రివ్యూ : భ‌ర‌త్ అనే నేను

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

న‌టీన‌టులు: మ‌హేశ్ బాబు, కైరా అద్వాని, ప్ర‌కాశ్ రాజ్, శ‌రత్ కుమార్, పోసాని త‌దిత‌రులు
క‌థ‌       :     శ్రీ‌హ‌రి నాను
సంగీతం  :    దేవీ శ్రీ ప్ర‌సాద్
స్క్రీన్ ప్లే  ,    ద‌ర్శ‌కుడు: కొర‌టాల శివ‌
నిర్మాత‌  :    డివివి దాన‌య్య
కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీతో పాటు ప్రేక్ష‌కుల్ని కూడా బాగా ఆక‌ట్టుకుంటున్న పేరు భ‌ర‌త్ అనే నేను. సినిమా ఎలా ఉంటుందో తెలియ‌కుండానే అంచ‌నాలు మాత్రం ఆకాశాన్ని అంటుకున్నాయి. దానికి కార‌ణం మ‌హేశ్ అండ్ కొర‌టాల కాంబినేష‌న్. పొలిటిక‌ల్ క‌థ కావ‌డం.. ఇవ‌న్నీ క‌లిపి భ‌ర‌త్ అనే నేనును మ‌రో రేంజ్ కు తీసుకెళ్లాయి. మ‌రి వాటిని ఈ కాంబినేష‌న్ అందుకుందా..?
క‌థ‌:
భ‌ర‌త్(మ‌హేశ్ బాబు) చిన్న‌పుడే త‌ల్లిని పోగొట్టుకుంటాడు. ఆయ‌న తండ్రి రాజ‌కీయ నాయ‌కుడు కావ‌డంతో కొడుకుతో అస్స‌లు గ‌డ‌ప‌డు. కొడుకు కోస‌మే మ‌రో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె బాగా చూసుకోక‌పోవ‌డంతో లండ‌న్ వెళ్లిపోతాడు భ‌ర‌త్. ఆ త‌ర్వాత తండ్రి కూడా పెరిగి ముఖ్య‌మంత్రి (శ‌ర‌త్ కుమార్) అవుతాడు.
ఎన్నో ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఆయ‌న తండ్రి మ‌ర‌ణ వార్త‌తో ఇండియాకు వ‌స్తాడు. వ‌చ్చిన త‌ర్వాత పార్టీ కోసం త‌న తండ్రి ఆశ‌యం కోసం త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి అవుతాడు. ఆయ‌న్ని సిఎం చేస్తాడు తండ్రి స్నేహితుడు వ‌ర్ధ‌న్ రావు(ప్ర‌కాశ్ రాజ్). సిఎం సీట్ లో కూర్చున్న త‌ర్వాత భ‌ర‌త్ చేసే ప‌నుల‌తో ప్ర‌జ‌ల‌కు మంచి.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మెంట‌ల్ ఒకేసారి ఎక్కుతుంది. దాంతో ఆ త‌ర్వాత ఆయ‌న్ని ఎలా అడ్డుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతారు రాజ‌కీయ పార్టీలు. త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..
క‌థ‌నం:
కొర‌టాల అనే నేను.. ఎప్పుడు ఏం చేసినా.. ఎలాంటి సినిమా తీసినా.. ప్రేక్ష‌కుల‌కు ఏదో మంచి చెప్తాన‌ని.. సినిమా అంటే ప‌వ‌ర్ ఫుల్ మీడియా అని న‌మ్ముతాన‌ని.. అంతః క‌ర‌ణ శుద్ధితో మంచి సినిమా చేస్తాన‌ని ప్ర‌మాణం చేస్తున్నాను. భ‌ర‌త్ అనే నేను చూసిన త‌ర్వాత చాలా మంది ప్రేక్ష‌కుల్లో క‌లిగే ఫీలింగ్ ఇదే.
సినిమా అనేది వ్యాపారంతో పాటు ప‌వ‌ర్ ఫుల్ మీడియా. మొద‌ట్నుంచీ ఇది నమ్మే సినిమాలు చేస్తున్నాడు.. భ‌ర‌త్ లోనూ ఇదే చూపించాడు. తాను న‌మ్మిన క‌థ‌కు.. మ‌హేశ్ లాంటి స్టార్ ను తీసుకుని.. ఇవ్వాల‌నుకున్న సందేశాన్ని సూటిగా ఇచ్చేసాడు కొర‌టాల. సినిమాలో చూపించిన‌ట్లు ఏ ముఖ్య‌మంత్రి అలా ఉంటాడో లేదో తెలియ‌దు కానీ.. నిజంగా అలా ఉంటే మాత్రం క‌చ్చితంగా దేశం ఎక్క‌డికో వెళ్లిపోతుంది. పాలిటిక్స్ తెలియ‌వంటూనే..
ముఖ్య‌మంత్రిగా ర‌ప్ఫాడించాడు మ‌హేశ్ బాబు. భ‌ర‌త్ పాత్ర‌ను పూర్తిగా ఓన్ చేసుకుని అద‌ర‌గొట్టాడు సూప‌ర్ స్టార్. ఇక కొర‌టాల కూడా తెలిసిన క‌థ‌నే.. ఆక‌ట్టుకునే స్క్రీన్ ప్లే తో న‌డిపించాడు. క‌మ‌ర్షియ‌ల్ జోలికి వెళ్ల‌కుండా తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా స్క్రీన్ పై చూపించాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు ఎలా ఉన్నాయో మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపించాడు కొర‌టాల‌. ఇలాంటి సిన్సియ‌ర్ క‌థ‌ను మ‌హేశ్ న‌మ్మ‌డం కూడా అభినంద‌నీయం.. స్లో గా అనిపించినా.. రెగ్యుల‌ర్ సినిమాల్లో క‌నిపించే కామెడీ దూర‌మైనా..
ఓ సిన్సియ‌ర్ ఇష్యూను కొర‌టాల డీల్ చేసిన విధానం మాత్రం బాగుంది. రాజ‌కీయ నాయ‌కుడు ఎలా ఉంటాడో మ‌న‌కు తెలుసు. కానీ ఇలా ఉంటే బాగుంటుంద‌ని చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా భ‌ర‌త్ అనే నేను.. మంచి ప్ర‌మాణమే చేసాడు.. ఫ‌స్టాఫ్ లోనే తానేం చెప్పాల‌నుకుంటున్నాడో చెప్పేసాడు కొర‌టాల‌. ఆ త‌ర్వాత కూడా అదే టెంపో కంటిన్యూ చేసాడు. అయితే శ్రీ‌మంతుడు త‌ర‌హా క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఇందులో క‌నిపించ‌వు. దాంతో తాను సిన్సియ‌ర్ గా అనుకున్న క‌థ‌కు న్యాయం చేయ‌డానికి అన్నీ త్యాగం చేసాడు కొర‌టాల‌.
న‌టీన‌టులు:
మ‌హేశ్ బాబు న‌ట‌న గురించి ఈ రోజు కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎన్నోసార్లు ఉత్త‌మ న‌టుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ గా అంతఃక‌ర‌ణ శుద్ధితో న‌టించాడు. ముఖ్యంగా అసెంబ్లీ సీన్స్.. సెకండాఫ్ లో వ‌చ్చే మీడియాను విమ‌ర్శించే సీన్ లో అయితే మ‌హేశ్ లోని అత్యుత్త‌మ న‌టుడు క‌నిపించాడు.
ఇక హీరోయిన్ కైరా అద్వాని పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఆమెకు పెద్ద‌గా కీల‌క‌మైన పాత్ర ప‌డ‌లేదు. ప్ర‌కాశ్ రాజ్ ఉన్నంత వ‌ర‌కు బాగా చేసాడు. శ‌ర‌త్ కుమార్ ది చిన్న పాత్రే. పోసాని.. పృథ్వీ.. ఇలా అంతా క‌థ‌లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే. ముఖ్య‌మంత్రి పిఎస్ గా బ్ర‌హ్మాజీ బాగా చేసాడు.
టెక్నిక‌ల్ టీం:
దేవీ శ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి భ‌ర‌త్ అనే నేనుకు బ‌లంగా నిలిచాడు. ఈయ‌న పాట‌లు సోసోగా ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించిన ఫీల్ క‌లుగుతుంది. ఫ‌స్టాఫ్ లో కూడా కొన్ని సీన్స్ సినిమాలో ఇబ్బంది క‌లిగిస్తాయి.
రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన పాట‌లు బాగున్నాయి. వ‌చ్చాడ‌య్యో సామి లాంటివి అర్థ‌వంతంగా అనిపించాయి. శ్రీ‌హ‌రి నాను అందించిన క‌థ‌ను త‌న‌దైన శైలిలో పూర్తిస్థాయిలో రాసుకున్నాడు కొర‌టాల. సిన్సియ‌ర్ క‌థ‌కు త‌న‌వంతు న్యాయం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.
చివ‌ర‌గా:
భ‌ర‌త్ అనే నేను.. మంచి ప్ర‌య‌త్నం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here