ఎఫ్ 2 సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20190112

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: ఎఫ్ 2
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు

సంక్రాంతి సినిమాల్లో ముందు నుంచి భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా ఎఫ్ 2. ఇప్పుడు ఈ సినిమా విడుదలైంది. మరి ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

కథ..
వెంకటేష్ ఓ బ్యాచిలర్. ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏగా పని చేస్తుంటాడు. త్వరగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుంటాడు. కానీ పెళ్లయిన తర్వాత ఫ్ర‌స్టేషన్ వస్తుందని ఊహించడు.. కానీ అదే జరుగుతుంది. తమన్నాను పెళ్లి చేసుకున్న తర్వాత లేనిపోని సమస్యలు తెచ్చుకుంటాడు వెంకటేష్. దాంతో ఫుల్లుగా ఫ్ర‌స్టేషన్ కు గురవుతాడు. అదే సమయంలో వరుణ్ తేజ్ కూడా తమన్నా చెల్లెలు మెహ్రీన్ ను ప్రేమిస్తాడు. వాళ్ల పెళ్లి కూడా కుదురుతుంది. కానీ వెంకటేష్ ని చూసి పెళ్లంటే భయపడి అతడితో కలిసి యూరప్ వెళ్ళిపోతాడు వరుణ్ తేజ్. పెళ్లి సమయానికి అలా వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది..

క‌థ‌నం:
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు.. ఎంత నవ్వించాయి అని మాత్రమే అడగాలి.. ఇప్పుడు విడుదలైన ఎఫ్ 2 కూడా అంతే..
ట్రైలర్ విడుదల అయినప్పుడే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు అనిల్ రావిపూడి కామెడీని హ్యాండిల్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుందని తెలుసు. అందుకే సంక్రాంతి సినిమాల్లో ముందు నుంచి ఎఫ్ 2 సైలెంట్ కిల్లర్ అనుకున్నారు అంతా. సినిమా చూసిన తర్వాత అది నిజమే అనిపించింది. మరోసారి తెలిసిన కథతోనే తెలివైన స్క్రీన్ ప్లే జోడించి ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు అనిల్ రావిపూడి. ఈయన రాసుకున్న కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.. ఫస్ట్ హాఫ్ అయితే కడుపులు చెక్కలు అయిపోయి కుర్చీలోంచి కింద పడి మరీ నవ్వుకోవ‌డం ఖాయం. ముఖ్యంగా వెంకటేష్ కు, కుక్క మధ్య అనిల్ రాసుకున్న సీన్ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత అనే కాన్సెప్టుతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఎందుకో తెలియదు ఎఫ్ 2 మాత్రం ప్రత్యేకం.. కథ కాకుండా సన్నివేశాల పరంగా ఈ చిత్రాన్ని నడిపించాడు అనిల్ రావిపూడి.
ఫస్టాఫ్ లో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా రాసుకున్న అనిల్.. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త తడబడి నట్లు అనిపించింది. కథ యూరప్ కు షిఫ్ట్ అయిన తర్వాత కాస్త నెమ్మదించింది.. అయినా కూడా సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తో అక్కడక్కడ నవ్వులు పూయించాడు అనిల్. క్లైమాక్స్ లో ఎప్పుడు ప్రకాష్ రాజ్ కు క్లాస్ పీకడం రొటీన్.. కానీ ఇక్క‌డ వెంకీ, వ‌రుణ్ కు పీకాడు అనిల్ రావిపూడి. ముందు నుంచి భార్య అంటే ఒక భయం గా చూపించిన ఈ దర్శకుడు. క్లైమాక్స్ లో భార్య‌ అంటే బాధ్యత అంటూ ఎమోషనల్ సీన్స్ కూడా పెట్టాడు. వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి కామెడీ పాత్రలో రెచ్చిపోయాడు.. ఆయన కామెడీ టైమింగ్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. వరుణ్ తేజ్ తెలంగాణా స్లాంగ్ లో ఆక‌ట్టుకున్నాడు. అనిల్ రావిపూడి కామెడీ సెన్స్ నిజంగానే అద్భుతం.. ఓవరాల్ గా లాజిక్ ల‌కు దూరంగా ఉంటే సంక్రాంతి పండక్కి కడుపుబ్బా నవ్వించే సినిమా ఎఫ్ 2.

నటీనటులు..
వెంకటేష్ అద్భుతంగా నటించాడు.. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కామెడీ పాత్రలు వస్తే అతడు జీవించే విధానం మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఎఫ్2లో కూడా ఇదే చేశాడు. వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టాడు. తమన్నా, మెహరీన్ కూడా గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు లాంటి వాళ్లతో కామెడీ చేయించాడు అనిల్ రావిపూడి. వైవిజయ, అన్నపూర్ణమ్మ కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

టెక్నికల్ టీం..
దేవిశ్రీప్రసాద్ పాటలు ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఆయన అందించిన రీరికార్డింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు.. ఎడిటింగ్ బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీన్లు సాగినట్లు అనిపించాయి. దర్శకుడిగా అనిల్ రావిపూడి మరోసారి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. తనకు బలంగా ఉన్న కామెడీతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు. ఫస్టాఫ్ లో వెంకటేష్ కు, కుక్కకు మధ్య వచ్చే ఒక సీన్ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. మొత్తానికి దర్శకుడిగా మరోసారి సత్తా చూపించాడు అనిల్ రావిపూడి. కాకపోతే సెకండ్ హాఫ్ పై కూడా కాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా పెద్ద సినిమా అయ్యుండేది.

చివరగా..
ఎఫ్2.. పండక్కి పండగ చేసుకునే సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here