CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
నటీనటులు : నాగశౌర్య, సాయిపల్లవి, నిల్ గల్ రవి, సుజిత, ప్రియదర్శి తదితరులు
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
సంగీతం : శ్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : ఏఎల్ విజయ్
ఎంసిఏ తర్వాత సాయిపల్లవి.. ఛలో తర్వాత నాగశౌర్య.. ఇద్దరూ విజయాల్లో ఉన్నపుడు కలిసి నటించిన సినిమా కణం. మొదట్నుంచీ ఈ చిత్రం ఎందుకో తెలియదు కానీ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. పైగా బ్రూణహత్యల కాన్సెప్ట్ కావడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం విడుదలైంది. మరి కణం ఎలా ఉంది..?
కథ:
తులసి(సాయిపల్లవి).. కృష్ణ(నాగశౌర్య) ప్రేమించుకుంటారు. కానీ వాళ్లు చేసిన చిన్న తప్పుకు ఇరు కుటుంబాలు గొడవపడతారు. కానీ తర్వాత కూర్చుని మాట్లాడుకుని ఐదేళ్ల తర్వాత పెళ్లి చేస్తారు. కానీ అప్పుడు వాళ్లు చేసిన తప్పుకు ఓ పసిప్రాణం బలైపోతుంది. జరిగింది అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటారు కానీ తన జీవితంలో ఓ ప్రాణాన్ని తీసినందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది తులసి. అలా ప్రాణం పోయిన దియా (వెరోనికా) ఆత్మగా మారుతుంది. తనను చంపిన వాళ్లపై పగ తీర్చుకోడానికి వస్తుంది. తర్వాత ఏమైంది అనేది అసలు కథ..!
కథనం:
బ్రూణ హత్యలు.. రూపం కూడా లేని.. రాని పసి ప్రాణాలను.. చిధిమేయడానికి మనం పెట్టుకున్న ముద్దుపేరు బ్రూణహత్యలు. ఏటా ఎన్నో లక్షల మంది ప్రాణాలకు అమ్మకడుపులోనే నూరేళ్ళు నిండిపోతున్నాయి. పాపం లోకం చూడకుండానే కాటికి వెళ్లిపోతున్నాయి ఆ ప్రాణాలు. ఏముంది అబార్షనే కదా..
ఈ రోజుల్లో కామన్ అనుకుంటాం.. కానీ దాని వెనక లోకం చూడని ఓ ప్రాణం నలిగిపోతుందని చూపించిన చిత్రం కణం. ఏఎల్ విజయ్ రాసుకున్న కథ చాలా కాంప్లికేటెడ్. కడుపులో ప్రాణాన్ని కడుపులోనే తీసేయడం అనేది దారుణం. ఇదే తన కథలో బలంగా చూపించాడు ఈ దర్శకుడు. అయితే ఎమోషనల్ డ్రామా కాస్తా రివేంజ్ డ్రామాగా మార్చేసాడు దర్శకుడు. కమర్షియలైజ్ కోసం కథను అలా మలుచుకున్నా..
తాను చూపించాలనుకున్న పాయింట్ ను మాత్రం బాగానే చూపించాడు విజయ్. ఈ కథకు సాయిపల్లవి, నాగశౌర్య లాంటి ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టులను తీసుకుని మంచి పని చేసాడు విజయ్. దాంతో అతడి పని ఈజీ అయిపోయింది. టైమ్ వేస్ట్ కూడా చేయకుండా నేరుగా కథలోకి వెళ్లి పోయాడు దర్శకుడు.
కేవలం గంట 40 నిమిషాల నిడివి ఉండటంతో ఎక్కడా ల్యాగ్ అయిన ఫీలింగ్ రాదు. కానీ స్క్రీన్ ప్లే లోపం మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు స్లోగా సాగిన ఈ చిత్రం.. సెకండాఫ్ లో కాస్త ఆసక్తి పుట్టిస్తుంది. తండ్రి అయినా కూడా తనను చంపిన పాపానికి అతన్ని కూడా చంపాలనుకునే ఆత్మ.. భర్తను కూతురు నుంచి కాపాడుకోవాలనునే తల్లి.. రెండు పాయింట్స్ సెకండాఫ్ లో ఆసక్తి పుట్టించాయి. చివరికి చిన్న ట్విస్ట్ తో కథకు సుఖాంతం పలికాడు దర్శకుడు.
ఈ కణం కమర్షియల్ గా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కనబెడితే.. సమాజంలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఓ సమస్యను మాత్రం ఎత్తి చూపించింది.. అప్పట్లో నాన్న అంటూ ఏడిపించిన విజయ్.. ఇప్పుడు అమ్మను చూపించాడు..ఓవరాల్ గా ఈ కణం ఆలోచింపజేసే మంచి సినిమా..
నటీనటులు:
ఇక నాగశౌర్య కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిందేం ఉంది. ఎప్పట్లాగే తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో ఆమె పలికించిన ఎక్స్ ప్రెషన్స్ అద్భుతం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో తన కూతురు అమ్మ అని పిలిచినపుడు సాయిపల్లవి పలికించిన హావభావాలు అమోఘం. చిన్నారి వెరోనికా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రియదర్శి ఫస్టాఫ్ లో కామెడీ చేసినా.. సెకండాఫ్ మాత్రం బాగా చేసాడు.
టెక్నికల్ టీం:
కణంకు బిగ్గెస్ట్ ప్లస్ సంగీతం. శామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. హార్రర్ థ్రిల్లర్ కు ఈ మాత్రం లేకపోతే కష్టమే. ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ కెమెరామెన్ తన మాయాజాలం చూపించాడు. ఎడిటింగ్ బాగుంది.
గంటన్నర కంటే కాస్త ఎక్కువగా ఉన్న ఈ చిత్రం ఎక్కడా పెద్దగా బోర్ అనిపించదు. కానీ రిపీటెడ్ సీన్లు వస్తుంటాయి. కథకుడిగా విజయ్ సక్సెస్ అయ్యాడు కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో కాస్త తడబడ్డాడేమో అనిపిస్తుంది. తాను తీసుకున్న కాన్సెప్ట్ ను అర్థవంతంగా పూర్తి చేయలేకపోయాడు ఈ దర్శకుడు. కానీ కచ్చితంగా మంచి సినిమా అయితే ఇచ్చాడు.
చివరగా:
అమ్మకడుపులో కూడా రక్షణ లేని కణం..