CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: 2 కంట్రీస్
నటీనటులు: సునీల్, మనీషా రాజ్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు: ఎన్ శంకర్
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్
సునీల్ సినిమా అంటే ఒకప్పుడు కాస్తో కూస్తో నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అది కినిపంచట్లేదు. దాంతో తనేంటో నిరూపించుకోవాలని మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. మొన్నే ఉంగరాల రాంబాబుతో షాకిచ్చిన సునీల్.. ఇప్పుడు 2 కంట్రీస్ తో వచ్చాడు. మరి ఈసారైనా విజయం సునీల్ ను వరించిందా..? ఎలా ఉంది ఈ చిత్రం..?
కథ:
ఉల్లాస్ కుమార్(సునీల్) వెంకటాపురంలో ఉంటాడు. ఆ ఊరు ఎమ్మెల్యే పేరు కూడా అదే. అతడే ఉల్లాస్ (దేవ్ గిల్). దాంతో అదే పేరుతో ఉన్న ఉల్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఎమ్మెల్యే ఉల్లాస్ ను ఓడించి అపోజిషన్ పార్టీతో డబ్బు తీసుకుంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలనేది ఈయన ఆశ. అదే టైమ్ లో ఊళ్లో ఉన్న ఆసామి పటేల్(సాయాజి షిండే) చెల్లిని డబ్బు కోసం పెళ్లి చేసుకుంటానంటాడు. ఆమెకు కాళ్లు ఉండవు. సరిగ్గా ఆ సమయంలోనే ఉల్లాస్ కు అమెరికా సంబంధం వస్తుంది. అది కూడా తన చిన్ననాటి ఫ్రెండ్ లయ(మనీషా రాజ్) నుంచి. చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఉల్లాస్ కూడా డబ్బు కోసం ఆశపడి పెళ్లి చేసుకుంటాడు. కానీ లయకు తాగుడు అలవాటు ఉంటుంది. పెళ్లైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంది. అందువల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అసలు ఆ సమస్య ఎలా తీరింది..? ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారా లేదా అనేది కథ..
కథనం:
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటూ ఇప్పుడు అల్లాడిపోతున్నాడు సునీల్. ప్రతీ సినిమాతో రావడం.. వెళ్లడం చేస్తున్నాడు కానీ కొన్ని రోజులు నిలబడటం మాత్రం మరిచిపోయాడు ఈ హీరో. ఇప్పుడు 2 కంట్రీస్ అంటూ వచ్చాడు. 90ల్లో రమ్యకృష్ణ, శ్రీకాంత్ జంటగా వచ్చిన ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా చూస్తే ఇప్పుడు 2 కంట్రీస్ గుర్తొస్తుంది. అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ పల్లెటూరి కుర్రాడు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే ఈ చిత్ర కథ. కొత్త కథేమీ లేకపోయినా.. మరోసారి కామెడీతో నెట్టుకురావాలని చూసాడు సునీల్. కానీ అది కుదర్లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి అర్థం పర్థం లేని ప్రాసలే కనిపిస్తాయి కానీ కథలో సీరియస్ నెస్ అనిపించదు. ఎంతసేపటికి డబ్బు సంపాదించాలనే ధ్యాసనే హీరోలో చూపించిన శంకర్.. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? ఎటు వెళ్తుందనే విషయంపై దృష్టి పెట్టలేదు. ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో వెళ్లిపోతుంది. ఒక్క సీన్ కూడా పెద్దగా ఆసక్తి కలిగించదు.
ఇంటర్వెల్ వరకు కూడా అసలు కథలో వేగం ఉండదు. బ్రేక్ కూడా సింపుల్ గా ఊహించినట్లే ఇచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత కూడా కథలో ఎలాంటి చలనం కనిపించదు. ప్రేక్షకుల సహనం తప్ప. మళయాలంలో బ్లాక్ బస్టర్ అయినా.. తెలుగులో మాత్రం ఆ ఫీల్ మిస్సైంది. తాగడం తప్పు.. మందు మన జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పే లైన్ బాగానే ఉన్నా.. దాన్ని స్క్రీన్ కు ఎక్కించడంలో మాత్రం దర్శకుడు శంకర్ నిరాశపరిచాడు. అర్థం పర్థం లేని ప్రాసల కోసం కనిపించిన తాపత్రయం.. ఎమోషన్స్ లో కనిపించలేదు. కథలో సీరియస్ గా వచ్చే సీన్స్ కూడా కొన్నిసార్లు సిల్లీగా అనిపిస్తాయి. సునీల్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించినా.. కంటెంట్ లేక తేలిపోయింది. 2 కంట్రీస్ కథ అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు తరహాలో అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు కూడా కథలో వేగం కనిపించదు.. అప్పుడు కూడా సాదాసీదాగా వెళ్లిపోతుంది కానీ ఎక్కడా ఆసక్తి పెంచేలా కనిపించదు. మళయాలంలో హీరో హీరోయిన్ల మధ్య వర్కవుట్ అయిన మ్యాజిక్.. ఇక్కడ రిపీట్ కాలేదు.
నటీనటులు:
సునీల్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నాడు. పైగా ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. తన వరకు బాగానే చేసాడు ఈ భీమవరం బుల్లోడు. కమెడియన్ అవసరం లేకుండా తానే కామెడీ చేసాడు. ఇక ఈయనకు తోడుగా ఫస్టాఫ్ లో శ్రీనివాస్ రెడ్డి ఓకే అనిపించాడు. హీరోయిన్ మనీషా రాజ్ తాగుబోతు భార్యగా బాగానే నటించింది. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నంతలో నవ్వించాడు. రాజా రవీంద్ర, సిజ్జు, సితార, సీనియర్ నరేష్, సంజన.. వీళ్ళంతా కథలో బాగంగా వస్తూ వెళ్తుంటారు.
టెక్నికల్ టీం:
గోపీసుందర్ మ్యూజిక్ అంటే మనసును తాకుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఈసారి అది మిస్ అయింది. 2 కంట్రీస్ కు మళయాలం మ్యాజిక్ చేయలేకపోయాడు గోపీసుందర్. ఇక సినిమాటోగ్రఫీ రాంప్రసాద్ అమెరికా అందాలను బాగానే చూపించాడు. ఎడిటింగ్ లో కోటగిరి తన కత్తెరకు బాగా పని చెప్పాల్సి ఉంది. 2 గంటల 40 నిమిషాల సినిమా కావడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. ఇక దర్శకుడిగా ఎన్ శంకర్ ఆకట్టుకోలేదు. ఒకప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు చేసిన ఈయన నుంచి ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఊహించడం కష్టమే. అయితే ఖర్చు విషయంలో మాత్రం ఎక్కడా వెనకాడలేదు ఎన్ శంకర్.
చివరగా:
2 కంట్రీస్.. ఇంగ్లీష్ పెళ్లాం.. వెంకటాపురం మొగుడు..