CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ : నా నువ్వే
నటీనటులు : కళ్యాణ్ రామ్, తమన్నా, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : పిసి శ్రీరామ్
నిర్మాత : మహేశ్ కోనేరు
సంగీతం : శరత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : జయేంద్ర
కెరీర్ లో తొలిసారి ఈ ఏజ్ లో ప్రేమకథ ట్రై చేసాడు కళ్యాణ్ రామ్. తమన్నాతో రొమాన్స్ కూడా పిచ్చెక్కించాడు ఈ హీరో. ట్రైలర్స్.. టీజర్స్ కూడా ఫ్రెష్ ఫీల్ తెప్పించాయి. ఇక ఇప్పుడు సినిమా విడుదలైంది. మరి కళ్యాణ్ రామ్ కోరుకున్న విజయం నా నువ్వే ఇచ్చిందా..?
కథ:
వరుణ్ (కళ్యాణ్ రామ్) జాబ్ కోసం యుఎస్ వెళ్లాలనుకుంటాడు. ఎయిర్ పోర్ట్ కు కూడా వచ్చి ఫ్లైట్ మిస్ చేసుకుంటాడు. అలా మిస్ చేసుకుని.. ట్రైన్ కోసం స్టేషన్ కు వస్తాడు. అక్కడే అనుకోకుండా తనకు తెలియకుండానే మీరా(తమన్నా) ను చూస్తాడు. అక్కడితో వరుణ్ అంతా మరిచిపోతాడు. కానీ మీరా జీవితంలో మాత్ర వరుణ్ ప్రత్యేకంగా మారతాడు. తనకు తెలియకుండానే మీరాకు వరుణ్ లక్కీ ఛామ్ అవుతాడు. అతడి వల్లే ఆర్జేగానూ మారుతుంది. ఓ టైమ్ లో ఇద్దరూ కలుసుకుంటారు కూడా. కానీ తర్వాత మీరా తండ్రి ప్రభాకర్ (తణికెళ్ల భరణి) చేసిన పనితో విడిపోతారు. మరి ఈ జంట ఎప్పుడు ఎలా కలిసింది అనేది అసలు కథ..
కథనం:
కొత్తదనం ఉండాలి.. కానీ మరీ కొత్తదనం ఎక్కువైతే కూడా భరించడం కష్టం. నా నువ్వే విషయంలో ఇదే జరిగింది. కళ్యాణ్ రామ్ కొత్తగా ఉన్నాడు.. గెటప్ సెటప్ అంతా మార్చేసాడు. కెరీర్ లో తొలిసారి పూర్తిస్థాయి ప్రేమకథలో నటించాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ.. తమన్నా గ్లామర్..
ఇలా ఎన్నో ఉన్నా కథలో సోల్ మిస్ అయిందేమో అనిపించింది. ప్రేమ.. దాన్ని సపోర్ట్ చేసే డెస్టినీ అంటూ లాజిక్ లేని సీన్స్ అల్లుకున్నాడు దర్శకుడు జయేంద్ర. హలో సినిమాలో కూడా విక్రమ్ కే కుమార్ డెస్టినీని చూపించాడు. కానీ అక్కడ కొన్ని సీన్స్ అద్భుతంగా అల్లుకున్నాడు విక్రమ్.. అదే నా నువ్వేలో మిస్ అయింది. అదేదో మంత్రం వేసినట్లు.. హీరోయిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు హీరో కనబడతాడు.
అదేంటి అంటే డెస్టినీ అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఎంతసేపూ కథ సర్కిల్ లో తిరుగుతున్నట్టు అక్కడే తిరుగుతుంది కానీ ముందుకెళ్లదు. ప్రపంచం మరీ ఇంత చిన్నదా.. డెస్టినీ ఇలా ఉంటుందా అనిపిస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. తెలిసిన కథనే.. మరింత రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించేసాడు దర్శకుడు. 180 సినిమాలో విషాద ప్రేమకథను చూపించిన జయేంద్ర.. ఈ సారి ప్రేమికులను కలిపినా కూడా ఆ ఫీల్ అయితే ఎక్కడా కనిపించదు.
కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసాడు కానీ.. కథ గురించి కూడా పట్టించుకోవాల్సింది. తాను ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు కాబట్టి.. కళ్యాణ్ రామ్ కు ఈ కథ కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ.. ప్రేక్షకులకు మాత్రం ఇలాంటి డెస్టినీ ప్రేమకథలు అలవాటైపోయాయి. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడానికి కూడా పెద్దగా కారణాలుండవు. వర్షం సినిమాలో ప్రభాస్, త్రిషలా డెస్టినీ అంటారంతే. ఆ తర్వాత వాళ్లు కలుసుకునే తీరు కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. రెండు గంటల సినిమా కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందంటే ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
నటీనటులు:
కళ్యాణ్ రామ్ కొత్తగా ఉన్నాడు.. అందులో అనుమానం లేదు. నటన కూడా బాగానే ఉంది. అయితే ప్రేమకథకు ఇప్పుడు కళ్యాణ్ సెట్ కాలేదు. గెటప్ మార్చేసాడు కానీ ఆయన జీన్స్ ఎక్కడికి పోతుంది. తమన్నా ఉన్నంతలో బాగా చేసింది. అందంగా అందంతో మరిపించింది. హీరో స్నేహితులుగా ప్రవీణ్, వెన్నెల కిషోర్ పర్లేదు. అప్పుడప్పుడూ నవ్వించే బాధ్యత వెన్నెల తీసుకున్నాడు. ఇక పోసాని, తణికెళ్ల భరణి కూడా ఉన్నంతలో బానే చేసారు.
టెక్నికల్ టీం:
పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పడానికేం లేదు. ఆయన వర్క్ గురించి చెప్పే స్థాయి కూడా మనది కాదు. ఆయన తన వరకు అద్భుతంగా చూపించాడు విజువల్స్. కానీ దర్శకుడి కథే సహకరించలేదు. ఎడిటింగ్ వీక్ అనిపిస్తుంది. రెండు గంటల నడివి ఉన్నా కూడా సినిమా ఎందుకో బాగా సాగినట్లు అనిపిస్తుంది. కథ పాతదే.. కథనం మరీ రొటీన్.. డెస్టినీని నమ్ముకుని కథలు రాసుకున్నపుడు స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఈ చిత్రంలో మిస్ అయింది. సోల్ లేని ప్రేమకథలా అనిపిస్తుంది నా నువ్వే.
చివరగా:
నా నువ్వే.. బ్యాండ్ బాజా డెస్టినీ..