CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ : టిక్ టిక్ టిక్
నటీనటులు : జయం రవి, నివేదా పేతురాజ్, జయప్రకాశ్ తదితరులు
నిర్మాతలు : చదలవాడ బ్రదర్స్
సంగీతం : డి ఇమాన్
సినిమాటోగ్రఫీ : వెంకటేశ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శక్తి సౌందరరాజన్
గ్రావిటీ.. స్పేస్ లాంటి సినిమాలు హాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన దగ్గర ఇప్పటి వరకు స్పేస్ కాన్సెప్ట్ సినిమాలు రాలేదు. కానీ తొలిసారి అది ట్రై చేసాడు జయంరవి. మరి ఇండియాస్ తొలి అంతరిక్ష చిత్రం ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా..?
కథ:
వాసు(జయంరవి) ఓ దొంగ. ఓ కేస్ లో జైల్లో ఉంటాడు. అతన్ని కలవడానికి స్పేస్ ఆపరేషన్ ఆఫీసర్లు వస్తారు. అంతరిక్షంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల భూమిపైకి భారీ ఉల్క ఒకటి వస్తుందని తెలుసుకుని.. 4 కోట్ల మంది ప్రాణాలు కాపాడటానికి వాళ్లు వాసు సాయం కోసం వస్తారు. అతన్ని వాడుకుని స్పేస్ లో మరో దేశం దాచేసిన ఓ భారీ మిసైల్ ను దొంగతనం చేయించాలనేది అంతరిక్ష అధికారుల ప్లాన్. దానికోసం వాసును అడుగుతారు. దానికి వాసు ఏమన్నాడు..? అతడు అంతరిక్షంలోకి ఎలా వెళ్లాడు..? అసలు ఆ మిస్సైల్ ను తీసుకున్నారా లేదా అనేది అసలు కథ..!
కథనం:
హాలీవుడ్ లో గ్రావిటీ తీసారంట.. స్పేస్ సినిమా చేసారంట.. అని చదవడమే కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడూ అలాంటి సినిమాలు చూడలేదు. కానీ టిక్ టిక్ టిక్.. ఇండియన్ ఫస్ట్ స్పేస్ సైఫై థ్రిల్లర్ అనగానే ఏదో తెలియని ఆసక్తి. అదే ఆసక్తితో.. కొత్తగా ఉంటుందనే నమ్మకంతోనే థియేటర్ లోకి వెళ్తారు ప్రేక్షకులు కూడా. ఆ నమ్మకం కొంతవరకు నిజమే అయింది కూడా.. కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూడని ఓ ప్రయోగం కాబట్టి స్పేస్ లో కథ సాగుతున్నంత సేపు కొత్తగానే అనిపిస్తుంది. కానీ కేవలం స్పేస్ అనే కాన్సెప్ట్ తీసుకుని.. మిగిలిన కథను అగ్గిపెట్టెలా చుట్టేసాడు దర్శకుడు శక్తి సౌందరరాజన్.
మరీ ముఖ్యంగా లాజిక్ లేని చాలా సీన్లు ఇబ్బంది పెడుతుంటాయి. అసలే మాత్రం అంతరిక్ష అనుభవం లేని ఓ దొంగను నమ్మి.. ఏకంగా స్పేస్ లో పక్కదేశం దాచేసిన మిసైల్ ను దొంగతనానికి పంపడం ఊహకు కూడా అందదు. ఇలాంటి లాజిక్ లేని సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి.. కానీ స్పేస్ అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ అన్నింటినీ కాపాడుతుంది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా అక్కడా రొటీన్ డ్రామా..
యాక్షన్ సీన్లు వింతగా అనిపిస్తాయి. స్పేస్ కాన్సెప్ట్ అనేది పక్కనబెడితే టిక్ టిక్ టిక్ ఓ మామూలు రొటీన్ సెంటిమెంట్ డ్రామా. జయంరవి బాగా నటించాడు.. నివేదా పుతిరాజ్ పర్లేదు. దర్శకుడు శక్తిసౌందరరాజన్ తాను నమ్మిన కథను స్పేస్ ను నమ్మి తీసేసాడు.. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ కాన్సెప్ట్ మత్తులో పడి లాజిక్స్ ను అంతరిక్షంలో కలిపేసాడు. ఓవరాల్ గా కొత్త ప్రయోగం చూడాలనుకునేవాళ్లు లాజిక్స్ మరిచిపోయి టిక్ టిక్ టిక్ అనొచ్చు.
నటీనటులు:
జయంరవి ఈ కథ నమ్మడం గొప్ప విషయమే. దర్శకుడు చెప్పింది నమ్మి ముందుకు వెళ్లిపోయాడు హీరో. నటుడిగా జయంరవికి పేరు పెట్టాల్సిన పనిలేదు. అయితే లాజిక్స్ విషయంలో కూడా కాస్త దర్శకున్ని అడగాల్సింది. నివేదా పేతురాజ్ కూడా బాగానే చేసింది. ఆమె నటనకు పెద్దగా స్కోప్ ఏం లేదు. అంతా ఒకే ఎక్స్ ప్రెషన్స్ తో లాగించేసింది. హీరో ఫ్రెండ్స్ పర్లేదు. ఇక స్పేస్ ఆర్మీ ఛీఫ్ గా జయప్రకాశ్ కూడా బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా మనకు తెలియని మొహాలే. కథలో కూడా పెద్దగా వాళ్లకు ఇంపార్టెన్స్ ఉండదు.
టెక్నికల్ టీం:
డి ఇమాన్ సంగీతం పర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. ముఖ్యంగా స్పేస్ లో ఉన్నపుడు వచ్చిన ఆర్ఆర్ బాగానే అనిపిస్తుంది. సినిమా టోగ్రఫీ పర్లేదు. వెంకటేశ్ తన పని బాగానే చేసాడు. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ స్పేస్ లో ఉండే రెండు మూడు సీన్స్ మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తాయి. భూమి మాదిరి ఫైట్ చేయడం అనేది వింతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు శక్తిసౌందరరాజన్ కొత్త ప్రయోగం చేసాడు. దానికి ఆయన ప్రశంసనీయుడు. కానీ స్పేస్ అనే మాట పట్టుకుని మిగిలిదంతా రొటీన్ సినిమా చేసాడు. అదే మైనస్ ఇక్కడ. తమిళ్ లో జయంరవికి ఉన్న ఇమేజ్ తో వర్కవుట్ అవుతుందేమో కానీ తెలుగులో మాత్రం కష్టమే.
చివరగా:
టిక్ టిక్ టిక్.. కొంచెం థ్రిల్.. కొంచెం డల్..!