కొన్ని సినిమాలను తెలియకుండానే తక్కువగా అంచనా వేస్తుంటారు. అవి విడుదలయ్యేంత వరకు వాటి సత్తా ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు యాత్ర సినిమా కూడా ఇదే చేస్తుంది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు తక్కువగానే ఉన్నాయి. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. వైఎస్ఆర్ బయోపిక్ ఎవరు చూస్తారు.. ఆయన జీవితంలో ఏముంది.. పైగా పాదయాత్ర నేపథ్యంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు, అనుమానాలు ముందు నుంచి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఈ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది..
మూడు రోజుల్లోనే 7 కోట్ల షేర్ వసూలు చేసి అద్భుతమైన విజయం అందుకుంటుంది యాత్ర. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వైయస్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. అభిమానులు ఈయన నటనను చూసి ఫిదా అయిపోతున్నారు.. వైసిపి నేతలు అయితే తమ నాయకుడు మళ్లీ బతికి వచ్చాడంటూ పండగ చేసుకుంటున్నారు. అంత బాగా వైయస్ పాత్రలో లీనమైపోయాడు మమ్ముట్టి. దానికి తోడు సొంత డబ్బింగ్ చెప్పుకోవడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. వైయస్ హావభావాలను.. ఆయన మాట తీరును.. బాడీ లాంగ్వేజ్ బాగా ఒంట పట్టించుకున్నాడు. ఇవన్నీ సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి. మొత్తానికి యాత్ర సినిమా దూకుడు చూస్తుంటే ఇప్పట్లో కలెక్షన్లు తగ్గడం కష్టమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ కంటే వైయస్సార్ సినిమాకు ఇప్పుడు ఎక్కువగా వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.