ఈ రోజుల్లో ఒక్క హిట్ పడితే వెంటనే మరో సినిమా మొదలుపెట్టేద్దాం అనే కంగారులో ఉంటారు దర్శకులు. తొలి సినిమా తెచ్చిన క్రేజ్ ను వెంటనే వాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఇద్దరు దర్శకులు మాత్రం అలా ఆలోచించడం లేదు. ఆలస్యమైనా పర్లేదు కానీ ఆచితూచి అడుగేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరేమో వరసగా మూడు విజయాలు అందుకున్నాడు.. మరొకరు తొలి సినిమా లోనే కావాల్సినంత కాంప్లికేటెడ్ కథను తీసుకుని మెప్పించాడు. వాళ్లే అనిల్ రావిపూడి.. శివనిర్వాణ. రాజా ది గ్రేట్ తో అనిల్ రావిపూడి క్రేజ్ బాగానే పెరిగింది. దాంతో ఈ కుర్ర దర్శకుడి తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. దాంతో ఉండబట్టలేక వెబ్ మీడియాలో వార్తలు కూడా రాసేసారు.
అనిల్ తర్వాతి సినిమా హీరో వెంకటేశ్ అని.. డిసెంబర్ 13న ఈ చిత్ర ముహూర్తం జరగబోతుందని రాసుకొచ్చారు. ఆ నోటా ఈ నోటా పడి చివరికి అది చేరాల్సిన వాళ్లకు చేరిపోయింది. దాంతో స్పందించిన అనిల్.. తన తర్వాతి సినిమాలో ఇద్దరు హీరోలుంటారని.. అయితే ఎవర్నీ ఎంచుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. దయచేసి చెప్పేవరకు ఆగండంటున్నాడు. ఈ చిత్రానికి ఎఫ్ 2 అనే టైటిల్ పెట్టాడు అనిల్. అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అన్నమాట. ఈ కథకు సరిపోయే హీరోల వేటలో ఉన్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు.
మరోవైపు శివనిర్వాణకు కూడా ఇదే సమస్య వచ్చింది. ఈయన తొలి సినిమా నిన్నుకోరి సూపర్ హిట్. దాంతో సాధారణంగానే రెండో సినిమాపై ఆసక్తి ఉంటుంది. దీనికి శివ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఈ కుర్ర దర్శకుడి నెక్ట్స్ సినిమా వరుణ్ తేజ్ తో అనే వార్తలొచ్చాయి. దాంతో శివ నిర్వాణే స్పందించాడు. తాను ఇంకా రెండో సినిమా ఎవరితో చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని.. కన్ఫర్మ్ అయిన తర్వాత తానే చెప్తానని చెప్పాడు శివ. పైగా ఇప్పుడు కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నానని చెప్పాడు ఈ దర్శకుడు. వీళ్లు మాత్రమే కాదు.. హరీష్ శంకర్ కూడా తనతో దాగుడు మూతలు ఆడే హీరోలింకా దొరకలేదంటున్నాడు. మొత్తానికి హీరోల విషయంలో కంగారొద్దు.. చెప్పేవరకు ఆగండంటున్నారు కుర్ర దర్శకులు.