ఓ తెలుగు సినిమాకు ఓవర్సీస్ లో ఫస్ట్ టార్గెట్ మిలియన్ మార్క్ దాటడం.. అది ముందు డెడ్ లైన్. ఆ తర్వాత 2 మిలియన్ అనేది అద్భుతం. అంతకు మించి వస్తే అరాచకమే. ఇప్పటి వరకు ఆ అరాచకం చేసింది బాహుబలి మాత్రమే. శ్రీమంతుడు.. ఖైదీ నెం.150.. ఫిదా.. అ..ఆ.. నాన్నకు ప్రేమతో సినిమాలు మాత్రమే 2 మిలియన్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రికార్డులన్నీ దాటేయాలని చూస్తున్నాడు. ఈయన ఏకంగా బాహుబలి తర్వాత ఉండాలని ఫిక్సైపోయాడు. శ్రీమంతుడుతో పాటు అన్నీ దాటేసి ఏకంగా 5 మిలియన్ మార్క్ పై కన్నేసాడు. ఇప్పుడు ఈ చిత్రం యుఎస్ లో విడుదలవుతున్న తీరు చూస్తుంటే రికార్డులు తిరగరాయడం పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 576 స్క్రీన్స్ లో విడుదల కానుంది ఈ చిత్రం.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఏదీ ఇన్ని స్క్రీన్స్ లో విడుదల కాలేదు. ఇదే పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఉన్న నిదర్శనం. అక్కడ అజ్ఞాతవాసిని ఏకంగా 209 లొకేషన్లలో విడుదల చేయబోతున్నారు. ఇక థియేటర్స్ లెక్క చూస్తే 576 అని తేలింది. ఇండియన్ రికార్డులు తిరగరాసిన బాహుబలి 2 సైతం అక్కడ 140 లొకేషన్లలోనే విడుదలైంది. దానికంటే మరో 60 లొకేషన్లు ఎక్కువ.. 200 స్క్రీన్స్ ఎక్కువగా వస్తుంది అజ్ఞాతవాసి. జనవరి 9నే భారీగా ప్రీమియర్స్ పడుతున్నాయి. ఓవర్సీస్ లో అజ్ఞాతవాసిని 21 కోట్లకి అమ్మారు. అంటే ఈ సినిమా సేఫ్ కావాలన్నా కనీసం 4 మిలియన్ తీసుకురావాలి.
ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ చూస్తుంటే 5 మిలియన్ క్రాస్ చేసేలా కనిపిస్తుంది. రావాల్సిందల్లా హిట్ టాక్ మాత్రమే. అది వచ్చిందంటే రికార్డులన్నీ గల్లంతే. పైగా అక్కడ పవన్ కళ్యాణ్ కు తోడు త్రివిక్రమ్ కు కూడా సూపర్ మార్కెట్ ఉంది. ఇదే అజ్ఞాతవాసికి అదనపు బలం. పవన్ ఫ్లాపుల్లో ఉన్నా కూడా అంతలా ఎలా ఇస్తున్నారని జుట్టు పీక్కుంటున్నారు కొందరు హీరోలు. అజ్ఞాతవాసి హిట్టైతే పవన్ మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 120 కోట్ల మేర జరుగుతుంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.