రంగస్థలం అనేది ఇప్పుడు పేరు కాదు దాన్నో బ్రాండ్ లా మార్చేసాడు సుకుమార్. ఆయన కలకు సిట్టిబాబు ప్రాణం పోసాడు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది ఈ చిత్రం. విడుదలై రెండు వారాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది ఈ చిత్రం. ఇప్పటికే 103 కోట్ల షేర్ సాధించి..
ఖైదీ నెం.150 రికార్డులని సైతం వెనక్కి నెట్టేసింది రంగస్థలం. ఇదిలా ఉంటే ఇప్పుడు రంగస్థలం ఎక్స్ పీరియన్స్ కేవలం తెలుగు ప్రేక్షకులతోనే ఆగిపోకూడదని ఫిక్సయ్యారు మేకర్స్. అందుకే పక్క భాషల్లోకి కూడా ఈ సినిమాను పంపిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ లో రంగస్థలంను డబ్ చేసి విడుదల చేస్తామని రామ్ చరణ్ ప్రకటించాడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది.
దానికితోడు రంగస్థలంలో తమిళ వాసనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఇక తమిళ్ తో పాటు హిందీ.. మళయాలం.. భోజ్ పురిల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదే జరిగితే అక్కడ్నుంచి కూడా రంగస్థలం ఎంతోకొంత వెనకేయడం ఖాయం. మొత్తానికి మరి చూడాలిక.. రంగస్థలం దూకుడు ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో..?