ఓ సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ క్యాస్ట్ ముఖ్యమే. కానీ స్టార్స్ ఉన్న సినిమాలు కూడా చాలాసార్లు బక్కెట్ తన్నేసాయి. కానీ కథను నమ్మి వచ్చిన సినిమాలేవీ ఇంతవరకు ఫెయిల్ కాలేదు. కనీసం వాటికి ప్రశంసలైనా దక్కుతుంటాయి. ఈ మధ్య ఇలాంటి కథలకు టాలీవుడ్ లో కొదవే లేదు. కొత్త కొత్త కుర్రాళ్లు అద్భుతమైన కాన్సెప్టులతో వస్తున్నారు. గతేడాది అలా వచ్చిన సినిమా క్షణం. అడవి శేష్, అదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు రవికాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. చిన్న కథను.. పక్కా స్క్రీన్ ప్లేతో చెబితే ప్రేక్షకులు ఎంత బాగా కనెక్ట్ అవుతారో చెప్పడానికి క్షణం ఓ నిదర్శనం. సినిమాలో కథంటూ గొప్పగా ఏం ఉండదు. అక్కడ ఉన్నదంతా స్క్రీన్ ప్లే మాయాజాలమే.
జరగబోయే సీన్ ఏంటా అనే ఆసక్తిని చాలా చోట్ల రేకెత్తించడంలో క్షణం టీం సక్సెస్ అయ్యారు. అందుకే థియేటర్స్ లో జనం కూడా క్షణంను ఉత్కంఠ భరితంగా ఆస్వాదించారు. ఇప్పుడు ఈ కథను తమిళనాట కూడా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అక్కడ సత్య పేరుతో క్షణం సినిమాను రీమేక్ చేసారు. సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఇందులో హీరో. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అక్కడ అనసూయ పాత్రలో నటించింది. ఈ చిత్రం గత వారమే తమిళ్ లో విడుదలైంది. అక్కడ కూడా సినిమాకు సూపర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా కూడా లేకపోవడంతో తమిళ క్షణంకు వసూళ్లతో పాటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అన్నట్లు ఈ కథను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారు. అక్కడ సల్మాన్ ఖాన్ క్షణం రీమేక్ ను నిర్మించే అవకాశం ఉంది.