నేను తీసింది ఓ తిక్క సినిమా.. ఇది ఎలా ఉంటుందో నాక్కూడా తెలియదు. ఇందులో కమర్షియల్ అంశాలు లేవు.. ఓ సినిమా గురించి నిర్మాత ఇలా మాట్లాడటం సాధ్యమేనా..? ఇవన్నీ నాని మాట్లాడాడు. అ.. సినిమా గురించి న్యాచురల్ స్టార్ చెప్పిన మాటలివి. పైగా ఈ సినిమా కచ్చితంగా తిక్కకు లెక్క చూపిస్తుందంటున్నాడు. అసలు ఈ రోజుల్లో ఓ సినిమా చేసిన తర్వాత మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు.. అని దర్శక నిర్మాతలు తమ సినిమాల గురించి చెబుతుంటే కాస్త వింతగా.. ఓవర్ గా అనిపిస్తుంది. మాది కొత్త కథ అని చెప్పుకునే ధైర్యం కూడా ఎవరూ చేయట్లేదు. కానీ నాని మాత్రం చేస్తున్నాడు.. చెబుతున్నాడు.
ఈయన హీరోగా చేస్తోన్న సినిమా కాదు కానీ నిర్మాతగా మారి చేస్తోన్న సినిమాను మాత్రం బాగానే ప్రమోట్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఆ సినిమానే అ..! టైటిల్ తోనే అందర్నీ పడేసాడు నాని. ఇక ఈ చిత్రంలోని ఒక్కో పాత్రను పరిచయం చేసిన తీరు కూడా సినిమాపై ఆసక్తి బాగా పెంచేసింది. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదంటున్నాడు న్యాచురల్ స్టార్. రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అయితే ఈ కథను చేయరు కాబట్టే తానే నిర్మాతగా మారానంటున్నాడు నాని. ఇప్పటి వరకు టీజర్ విడుదలైంది.. ట్రైలర్ విడుదలైంది.. అయినా కూడా కథపై చిన్న క్లూ కూడా బయటికి రాలేదు. అసలు ఎలాంటి కథ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ప్రీ రిలీజ్ వేడుకలో కూడా సినిమా గురించి ఏ చిన్న క్లూ ఇవ్వలేదు నాని. తొమ్మిది మంది నటులు ఇందులో కీలకపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 16న సినిమా విడుదల కానుంది.
అసలు అ.. సినిమాలో ఏముందో తెలియక ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కథ అంటే ఏదో కొత్తగా ఉంటుందనే విషయం అర్థమవుతుంది. పైగా ఈ చిత్రం ఫస్ట్ లుక్స్ కూడా సినిమాపై ఆసక్తి రెండింతలు చేస్తున్నాయి. ఇందులో నాని చేపగా.. రవితేజ చెట్టుగా నటిస్తున్నారు. ఈ లుక్స్ అన్నీ కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక రెజీనా విలన్ గా.. శ్రీనివాస్ అసవరాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీనన్ లవబుల్ పాత్రలో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా నటిస్తున్నారు. రాజమౌళి అయితే అ.. కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతుందని ధీమాగా చెబుతున్నాడు. మరి చూడాలిక.. చివరికి నాని ప్రాడక్ట్ ఏం చేస్తుందో..?