తమ సినిమాపై నమ్మకం ఉండటం వేరే విషయం.. దాన్ని సరైన దారిలో ప్రమోట్ చేసుకోవడం మరో విషయం.. ఒక్కోసారి ఎంత నమ్మకం ఉన్న సినిమాలైనా సరైన టైమ్ లో విడుదల కాకపోతే ఫ్లాప్ అయ్యే అవకాశాలుంటాయి. ఇప్పుడు నాగార్జున కూడా హలో విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు. తనయుడి సినిమాపై కావాల్సినంత కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని ముందు జనవరిలో విడుదల చేయాలనుకున్నాడు నాగార్జున. కానీ అప్పుడు పవన్ తో పాటు బాలయ్య కూడా వస్తున్నారు. అందుకే లేనిపోని పోటీ ఎందుకని వెనక్కి తగ్గాడు మన్మథుడు. స్వయంగా ఈ విషయం తానే చెప్పాడు నాగార్జున. అఖిల్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో అప్పుడే పెద్ద హీరోలతో పోటీ ఎందుకుని తానే వెనక్కి తగ్గానని చెప్పాడు నాగ్.
పైగా డిసెంబర్ చివర్లో అయితే స్కూల్ కు హాలీడేస్ కూడా ఉంటాయని.. అందుకే యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేయడం కూడా అప్పుడే కరెక్ట్ అని భావించి హలోను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు నాగార్జున. ఇక డిసెంబర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ అనుకోకుండా అది జరిగిందని చెప్పాడు నాగ్. మన్మథుడు సినిమాను మరో డేట్ లేక డిసెంబర్ లో విడుదల చేసామని.. ఆ తర్వాత అనుకోకుండా చాలా సినిమాలు వచ్చాయన్నాడు నాగార్జున. అంతేకాదు.. తన తండ్రి ఏఎన్నార్ నటించిన తొలి సినిమా సీతారామ జననం కూడా డిసెంబర్ 1నే 1944లో విడుదలైందని చెప్పాడు నాగ్. అలా తమకు డిసెంబర్ సెంటిమెంట్ అయిపోయిందన్నాడు ఈ హీరో.