నంది అవార్డులలో వివక్షకు కారణాలివేనా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అవార్డుల జాబితా పలు వివాదాలకు తెరతీసింది. రుద్రమదేవి ని విస్మయించారని దర్శకుడు గుణశేఖర్ ఆక్రోశం వ్యక్తం చేసారు. ఆంధ్ర ప్రభుత్వానికి రాసిన లేఖ లో ఆయన రుద్రమదేవి లాంటి తెలుగు వారి గొప్పదనాన్ని వివరించే చారిత్రక చిత్రం తీస్తే దానిని పక్కన పెట్టి కమర్షియల్ మాస్ చిత్రాలకు అవార్డులు వెల్లువలా ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తీకరించారు.

మరో వైపు 2014 లో మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు గారి ఆఖరి చిత్రమైన మనం కు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే వాదన బలం గా వినిపిస్తుంది. అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మనం’ చిత్రమైన కొత్త తరహా కథ కథనాలతో ఇతర భాషావారిని కూడా అబ్బుర పరచిన చిత్రం కాగా, దానికి అరకోర అవార్డులు ఇచ్చి, లెజెండ్ కు అవార్డు లు రాశులుపోసారనే విమర్శ వినపడుతుంది.

బాలకృష్ణ ముఖ్యమంత్రి స్వయానా బావమరిది కావడం మరో వైపు టీడీపీ ఎం ఎల్ ఏ కావడం వల్లే ఈ వివక్ష చూపించారని ఫిలిం నగర్ గుస గుస. ఇక అక్కినేని నాగార్జున కు బాలయ్య కు గతం లో విభేధాలున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున ఆ మధ్య ఓ ఫంక్షన్ లో అటువంటివేమి లేదని మేమందరం ఒకటే అని చెప్పారు. మరో వైపు నాగార్జున తెలంగాణ లో టీ.ఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కె.సి.ఆర్ ను పొగడడం, తన కోడలు సమంత చేనేత బట్టల ప్రచారకురాలిగా వ్యవహరించడం వల్ల కూడా నంది అవార్డుల లో ప్రభావం చూపాయని విశ్లేషకుల అంచనా. ఈ విషయమై టీవీ ఛానలలో చర్చ కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి.