2.0 సినిమా లేదు.. కానీ టీజ‌ర్ ఉంది.. 

శంక‌ర్ సినిమాల్లో హీరో ఏది అనుకుంటే అది జ‌రుగుతుంది. కావాలంటే అప్పటిక‌ప్పుడు గ్రాఫిక్స్ లో అయినా దాన్ని సెట్ చేస్తాడు శంక‌ర్. కానీ బ‌య‌ట మాత్రం అలా జ‌ర‌గ‌దు. అయినా మ‌నం ఏది అనుకుంటే అది జ‌రిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.. అన్నింటికీ మించి అది శంక‌ర్ సినిమా ఎందుక‌వుతుంది..? చెప్పిన టైమ్ కు తీసుకురాక‌పోవ‌డ‌మే శంక‌ర్ ప్ర‌త్యేక‌థ‌. అనుకున్న టైమ్ కు సినిమాను విడుద‌ల చేస్తే త‌న ఇమేజ్ ఎక్కడ త‌గ్గిపోతుందేమో అని ఫీల్ అవుతాడేమో శంక‌ర్..? అందుకే ఒక్క‌సారి కూడా త‌న సినిమాను చెప్పిన టైమ్ కు తీసుకురాడు. ఇప్పుడు 2.0 విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ కావ‌ట్లేదు. ఇప్పుడు ఎప్రిల్ కు వెళ్లిపోయింది ఈ చిత్రం.

ఫ్యాన్స్ ఎక్క‌డ బాధ ప‌డ‌తారో అని.. రిలీజ్ డేట్ చెప్పిన రోజు టీజ‌ర్ విడుద‌ల చేసి వాళ్ల‌కు స‌ర్ది చెబుతున్నారు. అవును.. జనవరి 26న రిపబ్లిక్‌ డే కానుకగా 2.0 టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇక ట్రైలర్‌ ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్ కార‌ణంగానే వాయిదా పడిందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్ర విజువ‌ల్ ఎఫెక్ట్స్ టీం మేనేజ‌ర్ శ్రీనివాస్‌ మోహన్‌ పర్యవేక్షణలో ప్ర‌పంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం పని చేస్తున్నాయి. బాహుబ‌లి తొలి భాగానికి ప‌నిచేసింది ఈయ‌నే. ఇక ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.0 రికార్డు సృష్టించబోతోంది. 450 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజోన్‌, సుధాన్షు పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎప్రిల్లో సినిమా విడుదల కానుంది.. కానీ ఇంకా డేట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here