ప్ర‌తిష్టాత్మ‌క వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో నాగార్జున‌, నానిల మ‌ల్టీస్టార‌ర్‌

క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు, వెండి తెర‌పై భారీద‌నం కురిపించిన సినిమాల‌కు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన క‌ల‌యిక‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌.  ఈ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృద‌యాల్ని గెల‌చుకొని – మ‌ర‌పురాని జ్ఞాప‌కాలుగా మిగిలిపోయాయి.  ఇప్పుడు వైజ‌యంతీ మ‌ళ్లీ పునః వైభ‌వం సాధించే దిశ‌గా అడుగులేస్తోంది. వ‌రుస‌గా సినిమాల్ని తెర‌కెక్కించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో క‌ల‌సి  సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో   ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్‌. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు.  ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి  ఈ సంస్థ‌ సిద్ద‌మైంది.  కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో  త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. ‘భ‌లే మంచి రోజు’, ‘శ‌మంత‌క‌మ‌ణి’లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న  శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది.
ఈ సందర్భంగా సి.అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ ”నాగార్జున‌, నానిల‌తో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇద్ద‌రితోనూ వైజయంతీ మూవీస్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన క‌థానాయ‌కుడు నాగార్జునే. ఆయ‌న‌తో  ఇది మా అయిద‌వ చిత్రం.  గ‌త చిత్రాల‌కంటే గొప్ప‌గా, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో ఈ సినిమాని రూపొందిస్తాం.  వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా ప‌తాకంపై  నానితో తెర‌కెక్కించిన ‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకొంది. వీరిద్ద‌రికీ స‌రిప‌డే క‌థ కుదిరింది. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ట‌ని మ‌రింత ఇనుమ‌డింప చేసేలా రాబోయే సినిమాలు ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం” అన్నారు.