లు క‌న్న మెగా మేన‌ల్లుడు.. వ‌ర‌స డిజాస్ట‌ర్ల‌తో ఎక్క‌డికో వెళ్తున్నాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఇంటిలిజెంట్ అయితే మ‌రీ దారుణంగా క‌నీసం 4 కోట్ల షేర్ కూడా వ‌సూలు చేయ‌లేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌ళ్లీ రేస్ లోకి రావాల‌ని చూస్తున్నాడు సాయి. ఇలాంటి టైమ్ లో క‌రుణాక‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు సాయిధ‌రంతేజ్. క‌రుణాక‌ర‌ణ్ అంటేనే ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్. ఈయ‌న‌ పేరు విన‌గానే తొలిప్రేమ గుర్తొస్తుంది. ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్ అయిపోయాడు క‌రుణాక‌ర‌ణ్. ఆ ఒక్క సినిమా పేరు చెప్పి 20 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
తొలిప్రేమ త‌ర్వాత ఇన్నేళ్ల‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ మాత్ర‌మే హిట్ట‌య్యాయి. మిగిలినవ‌న్నీ చేతులెత్తేసిన‌వే. దాంతో క‌రుణాక‌ర‌ణ్ ను ప‌ట్టించుకోవ‌డం మానేసారు మ‌న హీరోలు. గ‌తేడాది నితిన్ న‌టించిన చిన్న‌దాన నీ కోసం కూడా ఫ్లాపైన త‌ర్వాత క‌రుణాక‌ర‌ణ్ డిమాండ్ బాగా ప‌డిపోయింది. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది. అందుకే ఇప్ప‌టికీ మ‌న హీరోలు అప్పుడ‌ప్పుడూ న‌మ్ముతున్నారు. సాయిధ‌రంతేజ్ హీరోగా ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న సినిమాకు దేవుడు వ‌ర‌మందిస్తే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. సీనియ‌ర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ఇమేజ్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రం ఉంటుంద‌ని చెబుతున్నాడు క‌రుణాక‌ర‌ణ్. సినిమా కొత్త‌గా ఉండ‌దు కానీ అందంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్. మ‌రి చూడాలి.. దేవుడు వ‌రమిచ్చినా పూజారి క‌రుణిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here