CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
నటీనటులు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : హిప్ హాప్ తమిళన్
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: మేర్లపాక గాంధీ
నిర్మాతలు : హరీష్ పెద్ది, సాహు గురపాటి
వరస విజయాల నాని మరో సినిమాతో వచ్చేసాడు. కృష్ణార్జున యుద్ధం అంటూ బాక్సాఫీస్ పై వార్ కు రెడీ అయ్యాడు. మరి ఈయన యుద్ధానికి ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు..? ఈ సినిమాతో నాని తొమ్మిదో విజయం అందుకున్నాడా..? ట‌్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేసాడా..?
కథ:
కృష్ణ(నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తిలో పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఊళ్లో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించమని అడుగు తుంటాడు. ఆ సమయంలో అతడి జీవితంలోకి.. ఆ ఊళ్లోకి రియా (రుక్సర్ మీర్) వస్తుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కృష్ణ. ఇక అర్జున్ (నాని) యూరప్ లో రాక్ స్టార్. అమ్మాయిలంటే పిచ్చి. ఆ సమయంలో సుబ్బలక్ష్మి(అనుపమ) తో అర్జున్ ప్రేమలో పడతారు. ఆ తర్వాత కృష్ణార్జునులు ప్రేమించిన అమ్మాయిలను ఉమెన్ ట్రాఫికింగ్ లో కిడ్నాప్ చేస్తారు. అప్పట్నుంచీ వాళ్లు తమ ప్రేమ కోసం యుద్ధం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..!
కథనం:
ఈ మధ్య తెలుగులో ఊరు బేస్ గా వచ్చే సినిమాలు బాగా పెరిగిపోయాయి. పల్లెటూరి నేపథ్యంలో చక్కగా ఓ కథ రాసుకుంటే ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు మేర్లపాక గాంధీ కూడా ఇదే చేసాడు. చిత్తూరు జిల్లా అక్కుర్తి నేపథ్యం తీసుకుని అక్కడ కృష్ణగాడి పాత్రతో ఈ కథ రాసుకున్నాడు. అర్జున్ కూడా ఉన్నా అతడి ఫోకస్ అంతా కృష్ణుడిపైనే పెట్టాడు. ఎందుకంటే కథ నడిపించేదంతా ఆయనే కదా.
అర్జున్ ను బాగా చూసుకుంటే చాలు మనోడే సినిమా అంతా నడిపిస్తాడని నమ్మేసాడు గాంధీ. అందుకే అర్జున్ పాత్ర కాస్త తగ్గినా పర్లేదనుకున్నాడు. అందుకు తగ్గట్లే సినిమాలో కృష్ణ వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతాడు. దానికోసం నాని మాట్లాడిన చిత్తూరు యాస కూడా భలే ముచ్చటేస్తుంది.
ఫస్టాఫ్ లో చాలా వరకు కృష్ణ, అర్జున్ జీవితాలను పోలుస్తూ రాసుకున్నాడు. ఇక్కడ గ్రామంలో మాస్ కృష్ణుడు చేసే పనులతో.. అక్కడ యూరప్ లో క్లాస్ అర్జునుడితో కనెక్ట్ చేసాడు. అర్జున్ వచ్చినపుడు తెలియకుండానే స్క్రీన్ డల్ అయిపోతుంది. అర్జున్ పాత్రతో పాటే బ్రహ్మాజీ రోల్ పెట్టి.. అక్కడ కామెడీ ట్రాక్ సెట్ చేసాడు గాంధీ.
ఈ ట్రాక్ బాగా పేలింది. ముఖ్యంగా బ్రహ్మాజీ యాక్సిడెంట్ సీన్ అయితే కడుపులు చెక్కలు కావాల్సిందే. ఫస్టాఫ్ గంటన్నర ఉన్నా కూడా పెద్దగా బోర్ అనిపించదు కానీ సెకండాఫ్ చిన్నదే అయినా స్లో అయినట్లు అనిపిస్తుంది. కథేంటో తెలిసిన తర్వాత పెద్దగా ఆసక్తి కనిపించదు. అయినా నాని తన నటనతో నిలబెట్టాడు ఈ చిత్రాన్ని. సెకండాఫ్ లో కథ గాడి తప్పడంతో పెద్దగా కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. కాకపోతే నాని ఉండటం ఈ చిత్రానికి ప్లస్. యావరేజ్ కంటెంట్ ను కూడా తన నటనతో నిలబెట్టాడు నాని. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రాసుకున్న కథ కావడంతో చివర్లో సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు ఈ దర్శకుడు.
నటీనటులు:
నాని నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన ప్రతీ సినిమాకు మెరుగవుతూనే ఉంటాడు. ఇందులో కూడా కృష్ణగా చిత్తూరు యాసలో ఎంతగా ఆకట్టుకున్నాడో.. అంతే అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే నానిని ఎందుకో ఆ పాత్రలో చూడటం కష్టం అనిపించింది. తన వంతు బాగానే చేసాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ పెద్దగా చెప్పుకోడానికి ఏం లేదు. ఆమె కంటే రుక్సర్ మీర్ పాత్ర బాగుంది. ఫస్టాఫ్ లో కృష్ణతో వచ్చే సీన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. బ్రహ్మాజీ మరోసారి నవ్వించాడు, ఆయన పాత్రకు థియేటర్ లో నవ్వులు పూయడం ఖాయం. ఇక మిగిలిన వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలే.
టెక్నికల్ టీం:
కృష్ణార్జున యుద్ధంకు మెయిన్ అట్రాక్షన్ హిప్ హాప్ తమిళన్ మ్యూజిక్. దారిచూడు సాంగ్ అయితే అరాచకమే. దానికి తోడు ఐ వాన్న ఫ్లై.. ఉరిమే మనసే పాటలు కూడా బాగున్నాయి. ఆర్ఆర్ బాగానే ఇచ్చాడు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. యూరప్ అందాలు చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ కాస్త డల్ అనిపించింది. పాటలు కూడా అనుకోకుండా వచ్చాయి. ఇక గాంధీ దర్శకుడిగా మూడో సారి అంతగా సక్సెస్ కాలేదు. మొదటి రెండు సినిమాలకు ఫుల్ కామెడీ పటాస్ ఇచ్చిన మేర్లపాక మూడోసారి మాత్రం అంత ఆకట్టుకోలేదు. కానీ నాని ఉన్నాడు కాబట్టి కృష్ణార్జునులు పర్లేదనిపిస్తారు.
చివరగా:
కృష్ణుడు కిరాక్.. అర్జునుడు చిరాక్..