విద్యాలయాలే ఆధునిక దేవాలయాలు : మధుసూధనాచారి 

నాగార్జున సాగరం ప్రారంభోత్సవంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని అన్నారని, అయితే ఈ కాలంలో విద్యాసంస్థలే దేవాలయాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి చెప్పారు.
శనివారం నాడు బ్రెయిన్ ఫీడ్ నిర్వహణలో ‘బ్రెయిన్ ఫీడ్ ఆంగ్ల మాస పత్రిక’ నిర్వహణలో ఆచార్య దేవోభవ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మధుసూధనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ ప్రైజస్ ప్రాంగణంలో జరిగింది.
దేశం నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారిని ఉద్దేశించి మధుసూధనాచారి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో గొప్పగా సంపాదించాలి. అంతకంటే హాయిగా బ్రతకాలని అనుకుంటున్నారు తప్ప, విజ్ఞానాన్ని సముపార్జించి పెట్టే విద్యను అభ్యసించాలని అనుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పయనించేలా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విద్యా రంగంపై కూడా దృష్టి పెడతారని, గురువులకే గురువైన చుక్కా రామయ్యగారి సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తానని చెప్పారు.
ఒకప్పుడు 25 శాతం మంది మాత్రమే చదువుకునేవారని, ఇప్పుడు 75 శాతం వరకు చదువుకుంటున్నారని, అయినా విలువలు పెరగడం లేదని వినిపిస్తోందని, దీనికి కారణాలను అన్వేషించాలని చెప్పారు. విలువలు అర్థవంతంగా, ఆదర్శంగా, అభిలషణీయంగా ఉండాలని, ఇందుకు విద్యార్ధి దశలోనే వారికి మార్గదర్శనం చేయాలని, అందుకు గురువులపై మహత్తరమైన బాధ్యత ఉందని మధుసూధనాచారి చెప్పారు.
తాను శాసన సభాపతి అయిన తరువాత తనకు విద్య బోధించిన గురువు దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నానని ఆయన గుర్తు చేస్తూ, వేదిక మీద, ముందు ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఆచార్య దేవోభవ అవార్డులతో పాటు విద్యారంగంలో ఉత్తమోత్తమ విలువలను పాటిస్తూ, అందరికి ఆదర్శంగా ఉన్న ఉపాధ్యాయులకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందించి సత్కరించారు.
విద్యార్థులిప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారి మనస్సులో ఏముందో కనుక్కోవడం చాలా కష్టంగా ఉందని, అయితే వారి ఆలోచనలను గ్రహించి, తదనుగుణంగా విద్యను బోధించాల్సిన అవసరం ఉందని, సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో విద్యను అందించినప్పుడే విద్యార్థుల్లో మనం ఆశించే చైతన్యం వస్తుందని, విద్యావేత్త చుక్కా రామయ్య చెప్పారు.
ఆచార్య దేవోభవ అవార్డులను నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించామని, విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ విద్యను బోధించే ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడమే దీని లక్ష్యమని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మార్పులు రావాలని, తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలవాలని రామయ్య చెప్పారు.
శాసన సభాపతి మధుసూధనాచారి ఈ విషయంలో చొరవ తీసుకొని విద్యా రంగంలో రావాల్సిన మార్పులు చేపట్టవలసిన సంస్కరణల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తారని తాను భావిస్తున్నానని, అందుకే వారిని ఈ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని రామయ్య చెప్పారు.
ఏసియా కాఫీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బ్రెయిన్ ఫీడ్ మాస పత్రిక ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం తనకెంతో సంతోషముగా ఉందని, ప్రతివారి జీవితంలో గురువుల పాత్ర మహత్తరమైందని, అలాంటి గురువులను సత్కరించుకోవడం కంటే మంచి పని ఇంకేముంటుందని అన్నారు. ఇంతపెద్ద బృహత్కార్యక్రమాన్ని నిర్వహించిన కేవి బ్రహ్మమును ఆయన అభినందించారు.
రామకృష్ణ మఠం డైరెక్టర్ బోధమయానంద మాట్లాడుతూ మన దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, ముందుకు తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులు మీదే ఉండని, అలాంటి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న గురువులందరికీ ప్రణామం అని చెబుతూ, సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్న మానవ సంబంధాల విషయంలో ఇంకా ఎంతో మార్పు రావాలని చెప్పారు.
ఒకడుగు ముందుకేస్తే ఐదడుగుల వెనక్కు పడుతున్నాయని, ఒక సమస్యను పరిష్కరిస్తే మరికొన్ని సమస్యలు చుట్టు ముడుతున్నాయని, రానురానూ మానవ విలువలను మర్చిపోతున్నామేమో అనిపిస్తోందని ఆయన అన్నారు. విద్యార్ధి దశలో సృజనాత్మక దృష్టితో కాకుండా సిలబస్ ను బట్టి పట్టించడమే ముఖ్యమని ఆలోచించడం తగదని ఆయన సలహా ఇచ్చారు. ఇంగ్లీషు చదవడం ముఖ్యం కాదని, ఏ రంగంలోనైనా చరిత్రను సృష్టించడమే ముఖ్యమని, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి విద్యా బోధనా సాగాలని ఆయన సలహా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రితో పాటు మాతృదేశం కూడా ముఖ్యమని, నేటి విద్య విజ్ఞానానికి దారి తీయాలని, అందుకు గట్టి పునాదులు విద్యాలయాల్లోనే పడాలని, అందుకు గురువుల మీద ఎంతో బాధ్యత ఉందని చెప్పారు.
బ్రెయిన్ ఫీడ్ ప్రధాన సంపాదకుడు కేవి బ్రహ్మం మాట్లాడుతూ విద్యారంగంతో తన జీవితం మమేకమైపోయిందని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన తాను ఈ రంగానికి ఇంకా ఎదో చేయాలనే ఉద్దేశంతోనే 2013లోనే బ్రెయిన్ ఫీడ్ ఆంగ్ల మాస పత్రికను ప్రారంభించానని, చాలా తక్కువ కాలంలోనే ఈ పత్రికను దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు ఆదరించడంతో మరో మూడు పత్రికలు ప్రారంభించామని, వీటి సర్క్యూలేషన్ లక్ష దాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
ఆచార్య దేవోభవ అవార్డులను నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించామని, ప్రతి సంవత్సరం ఈ అవార్డులకు ఆదరణ పెరగడంతో తనకెంతో సంతోషాన్ని కల్గించిందని ఆయన అన్నారు.
ఈ అవార్డుల కోసం దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తన మీద మరింత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నానని, ఏ లక్ష్యంతో ఆచార్య దేవోభవ అవార్డులను ప్రారంభించానో ఆ దిశగానే ప్రయాణిస్తానని బ్రహ్మం తెలిపారు.
ఆచార్య దేవోభవ అవార్డుల్లో శ్రీ వెంకటేశ్వరా విద్యాలయం ద్వారకా, న్యూ ఢిల్లీ కి చెందిన శ్రీమతి నీతా అరోరా లక్ష రూపాయల నగదును గెలుచుకున్నారు.
యాభై వేల రూపాయల నగదు బహుమతి శ్రీమతి అంజూ కల్కా పబ్లిక్ స్కూల్, న్యూ ఢిల్లీ, రేవతి శ్రీనివాసన్, థానే గెలుచుకున్నారు.
25 వేల నగదు బహుమతి రంజిత్ కుమార్, రిచర్డ్ గాస్పెర్, మిస్ మంజూ గుప్తా, డాక్టర్ దినేష్ సి.శర్మ గెలుచుకున్నారు.
పదిమంది ఉపాధ్యాయులకు పదివేల చొప్పున నగదు బహుమతుల్ని కూడా అందించడం జరిగింది.
సభకు ముఖ్య అతిథిగా వచ్చిన శాసన సభాపతి మధుసూధనాచారి, విద్యావేత్త చుక్కా రామయ్య, బోధమయానంద, చల్లా రాజేంద్ర ప్రసాద్ ను ఆచార్య దేవోభవ అవార్డుల వేదిక మీద సత్కరించి జ్ఞాపికలను అందించారు.