ఇక తెరపై ఆ నవ్వులు కనిపించవు. ఒరేయ్ సర్వం అంటూ పిలిచే ఆ స్వరం మూగబోయింది. 30 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను నవ్వుల ఉయ్యాల ఊగించిన ఆయన రూపం ఇకపై మనకు కనిపించదు. వందల సినిమాల్లో నటించినా.. ఒక్క అమృతం సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఇంకా చేరువయ్యాడు ఆ నటుడు. అతడే గుండు హనుమంతరావు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ సరైన వైద్యం కూడా తీసుకోవడం లేదు. పైగా డయాలసిస్ పేషెంట్ కూడా. ఈ పరిస్థితులన్నీ తెలిసి ఈ మధ్యే అలీ కూడా గుండు వాళ్ల అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాడు. ఇక చిరంజీవి 2 లక్షలు.. సిఎం సహాయనిధి కింద తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చారు.
గుండు హనుమంతరావు మృతిపై తెలుగు ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ నటుడు 400 కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రతీ సినిమాలోనూ హాస్యంతో కడుపులు చెక్కలు చేసాడు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ తో ఈయన కాంబినేషన్ అద్భుతం. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి సినిమాల్లో రాజేంద్రుడితో గుండు చేసిన కామెడీ కేక పెట్టించింది. ఇప్పటికీ ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్వాపుకోవడం కష్టం. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే అందులో గుండు హనుమంతరావు ఉండాల్సిందే. టాప్ హీరో లాంటి సినిమాల్లో ఆయన కామెడీ బాగా పేలింది.
కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఫిబ్రవరి 19న ఎస్ఆర్ నగర్ లోని తన స్వగృహంలోనే కన్నుమూసారు. హాస్పిటల్ కు తీసుకె ళ్లినా అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. 1956, అక్టోబర్ 10న విజయవాడలో జన్మించాడు గుండు హనుమంత రావు. ఈయనకి సినిమాలంటే పిచ్చి ఉండటంతో చేస్తోన్న మిఠాయి వ్యాపారం కూడా కాదని మద్రాసు రైలెక్కాడు. ఆ తర్వాత చిన్న చిన్న వేశాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యాగ్రహం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. తక్కువ టైమ్ లోనే వందల సినిమాల్లో నటించాడు గుండు. తన టిపికల్ కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా అహ నా పెళ్లంట క్లైమాక్స్ లో బ్రహ్మానందంతో కలిసి వినబడలా అంటూ గుండు చేసిన కామెడీ ఇప్పటికీ గుర్తే. కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు గుండు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన కామెడీ మాత్రం ఎప్పుడూ ఆయన్ని మన మనసుల్లో భద్రంగానే ఉంచుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని కోరుకుందాం..!