మహానటి.. ఈ పేరు ఒక్క సావిత్రి గారిని తప్ప మరో నటిని పిలవడానికి లేదు. అంతగా ఆ బిరుదును తనకు అంకితం చేసుకుంది ఆ మహానటి. ఆమె జీవితం కేవలం 45 ఏళ్లే. కానీ ఆ జీవితంలోనే ఎన్నో చేసింది.. సంచలనాలు సృష్టించింది.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నటి అంటే ఎలా ఉండాలో..
ఎలా ఉండకూడదో కూడా ఆమె జీవితం నేర్పించింది. సావిత్రి జీవితం అంటే పూలపాన్పు కాదు.. అలాగని కష్టాల కడలి కూడా కాదు. సినిమాను మించిన ట్విస్టులు ఈమె జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మహానటిలో చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్ర ఆడియో వేడుకకు ఇండస్ట్రీ అంతా కదిలింది. ఎన్టీఆర్.. నాగార్జున.. రాఘవేంద్రరావ్ తో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు.. దర్శకులు.. హీరోలు వచ్చారు ఈ వేడుకకు. ప్రతీ ఒక్కరు అక్కడికి వచ్చింది ఆ మహానటిపై ఉన్న గౌరవంతోనే.
ఎన్టీఆర్ కూడా మనసులో ఉన్న చాలా మాటలను మాట్లాడేసాడు. సావిత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ.. వయసు కానీ తనకు లేవని చెప్తూనే చాలా అద్భుతంగా మాట్లాడాడు ఎన్టీఆర్. ఆమె గురించి చెప్పడానికి ఎక్కడ మొదలుపెట్టి.. ఎక్కడ ఆపాలో కూడా అర్థం కావడం లేదన్నాడు జూనియర్. మరీ ముఖ్యంగా సావిత్రి గారిని చూడలేకపోయినా.. ఆమె పిల్లల్ని కలవడం తన అదృష్టం అన్నాడు. ఇక ప్రకృతి తలుచుకుని.. సావిత్రి గారి ఆత్మే తలుచుకుని నాగ్ అశ్విన్ తో ఈ చిత్రం తెరకెక్కించేలా చేసారని చెప్పాడు ఎన్టీఆర్. ఈ చిత్రం చూసిన తర్వాత మగాళ్లంతా తాము మగ జన్మ ఎందుకు ఎత్తాం అని బాధ పడతారంటూ చెప్పడం హైలైట్. ఇక ఈ చిత్రంలో తాత పాత్రలో నటించే అవకాశం వచ్చినా.. తాను ధైర్యం లేక చేయలేదని చెప్పాడు నందమూరి తారక రామారావు.
ఇక నాగార్జున కూడా సినిమా గురించి.. సావిత్రి గారి గురించి చాలా బాగా మాట్లాడాడు. ముఖ్యంగా అమ్మాయిల గురించి నాగ్ మాట్లాడిన మాటలు అందరితోనూ ప్రశంసల వర్షం కురిపించేలా చేసాయి. ఈ సినిమాకు నిర్మాతలు స్వప్న.. ప్రియాంకదత్.. అశ్వినీదత్ కాదు. ఈ సినిమాలో 20 మంది మహిళలు టెక్నీషియన్స్ గా వర్క్ చేశారు. ఇది నిజంగా అద్భుతం. అంతేకాదు.. ఇంత భారీ సెట్ నిర్మాణం చేసినది కూడా ఆడపిల్లలే అని తెలిసింది. మన తెలుగు ఇండస్ట్రీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. టైం మారుతోంది. థింగ్స్ మూవింగ్.. మనం కూడా మారాల్సి ఉందంటూ నాగ్ మహానటి గురించి మాట్లాడారు. అంతేకాదు.. తన కోడలు సమంతపై.. సావిత్రిగా నటించిన కీర్తిసురేష్ పై కూడా పొగడ్తల జల్లు కురిపించాడు.
నాని కూడా తన దర్శకుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. మహానటి గురించి మాట్లాడే వయసు, అనుభవం తనకు లేవని చెప్పాడు నాని. ఈ వేడుకకు వచ్చిన మిగిలిన వాళ్లు కూడా సావిత్రి గారిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా సావిత్రి కుటుంబం మొత్తం ఈ ఆడియో వేడుకకు రావడం హైలైట్. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మేకింగ్ వీడియో కూడా అదిరిపోయింది. సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు అంతా. మరీ ముఖ్యంగా మహానటి లాంటి సినిమా తీసినందుకు తాను గర్వంగా ఉన్నానని చెప్పాడు నాగ్ అశ్విన్. మరి చూడాలిక.. వీళ్లందరి నమ్మకాలను ఈ చిత్రం ఎంతవరకు నిలబెడుతుందో..?