అనుకున్నదే జరిగింది.. చివరి వరకు కచ్చితంగా రేస్ లో ఎవరో ఒకరు వెనక్కి వెళ్తారని తెలుసు. ఇప్పుడు ఇదే జరిగింది. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఎప్రిల్ 26 వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించారు నిర్మాతలు. అంతా ఒకే చోట కూర్చుని మనసులో మాటలు బయట పెట్టుకున్నారు. అంతా ఒకేసారి వస్తే కచ్చితంగా అంతా నష్టపోతాం అని అర్థమయ్యే భాషలోనే చెప్పుకున్నారు. భరత్ అనే నేను.. నా పేరు సూర్య లాంటి పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే కచ్చితంగా ఇద్దరికీ నష్టమే. ఇంక ఒక్క సినిమాకు కానీ నెగిటివ్ టాక్ వచ్చిందంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఈ నిర్మాత.. ఆ నిర్మాత కూర్చుని మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు.
భరత్ అనే నేను ముందు అనుకున్నట్లుగా కాకుండా ఎప్రిల్ 20నే వస్తుంది. అంటే ఓ వారం ముందుగానే సినిమా వచ్చేస్తుందన్నమాట. దీనికి తగ్గట్లే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే లక్డీకపూల్ లో జరుగుతుంది. ఇక నా పేరు సూర్య కూడా చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాను వక్కంతం వంశీ వేగంగానే పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య కాలా కూడా వచ్చేస్తున్నాడు. ఈయన ఎప్రిల్ 27న రానున్నాడు. భరత్ అనే నేను నిర్మాత దానయ్య.. నా పేరు సూర్య నిర్మాతలు నాగబాబు, లగడపాటి శ్రీధర్ మధ్య దిల్ రాజు సయోధ్య కుదుర్చాడు. మొత్తానికి ఓ పెద్ద యుద్ధాన్ని మాటలతో మాన్పించేసారు ఈ నిర్మాతలు.