రివ్యూ: కాలా

రివ్యూ        : కాలా
న‌టీన‌టులు  : ర‌జినీకాంత్, హ్యూమాఖురేషి, నానా ప‌టేక‌ర్, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు
ఎడిట‌ర్       : శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్
సినిమాటోగ్ర‌ఫీ: ముర‌ళి
సంగీతం      : స‌ంతోష్ నారాయ‌ణ్
నిర్మాత‌       : ధ‌నుష్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ర‌ంజిత్ పా

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన క‌బాలి తుస్సుమంది. ర‌జినీ లాంటి స్టార్ తో ఇలాంటి సినిమా చేసాడేంటి రంజిత్ అంటూ నిట్టూర్చారు ఫ్యాన్స్. కానీ మ‌రోసారి ఈ ద‌ర్శ‌కున్ని న‌మ్మాడు ర‌జినీకాంత్. మ‌రి ఈ సారేం చేసాడు..? క‌బాలితో మిస్సైన హిట్ కాలాతో ఇచ్చాడా..?

క‌థ‌:
కాలా (ర‌జినీకాంత్) ధారావిలోనే పుట్టి పెరిగిన‌ నాయ‌కుడు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయన దేవుడు. వాళ్ల బాగు కోస‌మే పోరాడుతుంటాడు. రాజ‌కీయ హ‌స్తాల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ధారావిని కాపాడుతుంటాడు కాలా. అలాంటి టైమ్ లో ఆ ఏరియాపై అక్క‌డి రూలింగ్ పార్టీలో ఉన్న రాజ‌కీయ నాయ‌కుడు హ‌రిదాదా(నానా ప‌టేక‌ర్) క‌న్ను ప‌డుతుంది. స్ల‌మ్ ఖాళీ చేయించి కాంప్లెక్స్ క‌ట్టాల‌నేది ఆయ‌న క‌ల‌. ఆ ప్రాజెక్ట్ విష‌యంలోనే కాలా మాజీ ప్రేమికురాలు జ‌రీనా(హ్యూమ‌ఖురేషి) కూడా వ‌స్తుంది. కానీ ఎవ‌రొచ్చినా ఆ ప్రాజెక్ట్ పూర్తి కానివ్వ‌డు కాలా. ఇదే క్ర‌మంలో కాలా కుటుంబాన్ని కూడా నాశ‌నం చేస్తాడు హ‌రి. చివ‌రికి ధారావిని వ‌దిలేసాడా.. ఒడిసి ప‌ట్టుకున్నాడా అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
ఓసారి ప్లాప్ ఇచ్చిన దర్శకున్ని మళ్ళీ నమ్మడం చిన్న విషయం కాదు.. కానీ రంజిత్ ను నమ్మాడు రజినీకాంత్. కబాలి కొందరికి నచ్చినా.. ఆటో బయోగ్రఫీలా తీసాడనే విమర్శలు ఉన్నాయి. దాన్ని భర్తీ చేయడానికి రంజిత్ కాలాతో వచ్చాడని చెప్పాడు రజిని. కబాలిలో మిస్ అయింది కాలాలో ఇస్తాడని నమ్మిన ప్రేక్షకులను ఈసారి కూడా మోసం చేసాడు రంజిత్. రజిని లాంటి సూపర్ స్టార్ ని ఉంచుకుని కూడా తన సత్తా చూపించలేకపోయాడు ఈ కుర్ర దర్శకుడు. తీసుకున్న కథ బాగానే ఉన్నా.. బాగా నెమ్మదిగా చెప్పడం దీనికి మైనస్. రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది.. ఇంటర్వెల్ పేలిపోయింది.. క్లైమాక్స్ బాగుంది.. ఇలా సీన్స్ చెప్పేలా ఉంది గానీ.. సినిమా బాగుంది అని చెప్పలేం. ఈసారి కబాలి కంటే కాస్త బెటర్ ఔట్ పుట్ ఇచ్చాడు కానీ.. గతంలో రజిని సినిమాల రేంజ్ లో మెరిపించలేకపోయాడు రంజిత్. ఇది రజిని ఫెయిల్యూర్ అనడానికి లేదు.. పూర్తిగా దర్శకుడి బాధ్యత. ప్రతిచోటా రంజిత్ మార్క్ తో పాటు పైత్యం కూడా కనిపిస్తుంది. అక్క‌డ మ‌నుషులు చ‌చ్చిపోతే కూడా ఈయ‌న ర్యాప్ పెట్టాడు. అదేం అరాచ‌క‌మో రంజిత్ కే తెలియాలి మ‌రి. అలాంటివి ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు రుచించ‌వు. ఆ సీన్స్ వ‌చ్చిన‌పుడు న‌వ్వుల పాలు కావ‌డం త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. నానా ప‌టేక‌ర్ తో వ‌చ్చిన సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు రంజిత్. సెకండాఫ్ లో తన ఇంటికి రజిని వచ్చిన సీన్ లో విశ్వరూపం చూపించాడు నానా. నువ్వా నేనా అన్నట్లు ఈ ఇద్దరి సీన్స్ రాసుకున్నాడు రంజిత్. తమిళ్ లో ఈ క‌థ వ‌ర్క‌వుట్ అవుతుందేమో కానీ తెలుగులో మాత్రం క‌ష్ట‌మే. ఫ‌స్టాఫ్ లో ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చి ఫ్లైఓవ‌ర్ ఫైట్ సీన్.. సెకండాఫ్ లో పోలీస్ స్టేష‌న్ సీన్.. నానా ప‌టేక‌ర్ తో వ‌చ్చే సీన్స్ అన్నీ అద్భుతంగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. కానీ ఇదే పేస్ సినిమా అంతా కొన‌సాగ‌లేదు. అదే అస‌లు మైన‌స్. క్లైమాక్స్ మ‌ళ్లీ దారిన ప‌డినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. క‌థ‌లో చాలా వ‌ర‌కు నాయ‌కుడు సినిమాతో పోలిక‌లు క‌నిపించాయి. ఓవ‌రాల్ గా మ‌రోసారి యావ‌రేజ్ సినిమాతోనే వ‌చ్చాడు రంజిత్.

న‌టీన‌టులు:
ర‌జినీకాంత్ న‌ట‌న గురించి కొత్తగా చెప్ప‌డానికి ఏంలేదు. కాలాగా ఆయ‌న ర‌ప్ఫాడించాడు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో న‌డిపించాడు. నాయ‌కుడి పాత్ర‌లో ఆయ‌న కంటే ఎవ‌రు బాగా న‌టిస్తారు. నానా ప‌టేక‌ర్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. ఆయ‌న ప్ర‌తీ సీన్ లోనూ త‌న అద్భుత‌మైన న‌ట‌న చూపించాడు. హ్యూమాఖురేషి ప‌ర్లేదు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఇక ర‌జినీ భార్య‌గా ఈశ్వ‌రీరావు మ‌రీ త‌మిళ న‌టి లా అనిపించింది. ఓవ‌ర్ యాక్ష‌న్ అనిపించింది ఆమె డైలాగులు. శియాజీషిండే, సంప‌త్ కుమార్ ప‌ర్లేదు.

టెక్నిక‌ల్ టీం:
సంతోష్ నారాయ‌ణ్ సంగీతం మ‌రోసారి క‌బాలిని త‌ల‌పించింది. అవే ట్యూన్స్ రిపీట్ అయిన‌ట్లు అనిపించినా.. కొన్ని సీన్లకు మాత్రం చాలా బాగా బ్యాంగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆయ‌న ఆర్ఆర్ తో స‌న్నివేశాలు బాగానే హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కాస్త వీక్. రెండు గంట‌ల 50 నిమిషాల సినిమా కావ‌డంతో మ‌ధ్య‌లో కొన్ని సీన్స్ తీసెయొచ్చేమో అనిపిస్తుంది. త‌మిళ్ లో ఓకే కానీ తెలుగులో అది వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. ద‌ర్శ‌కుడిగా రంజిత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. క‌థ విష‌యంలో ఓకే కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. అదే మైన‌స్. ఆయ‌న చెప్పాల‌నుకున్న క‌థ మంచిదే అయినా నెమ్మ‌దిగా రాసుకోవ‌డం ప్ర‌తికూలం.

చివ‌ర‌గా:
కాలా.. వీర‌య్య కొడుకు వీర‌త్వం చూపించ‌లేక‌పోయాడు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here