ఈ ఇండస్ట్రీకి ఏమైంది..? విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కొందరు.. అంతలోనే అదఃపాతాళానికి పడిపోయి జీవితం ముందుకు సాగ లేక కొందరు.. కెరీర్ లో సరైన బ్రేక్ రాలేదని మరికొందరు.. కుటుంబ కలహాలతో ఇంకొందరు.. ప్రేమ పేరుతో మరికొందరు.. నిండు జీవితాన్ని మధ్యలో తుంచేస్తున్నారు. ఇండస్ట్రీలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. ఆత్మహత్య ఇప్పుడు ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంకా ఉదయ్ కిరణ్, రంగనాథ్, నితిన్ కపూర్, సీరియల్ యాక్టర్ ప్రదీప్ కుమార్ మరణాలు తాజాగా ఉండగానే.. ఇప్పుడు కమెడియన్ విజయ్ సాయి ఆత్మ హత్య ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఆ మధ్య సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా కుటుంబ కలహాలతో ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్యే సీరియల్ యాక్టర్ ప్రదీప్ కుమార్ కూడా సుసైడ్ మార్గం ఎంచుకున్నాడు.
ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే ఇతడి మరణానికి కారణమని తెలుస్తుంది. గత 18 ఏళ్లుగా ఈయన ఖాళీగానే ఉన్నారు. ఈయన నిర్మాతగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ఈయన డిప్రెషన్ లోకి వెళ్లారు. ఈ మధ్య చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ చిన్న సమస్య ఎదురైనా పోరాడలేక జీవితాన్ని చాలిస్తున్నారు. ఆ మధ్య ఓంకార్ ఆట షో లో డాన్సర్ గా మంచి పేరు సంపాదించిన భరత్.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓంకార్ షో లో కామెడీ చేస్తూ.. కొరియోగ్రఫర్ గానూ మంచి పేరు సంపాదించాడు భరత్. అయితే కొంతకాలంగా అవకాశాలు లేకపోవడం.. ఆర్థికంగా బాగా చితికిపోవడంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు భరత్. సీనియర్ నటుడు రంగనాథ్ సైతం ఆ మధ్య సుసైడ్ చేసుకోవడం విచారకరం.
రంగుల జీవితాలు పైకి చూడ్డానికి అద్దాల మేడలా కనిపిస్తాయని ఇప్పటికే ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. ఆ మధ్య నితిన్ కపూర్ చావుతో మరోసారి అది నిరూపితమైంది. ఇద్దరబ్బాయిలు, భార్య ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించారు నితిన్ కపూర్. విజయాలు రాకపోవడం కూడా ఆయన్ని బాగా కలిచివేసింది. ఇక రంగనాథ్ కూడా కుటుంబ సభ్యులు ఉండి కూడా అనాథలా ఆయన వెళ్లిపోయారు. ఇంట్లోనే డెస్టినీ అంటూ తన తలరాతను తనే బలవంతంగా తుడిచేసుకున్నారు. అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు విజయ్ సాయి కూడా కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి మరీ తనువు చాలించాడు.
భరత్ జీవితం కూడా అంతే. చాలా తక్కువ టైమ్ లోనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. డాన్సర్ గా, కమెడియన్ గా, కొరియోగ్రఫర్ గా.. చాలా రంగాల్లో నైపూణ్యం కనబరిచాడు. కానీ ఏం చేస్తాం.. 34 ఏళ్లకే తనువు చాలించాడు. మూడేళ్ల కింద ఉదయ్ కిరణ్ కూడా అచ్చుఇలాగే ఆత్మహత్యతో అందర్నీ విడిచి వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ విజయాలతో తెలుగు ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన ఉదయ్.. చివరికి అలాగే కిరణంలా రాలిపోయాడు. బాలీవుడ్ లో జియాఖాన్.. టాలీవుడ్ లో సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, దివ్యభారతి.. ఇలా చెప్పుకుంటూ పోతే రంగుల జీవితాల్లో నల్లమచ్చలు ఎన్నో కనిపిస్తాయి. మొత్తానికి సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాకపోయినా.. మనోవేదనతో క్షణికావేశం లో నిండు జీవితాల్నినిలువునా వదిలేస్తున్నారు వీళ్లంతా. ఇకనైనా ఈ విషాదాలకు ఫుల్ స్టాప్ పడాలని ఆ దేవున్ని కోరుకుందాం..!