ముద్ర వేస్తానంటోన్న నిఖిల్.. 

Nikhil Mudra
నిఖిల్ ఏంటి.. ముద్ర వేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్ప‌టికే ఈ ప‌నిపై బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కిరాక్ పార్టీ సెట్ లో ఉన్న నిఖిల్.. ఇప్పుడు కొత్త సినిమా మొద‌లు పెట్టాడు. త‌మిళ సినిమా క‌ణిత‌న్ రీమేక్ లో న‌టిస్తున్నాడు నిఖిల్ ఇప్పుడు. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలోని పూర్తి క‌థ‌ను కాకుండా.. కేవ‌లం లైన్ మాత్ర‌మే తీసుకుని ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా క‌థ‌ను మార్చామ‌ని చెబుతున్నాడు నిఖిల్. ఇది ఫేక్ స‌ర్టిఫికేట్ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. అథ‌ర్వ న‌టించిన ఈ చిత్రం త‌మిళ‌నాట మంచి విజ‌యం సాధించింది. ముందు ఈ చిత్రాన్ని ర‌వితేజ‌తో రీమేక్ చేయాల‌ని భావించాడు ద‌ర్శ‌కుడు సంతోష్. ర‌వితేజ ఫైన‌ల్ అయిన త‌ర్వాత ఎందుకో ఆగిపోయింది ఈ చిత్రం. ఇప్పుడు నిఖిల్ వ‌చ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నాడు. దీనికి ముద్ర అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ఇప్ప‌టికే ఈ టైటిల్ ను రిజిష్ట‌ర్ కూడా చేయించాడు ఠాగూర్ మ‌ధు. అయితే అది నిఖిల్ సినిమాకే అని చెప్ప‌లేదు. కానీ ఇప్పుడు ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇదొక్క‌టే. అంటే ఈ ముద్ర టైటిల్ నిఖిల్ కోస‌మే అని అర్థ‌మైపోతుంది. పైగా ఫేక్ స‌ర్టిఫికేట్ ల నేప‌థ్యం కాబ‌ట్టి ముద్ర అనేది ప‌ర్ ఫెక్ట్ టైటిల్. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్ర నిఖిల్ కెరీర్ పై ఎలాంటి ముద్ర వేయ‌బోతుందో..? ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here