విక్ర‌మ్.. ఆల్ ఇండియా ప‌ర్మిట్..


రాజ‌మౌళి కేరాఫ్ తెలుగు సినిమా.. శంక‌ర్ కేరాఫ్ త‌మిళ సినిమా.. భ‌న్సాలీ కేరాఫ్ హిందీ సినిమా.. ఇలా ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో ఇండ‌స్ట్రీ కేరాఫ్ అని ఉంటుంది. కానీ విక్ర‌మ్ కే కుమార్ కు మాత్రం ఇలాంటి కేరాఫ్ ఒక్క‌టి కూడా లేదు. ఈయ‌న అంద‌రివాడు. ఆల్ ఇండియా ప‌ర్మిట్ తీసుకున్న ట్రాన్స్ పోర్ట్ లా అన్ని ఇండ‌స్ట్రీల‌ను చుట్టేస్తూ ఉంటాడు. ఓ సారి తెలుగు సినిమా చేస్తాడు.. వెంట‌నే త‌మిళ సినిమా అంటాడు.. అంత‌లోనే హిందీకి హూందాగా వెళ్లిపోతాడు. కెరీర్ మొద‌లుపెట్టిన ఇన్నేళ్ల‌లో ఏ ఇండ‌స్ట్రీలోనూ కుదురుగా ఉండ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. మొన్న‌టికి మొన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు హ‌లో చెప్పిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు ఛ‌లో బాలీవుడ్ అంటున్నాడు. హ‌లోకు ముందు త‌మిళ్ లో 24 సినిమా చేసాడు విక్ర‌మ్.
దానికి ముందు మ‌నం, ఇష్క్ అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. 13బితో హిందీలో హిట్ కొట్టాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత బాలీవుడ్ కు వెళ్తున్నాడు. ఈయ‌న త్వ‌ర‌లోనే అక్ష‌య్ కుమార్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ తో విక్ర‌మ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. అదే క‌థ ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కు చెప్పి ఒప్పించాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. అక్ష‌య్ కుమార్ ప్ర‌స్తుతం ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు విక్ర‌మ్ కూడా నానితో ఓ క‌మిట్మెంట్ తీసుకున్నాడు. మ‌రి నాని సినిమా పూర్తైన త‌ర్వాత అక్ష‌య్ తో సినిమా చేస్తాడా.. లేదంటే ముందే బాలీవుడ్ వెళ్లి త‌ర్వాత టాలీవుడ్ కు వ‌స్తాడా అనేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి ఆల్ ఇండియా ప‌ర్మిట్ తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here