బ్రాండ్ మాత్ర‌మే.. క‌థ లేదండీ..


మంచి క‌థ‌లు కావాల‌న్నా.. ప‌ర‌మ చెత్త క‌థ‌ల‌తో బోర్ కొట్టించాల‌న్నా.. రెండింటికీ బాలీవుడ్డే అడ్డా. దంగ‌ల్, నీర్జా లాంటి అద్భుత‌మైన క‌థ‌లు వ‌చ్చిన చోటే.. మ‌స్తీజాదే, హేట్ స్టోరీ 4 లాంటి బూతు సినిమాలు కూడా వ‌చ్చాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మ‌రో ట్రెండ్ కూడా ఊపందుకుంది. అదే బ్రాండ్ ఆఫ్ స్టోరీస్. అర్థం కాలేదు క‌దూ..! సింపుల్.. ఓ హిట్టైన సినిమాకు సీక్వెల్స్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు అక్క‌డి నిర్మాత‌లు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు సీక్వెల్స్ హిట్టైన చ‌రిత్ర లేదు.. కానీ బాలీవుడ్ లో మాత్రం సీక్వెల్స్ ఫ్లాపైన చ‌రిత్ర లేదు. ఫ‌స్ట్ సినిమా ఇచ్చిన బ్రాండ్ తో మిగిలిన క‌థ‌లు కూడా సోసో గా ఉన్నా.. సూప‌ర్ గా ఆడేస్తున్నాయి.
బాలీవుడ్ బాక్సాఫీస్ ను ప్ర‌స్తుతం చాలా ఫ్రాంచైజీలు ఊపేస్తున్నాయి. గోల్ మాల్ సిరీస్.. ధూమ్ సిరీస్.. హౌజ్ ఫుల్ సిరీస్.. హేట్ స్టోరీ సిరీస్ తో పాటు ఇంకా చాలా సిరీస్ లు క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఇందులో చాలా సినిమాల్లో సీక్వెల్స్ కు క‌థ ఉండ‌దు. కానీ వ‌చ్చేస్తుంటాయి. దానికి కార‌ణం క్రేజ్. ధూమ్ 2 త‌ర్వాత వ‌చ్చిన పార్ట్ 3కి నెగిటివ్ రివ్యూస్ వ‌చ్చాయి. కానీ అమీర్ ఖాన్ క్రేజ్ తో సినిమా ఆడేసింది. ఇక హౌజ్ ఫుల్ 3 చెత్త సినిమా అంటూ తేల్చేసారు క్రిటిక్స్. కానీ కామెడీతో నెట్టుకొచ్చింది ఈ చిత్రం. ఇక సింగం, సింగం రిట‌ర్న్స్.. గోల్ మాల్ సిరీస్ లాంటి సినిమాలు కూడా కేవ‌లం బ్రాండ్ తో బాలీవుడ్ లో బ‌తికేస్తున్నాయి.
ఇప్పుడు బాలీవుడ్ లో మ‌రిన్ని సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే హౌజ్ ఫుల్ 4 అనౌన్స్ అయింది. అక్ష‌య్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అమి తాబ్ బ‌చ్చ‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో కైరాఅద్వానీ, కృతిస‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ధూమ్ 4కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. దానికితోడు కిక్ 2 చేయ‌బోతున్నాడు స‌ల్మాన్ ఖాన్. ద‌బంగ్ 3కి కూడా క‌థ రెడీ అవుతుంది. సింగం 4 అనౌన్స్ చేసాడు రోహిత్ శెట్టి. ఇలా బాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ వ‌స్తున్నాయి కానీ అందులో స‌రైన క‌థ‌లు మాత్రం రావ‌ట్లేదు. ఇదే ట్రెండ్ తెలుగులో వ‌స్తే ఎంత బాగుంటుందో క‌దా..!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here