CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: మహానటి
నటీనటులు : కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు..
సినిమాటోగ్రఫీ : డాని
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : స్వప్న దత్, ప్రియాంక దత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : నాగ్ అశ్విన్
మహానటి అంటే సావిత్రి.. సావిత్రి అంటే మహానటి.. ఆమె అంత మంచి నటి అంట..! అప్పట్లో ఆమె అలా బతికిందంట.. చనిపోయిందంట..! అంటూ కథలు కథలుగా చెప్తారు. ఇప్పుడు ఈ కథలన్నీ కలిపి ఓ నిజంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయింది..?
కథ:
చిన్నపుడే తండ్రిని కోల్పోయి పెదనాన్న కేవీ చౌదరి(రాజేంద్రప్రసాద్) దగ్గర పెరిగిన బుజ్జాయి సావిత్రి(కీర్తిసురేష్). చిన్ననాటి నుంచే ప్రతీ విషయాన్ని ఓ ఛాలెంజ్ లా తీసుకోవడం సావిత్రికి అలవాటు. సినిమాల్లో అతిపెద్ద నటి అయిన తర్వాత చివరి రోజుల్లో ఆమె కోమాలోకి వెళ్తుంది.
ఆ సమయంలో ప్రజావాణిలో పాత్రికేయురాలిగా పని చేసే మధురవాణి(సమంత) ఏదైనా అద్భుతమైన కథ రాయాలనుకుంటుంది. అది సావిత్రి కథే అవుతుంది. దాంతో ఆమె గురించి తెలుసుకోవాలని బయల్దేరుతుంది మధురవాణి. అసలు సావిత్రి జీవితం ఎలా మొదలైంది..? జెమినీ గణేషన్(దుల్కర్ సల్మాన్) తో ప్రేమ ఎలా మొదలైంది..? ఇవన్నీ తెలుసుకోవడం మొదలు పెడుతుంది.
ఆమె తొలిసారి మద్రాస్ వచ్చిన క్షణం.. జెమినీతో పరిచయం.. ఎల్వీ ప్రసాద్ (అవసరాల శ్రీనివాస్) సంసారం సినిమాలో అవకాశం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన వైనం.. ఇదంతా మిగిలిన కథ. కానీ అసలు తెరవెనక ఇంకో కథ ఉంటుంది.. అదేంటి అనేది తెరపై చూడాల్సిందే..
కథనం:
రెండేళ్ల కింద వచ్చిపోయిన హీరోయిన్లే మనకు గుర్తుండరు.. కానీ 37 ఏళ్ల కింద చనిపోయిన సావిత్రి గారు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ తరానికి ఆమె ఎలా ఉంటుందో తెలియదు.. ఆమె అభినయం తప్ప. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చూడ్డానికి వెళ్తాం. కానీ కొన్ని మాత్రం ఏదో ఉందని తెలుసుకోవాలనే ఆసక్తితో వెళ్తాం. మహానటి చిత్రాన్ని చాలా మంది చూసిన కోణం అదే. సావిత్రి గారు అంటే కేవలం నటిగానే ఈ తరానికి తెలుసు.
కానీ ఈ చిత్రం చూసిన తర్వాత మహానటి చూసిన తర్వాత ఓ వ్యక్తిగా పరిచయం అవుతుంది. తెరపై తన కళ్ళతోనే హావభావాలు పలికించిన సావిత్రి గారు.. తెరవెనక అవే కళ్లనీళ్ళతో కాపురం చేసారని తెలుస్తుంది. ఎన్నో నవ్వులతో వెండితెరను మైమరిపించిన ఆ మహానటి..
నిజ జీవితంలో మాత్రం నిత్యం ఏడుస్తూనే ఉందని ఇప్పుడే అర్థమవుతుంది. చిన్నపుడే తండ్రిని పోగొట్టుకున్నప్పట్నుంచీ.. ప్రేమ కోసం జెమినీ గణేషన్ ను పెళ్లాడి తర్వాత జీవితంలో పోరాటం చేసే వరకు.. లక్షలు సంపాదించి.. అడిగిన వాళ్లకు కాదనకుండా సాయం చేసి.. చివరికి ఏమీ లేకుండా అద్దె ఇంట్లో బతికేంత దారుణమైన స్థితి వచ్చే వరకు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆమె..
చివరి రోజుల్లో ఉండటానికి ఇళ్లు కూడా లేని దయనీయ స్థితి వరకు.. కెరీర్ లో ఆమె ఎదిగిన వైనం నుంచి జీవితంలో ఆమె దిగజారిన క్షణం వరకు.. అభినేత్రిగా కోట్ల మంది హృదయాలను గెలిచిన రాణి నుంచి.. అభిమానం తప్ప అన్నీ పోగొట్టుకున్న నిరుపేద వరకు.. ఇలా ప్రతీ అంశాన్ని కూడా ఎక్కడా వదలకుండా చూపించాడు నాగ్ అశ్విన్. సినిమా ఎలా ఉంది అనే దానికంటే.. ఆయన ప్రయత్నమే ప్రశంసనీయం.
మహానటి పాత్రలో అభినవ సావిత్రిగా ఒదిగిపోయింది కీర్తిసురేష్. చివరగా మహానటి చిత్రం కాదు.. ఓ జీవితం.. మంచి అనుభవం. ఇక ఆమెలోని వ్యక్తిత్వాన్ని.. అమ్మ లాంటి దాతృత్వాన్ని కూడా అలాగే చూపించాడు దర్శకుడు. చివరికి ఆమె సాయం చేసిన వాళ్లు కూడా పట్టించుకోకపోవడం నిజంగా శోచనీయం. ఆమె కూడా ఆత్మగౌరవాన్ని నింపుకుని సాయం కోసం వేచి చూడకుండా అలాగే చనిపోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
నటీనటులు:
సావిత్రి లాంటి మహానటి బయోపిక్ తీయాలని ఆలోచన వచ్చినపుడు.. ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు.. అంత గొప్ప నటి ఎవరున్నారు అనే అనుమానం అందరికీ వస్తుంది. దానికి నేనున్నానంటూ పూర్తిస్థాయి న్యాయం చేసింది కీర్తిసురేష్. సావిత్రి అంత గొప్పగా నటించలేదేమో కానీ.. ఆమె హావభావాలను మాత్రం అచ్చంగా దించేసింది. నిజంగా సావిత్రి ఇలాగే నటించేదేమో అనేంతగా మారిపోయింది. ఇక జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కూడా ఒదిగిపోయాడు.
ఆయన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హీరో ఛాయలు ఉన్న విలన్ అతడు. ప్రేమ ఓకే.. పెళ్లి కాదు అనే భావజాలం ఉన్న పాత్ర అది. అందులో చక్కగా నటించాడు దుల్కర్. సమంత జర్నలిస్ట్ పాత్రలో మెప్పించింది. క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతం. విజయ్ దేవరకొండ బాగా చేసాడు. ప్రకాశ్ రాజ్.. క్రిష్.. తరుణ్ భాస్కర్.. సందీప్ రెడ్డి వంగా.. నాగచైతన్య.. మోహన్ బాబు.. రాజేంద్ర ప్రసాద్.. ఇలా ఒక్కరేంటి సినిమాలో ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోసారు.
టెక్నికల్ టీం:
మహానటికి అతిపెద్ద ప్లస్ మిక్కీ జే మేయర్ సంగీతం. పాటలే కాదు.. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు మిక్కీ. ఇక డాని సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా విజువల్స్ బాగా కుదిరాయి. సాయిమాధవ్ బుర్రా మాటలు అద్భుతంగా కుదిరాయి. ఆడవాళ్ళ ఏడుపు ప్రపంచమంతా చూస్తుంది..
మగాళ్ల ఏడుపు మాత్రం మందు గ్లాసు మాత్రమే చూస్తుంది అనే ఛలోక్తులు కూడా బాగా రాసాడు బుర్రా. ఇక నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో..! 30 ఏళ్లు కూడా సరిగ్గా లేని ఈ కుర్రాడు సావిత్రిని ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడబ్బా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. అంత అద్భుతంగా తెరకెక్కించాడు.
చివరగా:
మహానటి.. మరుపురాని మధుర జ్ఞాపకం..