అవును.. ఇప్పుడు మన హీరోలంతా ఇదే పాట పాడుకుంటున్నారు. అంతా ఒకేసారి ఈ సోగకళ్ల సుందవరికి ఫిదా అయిపోతున్నారు. వరసగా స్టార్ హీరోలు పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. అను ఎమ్మాన్యువల్ ను చూస్తుంటే మరో ఏడాదిలోనే టాప్ హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ తన సత్తా చూపిస్తుంది ఈ మళయాల ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో ఒక్కోసారి అంతే.. అదృష్టం వెతుక్కుంటూ వచ్చి మరీ డోర్ తడుతుంది. అప్పుడు తీస్తే ఇక స్టార్ అయిపోవచ్చు. ఇప్పుడు అను ఎమ్మాన్యువల్ ఇదే చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ అజ్ఞాతవాసిలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ చివరికి వచ్చేసింది. ఈ చిత్రంలో నటిస్తుండగానే బన్నీ నా పేరు సూర్యలో అవకాశం ఇచ్చాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. వరస సినిమాలతో ఊహించిన దానికంటే చాలా త్వరగానే గుర్తింపు తెచ్చుకుంది అను.
మజ్ను సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న అను.. కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో పర్లేదనిపించింది. పనిలో పనిగా ఫోటోషూట్లలో కూడా రెచ్చిపోతుంది అను ఎమ్మాన్యువల్. ఇవన్నీ నడుస్తుండగానే నాగచైతన్య-మారుతి సినిమాలోనూ అను ఎమ్మాన్యువల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ అవకాశం రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ అంటే త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ తరహాలోనే. పవన్ చిత్రంలో నటనకు పడిపోయి తానే నిర్మాత చినబాబుకు అనును నాగచైతన్య సినిమా కోసం రిఫర్ చేసాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాల్లో అను ఎమ్మాన్యువల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్-బోయపాటి సినిమాలో.. రాజమౌళి-ఎన్టీఆర్-చరణ్ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కు జోడీగా అను ఎమ్మాన్యువల్ నే తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇవన్నీ కానీ వర్కవుట్ అయితే అను ఎమ్మాన్యువల్ నెంబర్ వన్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.